చరిత్రలో నిషేధాలెప్పుడు
సత్ఫలితాలివ్వలే
ఒక నోరు మనం ఇక్కడ మూయిస్తే
వేయి నోళ్లు మరోచోట విచ్చుకుంటాయి!
అతను ఒక వ్యక్తిలా గాక
సామూహిక శక్తి అయినప్పుడు
చౌరాస్తాలన్నీ జన సంద్రాలవుతాయి!
యుద్ధం మొదలైనప్పుడు
తప్పటడుగు ఎంత చిన్నదైనా
ఫలితాలను తలకిందులు చేస్తుంది!
ఎవరైనా ఆడిన మాట తప్పితే
జనం ఆగ్రహంతో ఊగిపోతారు!
ఎక్కడా అణచివేతలకు
విజయాలు దక్కిన దాఖలాలు లేవు!
నిప్పులు రాజేసినంక
నిటలాక్షుడైనా ఆర్పలేడు!
విజయాలు వినయమివ్వనప్పుడు
విలయాలకు సిద్ధమవ్వాల్సిందే!
భంగపడ్డ వాని మౌనం
శత్రువుల ఊహకందదు!
గాలివాటం విజయాలకు
ఈ ఎన్నికలు ఒక లిట్మస్ టెస్టు!
– కోట్ల వెంకటేశ్వర రెడ్డి 94402 33261