– సర్వే నంబర్ 548లో మట్టి తరలింపుపై గ్రీవెన్స్‌లో ఫిర్యాదు
కారేపల్లి, సెప్టెంబర్ 28 : సింగరేణి మండలం ఉసిరికాయలపల్లి రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 548లో అనుమతులు లేకుండా మట్టి తవ్వకాలు చేపట్టి తరలించారని ఆరోపిస్తూ వాసిరెడ్డి సంపత్‌కుమార్ తాసీల్దార్ ఓరుగంటి వెంకటేశ్వర్లుకు సోమవారం జరిగిన గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేశారు. గోదాముల నిర్మాణం కోసం స్థలాన్ని కేటాయించినప్పటికీ సంబంధిత రెవెన్యూ, మైనింగ్ శాఖల నుండి పూర్తిస్థాయి అనుమతులు పొందకుండానే పనులు చేపట్టినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. పనులు చేపడుతున్న కాంట్రాక్టర్ సర్వే నంబర్ 548లో ఉన్న మట్టిని పెద్ద మొత్తంలో తవ్వి బయటకు తరలించినట్లు ఆరోపించారు. సంబంధిత నిబంధనలు, 1996 జీవో, 107 రూల్స్ ప్రకారం అనుమతులు, నిబంధనలను పరిశీలించాల్సిన అవసరం ఉందన్నారు.
ఇప్పటివరకు తవ్వి తరలించిన మట్టి పరిమాణాన్ని అధికారులు కొలతలు వేసి నిర్ధారించాలని, తవ్వాల్సిన మట్టి పరిమాణాన్ని కూడా లెక్కించి నిబంధనల ప్రకారం రుసుము వసూలు చేయాలని కోరారు. మట్టి తవ్వకాలు, తరలింపుల్లో నిబంధనల ఉల్లంఘన జరిగినట్లు తేలితే బాధ్యులైన కాంట్రాక్టర్‌తో పాటు సంబంధిత అధికారులపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సంపత్‌కుమార్ తన ఫిర్యాదులో విజ్ఞప్తి చేశారు. ఈ వ్యవహారంపై అధికారులు స్థల పరిశీలన చేసి వాస్తవాలను నిర్ధారించి, ప్రభుత్వానికి నష్టం వాటిల్లి ఉంటే సంబంధిత మొత్తాన్ని రికవరీ చేయాలని ఆయన కోరారు.