Beggar Lekharaj : అతడు ఒక బిచ్చగాడు (Beggar). హనుమాన్ గుడి (Hanuman Temple) దగ్గర భిక్షాటన చేసి అతడు పొట్ట నింపుకునేవాడు. చిరిగిన దుస్తులు, మాసిన గడ్డం, నీరసించిన ముఖంతో ఆలయం వద్ద ఓ ట్రై సైకిల్ (Tri Cycle) పై కూర్చుని అతను భిక్షాటన చేసేవాడు. ఇటీవల అనారోగ్యానికి గురైన ఆయన ప్రభుత్వ ఆస్పత్రి (Govt hospital) లో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. ఆ తర్వాత పోలీసులు ఆయన వస్తువులను పరిశీలించగా.. ట్రై సైకిల్లోని పెట్టెలో నోట్ల కట్టలు దొరికాయి. బ్యాంకు ఖాతాలో లక్షల నగదు ఉన్నట్టు పాస్‌బుక్ ద్వారా తెలిసింది.
వివరాల్లోకి వెళ్తే.. హర్యానాలోని అంబాలా నగరంలో లేఖరాజ్ (Lekharaj) అనే వ్యక్తి భిక్షాటన చేసేవాడు. గత పదేళ్లుగా అతడు మూడు చక్రాల సైకిలుపై నగరంలో తిరుగుతూ భిక్షాటన చేస్తూ వచ్చాడు. అతను ఎక్కువగా నిత్యం రద్దీగా ఉండే రైల్వేస్టేషన్ రోడ్డులోని హనుమాన్ ఆలయం వద్ద ఉండేవాడు. చిరిగిన దుస్తులు, మాసినగడ్డం, నీరసించిన ముఖంతో కూర్చుని ఉండేవాడు. అతడికి జనం ఇచ్చిన డబ్బులను సైకిల్‌కు కట్టివున్న ట్రంకుపెట్టెలో దాచుకునేవాడు. ఈ క్రమంలో ఇటీవల లేఖరాజ్ అనారోగ్యం బారినపడ్డాడు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనను ఫిబ్రవరి 9న స్థానిక సామాజిక సంస్థ ‘వందేమాతరం దళ్’ ప్రతినిధులు ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు.
చికిత్స పొందుతూ మూడు రోజుల తర్వాత అంటే ఫిబ్రవరి 11 ఆయన కన్నుమూశారు. దాంతో ఆ సామాజిక సంస్థ సభ్యులే లేఖరాజ్ అంత్యక్రియలు చేశారు. అనంతరం పోలీసులు లేఖరాజ్ వస్తువులను తనిఖీ చేయగా.. ఇనుపపెట్టెలో రూ.50,000 విలువైన రూ.500 నోట్లకట్ట దొరికింది. ఆ నోట్లకట్టపై బ్యాంక్ ఆఫ్ ఇండియా సీలు ఉంది. విడిగా రూ.16,120 విలువైన నోట్లు ఉన్నాయి. పెట్టెలో దొరికిన అతని బ్యాంకు పాస్‌బుక్‌ను పరిశీలించగా రూ.3,32,000 జమచేసి ఉన్నట్టు తెలిసింది. దాంతో పోలీసులు, స్థానికులు షాకయ్యారు.