Kaleswaram | కాళేశ్వరం: ఆలయ పునర్నిర్మాణంపై సోషల్ మీడియాలో జరుగుతున్న అసత్య ప్రచారాలను కాళేశ్వర ముక్తీశ్వర (Mukteeswara Swamy) స్వామి దేవస్థాన అర్చకులు ఖండించారు. ఈ మేరకు వారు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఆలయ కూల్చివేత నేపథ్యంలో అర్చకులు భావోద్వేగానికి గురయ్యారని, పునర్నిర్మాణాన్ని వ్యతిరేకిస్తున్నారనే ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని అన్నారు. ఆలయ పునర్నిర్మాణానికి తాము పూర్తి మద్దతు తెలుపుతున్నామని, కృష్ణశిలతో శాశ్వత రాతి కట్టడంగా ఆలయం నిర్మాణం కావడం తమ అదృష్టంగా భావిస్తున్నామని పేర్కొన్నారు. శృంగేరి శారదా పీఠం జగద్గురు శ్రీ శ్రీ శ్రీ విధుశేఖర భారతీ మహాస్వామి అనుమతి, ఆశీస్సులతోనే శాస్త్రోక్తంగా పునర్నిర్మాణ పనులు ప్రారంభించినట్లు తెలిపారు.
దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు ఆధ్వర్యంలో జూన్ 16న ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, భక్తులు, విలేకరుల సమావేశం (Press Meet) నిర్వహించి పునర్నిర్మాణ వివరాలను వెల్లడించామని, జూన్ 17న కళాపకర్షణ, ద్వారబంధనం నిర్వహించి ఆదిముక్తీశ్వర స్వామి ఆలయంలో బాలాలయాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ప్రస్తుతం నిత్యాభిషేకాలు, నిత్యార్చనలు, కాలసర్ప దోష నివారణ, శని (నవగ్రహ) పూజలు యథావిధిగా కొనసాగుతున్నాయని వెల్లడించారు.
రూ.198 కోట్లతో ప్రభుత్వం కాళేశ్వర క్షేత్రాన్ని సమగ్రంగా అభివృద్ధి చేస్తోందని, శిథిలావస్థకు చేరిన 1982 నాటి గర్భాలయ స్థానంలో కృష్ణశిలతో శాశ్వత రాతి కట్టడాన్ని నిర్మిస్తున్నట్లు వివరించారు. భక్తులు సోషల్ మీడియాలో వస్తున్న అసత్య ప్రచారాలను నమ్మవద్దని, దేవస్థానం అధికారిక సమాచారాన్నే విశ్వసించాలని కోరారు. సమావేశంలో ఆలయ ప్రధాన అర్చకులు పనగంటి ఫణీంద్ర శర్మ, ముఖ్య అర్చకులు ఆరుట్ల రామాచార్యులు, అర్చకులు గట్టు రాము, రామకృష్ణ, శరత్ చంద్ర శర్మ, పవన్ శర్మ, విజయ్ శర్మ, రాజు శర్మ, ఫణి శర్మ, రాధాకృష్ణ శర్మ పాల్గొన్నారు.