Chhattisgarh : ఒకప్పుడు పెళ్లి అనేది పూర్తిగా పెద్దల చేతులమీదుగా జరిగేది. ఆఖరికి వధువు వరుడిని, వరుడు వధువును ఎంపిక చేసుకునే అవకాశం కూడా ఉండకపోయేది. పెద్దలు పెళ్లిచేస్తే కలిసి బతికేవారు. కానీ రానురాను కాలం మారింది. ఎవరి హక్కులు వాళ్లు తెలుసుకున్నారు. నచ్చిన మనిషిని పెళ్లి చేసుకునే అవకాశాన్ని సంపాదించారు. స్మార్ట్ఫోన్లు (Smart phones) వచ్చిన తర్వాత పరిస్థితి మరోలా మారింది. పెళ్లి నిశ్చయం అయ్యింది మొదలు ఫోన్లలో గంటల తరబడి మాట్లాడుకుంటున్నారు. అయితే ఇలా మాట్లాడుకోవడంపై ఛత్తీస్‌గఢ్ (Chhattisgarh) లోని ఓ సామాజిక వర్గం నిషేధం విధించింది.
పెళ్లి కుదరగానే కాబోయే వధూవరులిద్దరూ ఫోన్లలో ముచ్చట్లు మొదలు పెడుతున్నారు. గంటల తరబడి ఫోన్లో మాట్లాడుకుంటున్నారు. ఈ మితిమీరిన సంభాషణల కారణంగా చాలా సందర్భాల్లో ఇద్దరి మధ్య అపోహలు తలెత్తి పెళ్లిపీటలు ఎక్కకుండానే విడిపోతున్నారు. ఈ నేపథ్యంలో ఛత్తీస్‌గఢ్‌లోని బాలోద్ జిల్లాలో సేన్ సమాజిక వర్గం కీలక నిర్ణయం తీసుకుంది. తమ సామాజికవర్గానికి చెందిన వధూవరులు నిశ్చితార్థం తర్వాత పెళ్లయ్యేదాకా ఫోన్లలో మాట్లాడుకోవడంపై నిషేధం విధించింది.
ఈ ఫోన్లు కుటుంబ సంబంధాలను విచ్ఛిన్నం చేస్తున్నాయని, అందుకే తమ సామాజికవర్గ సమావేశంలో పెళ్లయ్యేదాక వధూవరులు ఫోన్లు మాట్లాడుకోవద్దని ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నామని సేన్ కమ్యూనిటీ బాలోద్ జిల్లా అధ్యక్షుడు సంతోష్ కౌశిక్ తెలిపారు. నిశ్చితార్థం జరిగాక యువతీ యువకులు కుటుంబసభ్యుల సమక్షంలో మాట్లాడుకోవడంపై ఎలాంటి అభ్యంతరం లేదన్నారు.