న్యూఢిల్లీ: 60 దేశాలతో బంధాలను మరింత బలోపేతం చేసుకునేందుకు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా పార్లమెంటరీ ఫ్రెండ్షిప్ బృందాల(Parliamentary Friendship Groups)ను ప్రకటించారు. సీనియర్ ఎంపీల నేతృత్వంలోని బృందాలు ఆ దేశాలను విజిట్ చేస్తాయి. అన్ని పార్టీల నేతలు ఈ గ్రూపుల్లో ఉన్నారు. భారతీయ ప్రజాస్వామ్య వ్యవస్థ గురించి వివిధ దేశాల్లో ఆ బృందాలు ప్రచారం చేస్తాయని లోక్సభ సెక్రటేరియేట్ పేర్కొన్నది. సీనియర్ నేతలు రవిశంకర్ ప్రసాద్, ఎం తంబిదురై, పీ చిదంబరం, రామ్గోపాల్ యాదవ్, టీఆర్ బాలు, కక్కొలి ఘోష్ దస్తీదార్, గౌరవ్ గగోయ్, కనిమొళి, మనీష్ తివారీ, డెరిక్ ఒబ్రెయిన్, అభిషేక్ బెనర్జీ, అసదుద్దీన్ ఓవైసీ, అఖిలేశ్ యాదవ్, కేసీ వేణుగోపాల్, రాజీవ్ ప్రతాప్ రూఢీ, సుప్రియా సూలే, సంజయ్ సింగ్, బైజయంత్ పాండే, శశిథరూర్, నిషికాంత్ దూబే, అనురాగ్ సింగ్ ఠాకూర్, హేమామాలినీ, బిప్లబ్ కుమార్ దేబ్, సుధాంశు త్రివేదితో పాటు మరికొంత మంది సీనియర్లు ఆయా గ్రూపులకు నాయకత్వం వహించనున్నారు.
వివిధ ఖండాల్లోని శాసన వ్యవస్థలతో భారతీయ పార్లమెంటరీ బృందాలు దౌత్యం నిర్వహించనున్నాయి. పార్లమెంటరీ వ్యవస్థను బలోపేతం చేసే ఉద్దేశంతో ఈ ప్రక్రియ చేపట్టినట్లు స్టేట్మెంట్లో తెలిపారు. శ్రీలంక, జర్మనీ, న్యూజిలాండ్, స్విట్జర్లాండ్, సౌత్ ఆఫ్రికా, భూటాన్, సౌదీ అరేబియా, ఇజ్రాయిల్, మాల్దీవులు, యూఎస్ఏ, రష్యా, ఈయూ పార్లమెంట్, దక్షిణకొరియా, నేపాల్, యూకే, ఫ్రాన్స్, జపాన్, ఇటలీ, ఓమన్, ఆస్ట్రేలియా, గ్రీస్, సింగపూర్, బ్రెజిల్, వియత్నాం, మెక్సికో, ఇరాన్, యూఏఈ దేశాలకు ఆ బృందాలు వెళ్లనున్నాయి.