కారేపల్లి, ఫిబ్రవరి 23 : నాగర్కర్నూల్ జిల్లా కుమ్మరా గ్రామంలో జాతర సందర్భంగా జరిగిన పసికందు మృతిని నిరసిస్తూ కారేపల్లి మంఢలం సీతారాంపురంలో సోమవారం కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన ఈ ర్యాలీలో యువకులు కొవ్వొత్తులు పట్టుకుని కుల వివక్షత, అణగారిన వర్గాలపై దాడులను నిరసించారు. ఈ సందర్భంగా ధర్మ సమాజ్ పార్టీ సింగరేణి మండల కన్వీనర్ గుండమల్ల కార్తీక్ కుమార్ మాట్లాడుతూ.. పసికందు బేబి మౌనిక కుల మౌడ్యానికి బలి కావటం విచారకరమన్నారు. ఘటన జరిగిన వెంటనే బాధితులకు అండగా ఉండాల్సిన అధికార వ్యవస్ధ దాడి చేసిన అగ్ర కులస్తులకు వత్తాసు పలుకుతూ బాధితులపై కేసు నమోదు చేయడం విచారకరమన్నారు. బాలిక మృతి కేసులో నిందుతులను వెంటనే అరెస్టు చేయాలని, బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ధర్మసమాజ్ పార్టీ నాయకులు కుమ్మరికుంట ఉపేందర్, పూనెం రవి, నవీన్నాయక్, సాయుకుమార్, రాకేష్, ప్రశాంత్ పాల్గొన్నారు.