Harish Rao | వ్యాధి వచ్చిన తర్వాత చికిత్స చేయించుకోవడం కంటే, రాకముందే గుర్తించి నివారించుకోవడం ఉత్తమ మార్గం అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు స్పష్టం చేశారు. ప్రారంభ దశలో గుర్తింపే క్యాన్సర్‌పై విజయానికి కీలకం అన్నారు. సిద్ధిపేటలోని విపంచి ఆడిటోరియంలో సింధూ హాస్పిటల్ సహకారంతో నిర్వహిస్తున్న 2 రోజుల ఉచిత క్యాన్సర్ నిర్ధారణ శిబిరాన్ని హరీశ్ రావు ప్రారంభించారు.
ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ.. ఆరోగ్యం కంటే గొప్ప సంపద మరొకటి లేదని, వ్యాధి వచ్చిన తర్వాత చికిత్స కంటే ముందుగానే గుర్తించి నివారించుకోవడం ఎంతో ముఖ్యమని అన్నారు. క్యాన్సర్‌కు భయపడాల్సిన అవసరం లేదని, ప్రారంభ దశలో గుర్తిస్తే అనేక రకాల క్యాన్సర్లను పూర్తిగా నయం చేయవచ్చని చెప్పారు. ముఖ్యంగా 40 సంవత్సరాలు దాటిన మహిళలు రొమ్ము క్యాన్సర్, గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలను క్రమం తప్పకుండా చేయించుకోవాలని సూచించారు. కేన్సర్ వ్యాధితో కుటుంబాలు అన్ని రకాలుగా నష్టపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మారిన జీవనశైలి ఆహారపు అలవాట్లు క్యాన్సర్ కేసుల పెరుగుదలకు కారణమవుతున్నాయి అన్నారు.
ఈ శిబిరంలో నిర్వహిస్తున్న మామోగ్రామ్, పాప్ స్మియర్ వంటి పరీక్షలు సాధారణంగా ప్రైవేట్ ఆసుపత్రుల్లో వేల రూపాయలు ఖర్చవుతాయని, ఇక్కడ మాత్రం పూర్తిగా ఉచితంగా అందిస్తున్నామని తెలిపారు. ప్రతి మహిళ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని హరీశ్ రావు కోరారు. పొగాకు, గుట్కా, పాన్ మసాలా వంటి అలవాట్లు నోటి క్యాన్సర్‌కు ప్రధాన కారణాలని పేర్కొంటూ, అలాంటి అలవాట్లను కుటుంబ సభ్యులకు మాన్పించే బాధ్యత అందరిదని హరీశ్ రావు అన్నారు.
మహిళ ఆరోగ్యంగా ఉంటే కుటుంబం ఆరోగ్యంగా ఉంటుంది..
బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజారోగ్యానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చిందని, జిల్లాల వారీగా మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్, ఎంఎన్‌జే క్యాన్సర్ ఆసుపత్రిలో ఆధునిక వైద్య సేవలు, ‘ఆరోగ్య మహిళ’ వంటి కార్యక్రమాలను అమలు చేసిందని హరీశ్ రావు గుర్తు చేశారు. ఒక మహిళ ఆరోగ్యంగా ఉంటే ఒక కుటుంబం ఆరోగ్యంగా ఉంటుంది. ఒక కుటుంబం ఆరోగ్యంగా ఉంటే సమాజం ఆరోగ్యంగా ఉంటుంది. అందుకే మహిళల ఆరోగ్య పరిరక్షణకు మేము ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నాం. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలు కూడా నాణ్యమైన వైద్య సేవలు పొందాలనే ఉద్దేశంతో సింధూ హాస్పిటల్ సహకారంతో ఈ ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరాన్ని నిర్వహిస్తున్నామన్నారు.
‘స్వచ్ఛ సిద్ధిపేటతోపాటు హెల్తీ సిద్ధిపేట కూడా మన లక్ష్యం కావాలి. ప్రతి ఇంట్లో ఉన్న మహిళలను ఈ శిబిరానికి తీసుకువచ్చి ఉచిత పరీక్షలు చేయించండి. ఒక చిన్న పరీక్ష ప్రాణాలను కాపాడగలదు’ అని హరీశ్ రావు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి సహకరించిన హైదరాబాద్ సింధూ హాస్పిటల్ వైద్యులు, వైద్య సిబ్బంది, నిర్వాహకులకు హరీశ్ రావుకృతజ్ఞతలు తెలిపారు.

US Tariff Bill | అమెరికా రష్యాపై ఆంక్షల బిల్లు.. భారత్, చైనాలపై సుంకాల చిల్లు