PM Modi | హైదరాబాద్/నారాయణపేట, మే 10 : ‘తెలంగాణలో అధికారంలోకి వచ్చిన ఐదు నెలల్లోనే కాంగ్రెస్ అవినీతి మొదలు పెట్టింది. కేంద్రం ఇచ్చే నిధులను ఏటీఎంలా మార్చుకున్నది. గల్లీస్థాయిలో వసూలు చేస్తున్న ఆర్ఆర్ ట్యాక్స్‌ను ఢిల్లీ నేతలకు పంపుతున్నది. తాజాగా ఇక్కడ ఆర్ఆర్ఆర్ ట్యాక్స్ కూడా మొదలైంది. మూడో ఆర్ అంటే రజాకార్ ట్యాక్స్’ అని కాంగ్రెస్‌పై ప్రధాని నరేంద్రమోదీ దుమ్మెత్తిపోశారు. పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా, నారాయణపేట జిల్లా కేంద్రం, హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన సభల్లో ఆయన మాట్లాడారు. ఆర్ఆర్ ట్యాక్స్‌పై ఇప్పటికే ఢిల్లీలోనూ చర్చ నడుస్తున్నదని, తాను ఎవరి పేరు చెప్పకుండా ఆర్ఆర్ ట్యాక్స్ అంటే కాంగ్రెస్ ముఖ్యమంత్రి మాత్రం భుజాలు తడుముకుంటూ విలేకరుల ముందుకొచ్చి ఈ విషయంపై అవాకులు చెవాకులు పేలుతున్నారంటే ఆ ట్యాక్స్ ఎవరు వసూలు చేస్తున్నారో స్పష్టమవుతున్నదని చెప్పారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించాల్సిన అవసరం ఎంతో ఉందని నొక్కి చెప్పారు. కాంగ్రెస్‌లో ఉన్న రాకుమారుడు ఎన్నికల ముందు మొహబ్బత్ తీసుకొచ్చి దేశాన్ని ముక్కలు చేసేందుకు ప్రయత్నిస్తున్నాడని ఆరోపించారు.
అమెరికాలో ఉంటున్న రాకుమారుడి గురువు శ్యాం పిట్రోడా దేశ ప్రజలను ఆఫ్రికన్లుగా, నల్ల చర్మం గల వారిగా హేళన చేసి మాట్లాడుతున్నారని, దేశంలోని హిందువులను మైనార్టీలుగా మార్చేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తున్నదని విమర్శించారు. హిందువులన్నా, హిందూ పండుగలన్నా కాంగ్రెస్‌కు వ్యతిరేకమని దుయ్యబట్టారు. ధర్మం, మతం ఆధారంగా రిజర్వేషన్లు ఇవ్వడానికి వీలులేదని కాంగ్రెస్‌కు తెలిసినా బీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు ఆపి ముస్లింలకు ఇచ్చేందుకు ఆ పార్టీ ప్రయత్నిస్తున్నదని ఆరోపించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ముస్లింలకు ఏవిధంగా రిజర్వేషన్ ఇచ్చేందుకు ప్రయత్నించిందో అదేవిధంగా దేశవ్యాప్తంగా ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నదని చెప్పారు. ముస్లిం రిజర్వేషన్ల విషయంలో శక్తివంచన లేకుండా కృషి చేస్తున్న కాంగ్రెస్, మాదిగల విషయంలో ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. ఉమ్మడి పౌరస్మృతిని (యూనిఫాం సివిల్‌కోడ్)ను వద్దన్నవారు, ఆర్టికల్ 370 రద్దును వ్యతిరేకించినవారు జూన్ 4తర్వాత పారిపోక తప్పదని ఎద్దేవా చేశారు. దేశాన్ని లూటీ చేయడం, వారసత్వ రాజకీయాలు చేయడంలో కాంగ్రెస్‌ది ట్రాక్ రికార్డు అని, ఆ పార్టీ పాలనలో ఎన్నోచోట్ల బాంబు పేలుళ్లు జరిగాయని, ఎక్కడికెళ్లాలన్నా భయపడాల్సి వచ్చేదని విమర్శించారు.