Vibha Yadavalli | హైదరాబాద్, ఆగస్టు 3, (నమస్తే తెలంగాణ) | భారతీయ సనాతన శాస్త్రీయ నృత్య రూపమైన కూచిపూడిని అమెరికా గడ్డపై ప్రచారం చేస్తూ, తెలుగు కీర్తిని ఇనుమడింపజేస్తున్నారు యువ నర్తకి విభా యాదవల్లి. టెక్సాస్ లోని లేక్ ట్రావిస్ హైసూల్ లో జూనియర్ విద్యార్థినిగా చదువుతున్న విభా, కేవలం 16 సంవత్సారాల చిన్న వయసులోనే నాట్య రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.
విభా నాట్య ప్రయాణం కాలిఫోర్నియాలో లక్ష్మీ భవానీ కొండూరు వద్ద ప్రారంభమైంది. అక్కడ కూచిపూడికి బలమైన పునాది వేసుకున్న విభా 2021లో టెక్సాస్‌కు తమ మకాం మార్చాక ప్రముఖ నాట్యాచార్యులు రాజీ రాయప్రోలు, పసుమర్తి వెంకటేశ్వర శర్మల ఆధ్వర్యంలో శిక్షణ తీసుకున్నారు. తల్లి దండ్రులు జోత్న, శ్రీరాం యాదవెల్లి ప్రోత్సాహంతో ,గురువుల అండదండలతో ఆమె నృత్యంలో అభినయం, భంగిమలు, లయ బద్ధత సాంప్రదాయ సౌందర్యం మరింత పరిపూర్ణమయ్యాయి.
కథకురాలిగా, కళాకారిణిగా విజయాలు..
ఆస్టిన్ పరిసర ప్రాంతాలలో జరిగిన అనేక సాంసృతిక కార్యక్రమాలు, నాట్య నాటికలు, రీసైటిల్స్ లో సామాజిక వేదికలపై ప్రదర్శనలు ఇస్తూ విభా ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తున్నారు. కేవలం అడుగుల గజిబిజి కాకుండా, హావభావాలతో పాత్రలకు జీవం పోస్తూ మంచి కథకురాలిగానూ ఆహూతుల ప్రశంసలు అందుకున్నారు. కేవలం కూచిపూడికే పరిమితం కాకుండా, విభా తన హైసూల్ వర్సిటీ డ్యాన్స్ టీమ్ లోనూ క్రియాశీల సభ్యురాలిగా రాణిస్తున్నారు. ఇది ఆమెలో నాయకత్వ లక్షణాలు, టీమ్ వర్, క్రమశిక్షణను పెంపొందించింది. శాస్త్రీయ,కంటెంపరరీ (సమకాలీన) నృత్యాలను సమపాళ్లలో అభ్యసిస్తూ తన కళా దృష్టిని మరింత విశాలం చేసుకున్నారు.
తన విజయానికి కారణమైన గురువులకు, నిత్యం తనకు అండగా నిలిచిన కుటుంబ సభ్యులకు విభా ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సంవత్సరాల తరబడి చేసిన కఠిన సాధన తాలూకు ఫలాలను ఆస్వాదిస్తూ, భవిష్యత్తులోనూ కూచిపూడి వైభవాన్ని భావితరాలకు చాటిచెప్పడమే తన లక్ష్యమని ఆమె ధీమా వ్యక్తం చేశారు.
