కంటోన్మెంట్, మే 10: ఏ సంస్థలు చేపట్టినా సర్వేలన్నీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి నివేదితకే అనుకూలంగా ఉన్నాయని, కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎన్నికల ఇన్చార్జి రావుల శ్రీధర్‌రెడ్డి స్పష్టం చేశారు. బీఆర్ఎస్కు కనీసం దరిదాపుల్లోనూ కాంగ్రెస్, బీజేపీలు లేవని తేల్చిచెప్పారు. కాంగ్రెస్‌కు ఓటమి భయం పట్టుకుందని, అందుకే పెద్ద ఎత్తున పలు వార్డుల్లో డబ్బులను పంపిణీ చేస్తున్నారని విమర్శించారు. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా డబ్బులను పంపిణీ చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని అధికార యంత్రాంగానికి ఆయన విన్నవించారు. ఈ మేరకు బోయిన్‌పల్లిలో ఏర్పాటు చేసిన సమావేశంలో రావుల శ్రీధర్ రెడ్డి మాట్లాడారు. కాంగ్రెస్ అభ్యర్థి చరిత్ర ఏంటో ప్రజలందరికీ తెలుసని, వెన్నెల గద్దర్‌కు టికెట్ ఇవ్వకుండా ఒక ఆడబిడ్డను కాంగ్రెస్ మోసం చేసిందని మండిపడ్డారు. కాంగ్రెస్‌కు ఓటేస్తే కష్టాలు తప్పవని హితవు పలికారు. బీఆర్ఎస్తోనే కంటోన్మెంట్ అభివృద్ధి సాధ్యమని చెప్పారు.
30 ఏండ్లు కంటోన్మెంట్‌కు సేవ చేసిన సాయన్న కుమార్తె నివేదితను గెలిపించుకునేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని వెల్లడించారు. కాంగ్రెస్ కుట్రలను ప్రజలు గమనిస్తున్నారని, ఎన్నికల్లో ఆ పార్టీకి కర్రు కాల్చి వాత పెట్టడం ఖాయమని రావుల శ్రీధర్ రెడ్డి తెలిపారు. ప్రచారంలో అద్భుతంగా పనిచేసిన కంటోన్మెంట్ బోర్డు మాజీ సభ్యులు, గులాబీశ్రేణులందరికీ ఆయన ప్రత్యేక ధన్యవాదాలు చెప్పారు. కాంగ్రెస్‌కు లీడర్లు, క్యాడర్ లేదు కాబట్టే బీఆర్ఎస్ నేతలను ప్రలోభాలకు గురిచేసి బలవంతంగా ఆ పార్టీలోకి చేర్చుకుంటున్నారని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి మండిపడ్డారు. అందుకే ఇతర పార్టీ నుంచి వచ్చిన అభ్యర్థికి టికెట్ ఇచ్చారని ఎద్దేవా చేశారు. ఎలాగూ కాంగ్రెస్‌కు ఓటమి తప్పదని, ప్రజలందరి ఆశీర్వాదం బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి నివేదితకే ఉందని స్పష్టం చేశారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే స్థానంతో పాటు మల్కాజిగిరి ఎంపీ స్థానంలో గులాబీ జెండా ఎగరడం ఖాయమని మర్రి రాజశేఖర్ రెడ్డి వెల్లడించారు.
లోక్‌సభ స్థానంలోనూ గులాబీ రెపరెపలు ఖాయం..
కంటోన్మెంట్ ప్రజలందరి ఆశీస్సులు తనకు ఉన్నాయని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి నివేదిత సాయన్న స్పష్టం చేశారు. ప్రజలంతా తమ సొంత ఆడబిడ్డలా తనకు ఓటేయాలని కోరారు. కంటోన్మెంట్ ప్రజలతో సాయన్నకు విడదీయరాని అనుబంధం ఉందని గుర్తుచేశారు. సాయన్నలాగే ప్రజాసేవ చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని, కాబట్టి తనను దీవించాలని నివేదిత కోరారు. సమావేశంలో కంటోన్మెంట్ బోర్డు మాజీ సభ్యులు అనితా ప్రభాకర్, నళిని కిరణ్, పాండు యాదవ్, భాగ్యశ్రీ శ్యాంకుమార్, లోక్ నాథ్, మాజీ కార్పొరేటర్ ఆకుల రూప హరి, మార్కెట్ కమిటీ మాజీ ఛైర్మన్ టీఎన్ శ్రీనివాస్, సీనియర్ నాయకులు ఆకుల హరి, నర్సింహ ముదిరాజ్, పలు వార్డుల బీఆర్ఎస్ అధ్యక్షులు, సీనియర్ నాయకులు, యువ నాయకులు, కార్యకర్తలు, ఉద్యమకారులు, మహిళా నేతలు, సాయన్న అభిమానులు పాల్గొన్నారు.