Vinesh Phogat | బ్రిజ్ భూషణ్ లైంగిక వేధింపులపై మూడేళ్ల క్రితం మహిళా రెజ్లర్లు చేపట్టిన నిరసనలు దేశంలో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. వీరి పోరాట ఫలితంగా బ్రిజ్ భూషణ్‌పై కేసు నమోదు చేశారు. విచారణ అనంతరం ఢిల్లీ కోర్టు బ్రిజ్ భూషణ్‌కు క్లీన్ చిట్ ఇస్తూ తీర్పు వెలువరించింది. దీనిపై వినేశ్ ఫోగట్ (Vinesh Phogat) స్పందిస్తూ.. బ్రిజ్ భూష్ణ్ను రక్షించడానికి వ్యవస్థ మొత్తం పనిచేసిందని ఆరోపించారు. దీనిపై న్యాయపోరాటాన్ని కొనసాగిస్తామని వెల్లడించారు. మహిళా రెజ్లర్లు తమ పోరాటాన్ని విడిచిపెట్టరని, ఢిల్లీ కోర్టు తీర్పుపై అప్పీల్‌కు వెళతామని ఆమె పేర్కొన్నారు. ఈ విషయంలో ఉన్నత న్యాయస్థానంలో అప్పీలు చేయాలని తమ లీగల్ టీమ్‌కు సూచించామని వెల్లడించారు.
అధికార పార్టీకి చెందిన ప్రముఖ నాయకుడిపై ఎఫ్ఐఆర్ (FIR) నమోదు చేయించడానికి ధైర్యాన్ని కూడగట్టుకుని వీధుల్లోకి వచ్చి నిరసనలు చేపట్టాం. కేసు వాపసు తీసుకోమని అతడు తన పలుకుబడితో, కండబలంతో ఫిర్యాదుదారులను బెదిరించాడని ఆమె ఆరోపించారు. అయినా భయపడకుండా తమ న్యాయపోరాటాన్ని కొనసాగించామని తెలిపారు. కానీ ఢిల్లీ కోర్టు అతడిని నిర్దోషిగా తేల్చడం మాకు తీవ్ర నిరాశను కలిగించిందని వాపోయారు. అయినా దీనిపై వెనుకడుగు వేయమని, న్యాయం జరిగే వరకు పోరాడతామని పేర్కొన్నారు.
— Vinesh Phogat (@Phogat_Vinesh) August 3, 2026