హైదరాబాద్, మార్చి 13 (నమస్తేతెలంగాణ):గల్ఫ్‌లో బాంబులతో అమెరికా, తెలంగాణలో యుద్ధం లేకున్నా బుల్డోజర్లతో రేవంత్ సర్కార్ పేద, మధ్యతరగతి ప్రజల ఇండ్లను ధ్వంసం చేస్తున్నాయని మాజీ మంత్రి, బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘మూసీ ముసుగులో సీఎం రేవంత్‌రెడ్డి లక్షన్నర కోట్ల లూటీకి తెరలేపిన్రు. ఓవైపు రాష్ట్ర ఖజానా ఖాళీ అంటూనే మరోవైపు ప్రజాధనాన్ని కొల్లగొట్టేందుకు టెండర్ పెట్టిండు. పేదల పక్కా ఇండ్లు కూల్చి ఫైవ్‌స్టార్ హాటల్లో ప్రజెంటేషన్ ఇస్తున్నడు. తుగ్లక్ తరహా పాలనతో తెలంగాణను అధోగతి పాల్జేస్తున్నడు.
కేసీఆర్ చేసిన అభివృద్ధి, సంక్షేమాన్ని విధ్వంసం చేసేందుకు కంకణం కట్టుకున్నడు. మూసీ ప్రక్షాళన పేరిట రేవంత్‌రెడ్డి చేస్తున్నది బ్యూటిఫికేషన్ కాదు.. పక్కా లూటిఫికేషన్’ అంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మూసీ పునరుజ్జీవానికి బీఆర్ఎస్ వ్యతిరేకం కాదని, ఆ ముసుగులో పాల్పడుతున్న దోపిడీకి, పేదల ఇండ్లు కూల్చివేసి వేలాది మందిని నిరాశ్రయులుగా చేయడానికి తాము వ్యతిరేకమని తేల్చిచెప్పారు. మూసీ సుందరీకరణను ప్రారంభించింది బీఆర్ఎస్ సర్కారేనని స్పష్టంచేశారు.
నాడు రూ.4 వేల కోట్లతో 32 ఎస్టీపీలు నిర్మించామని, గోదావరి జలాల తరలింపునకు ప్రణాళికలు తయారు చేశామని గుర్తుచేశారు. శుక్రవారం తెలంగాణభవన్‌లో ఎమ్మెల్సీ శంభీర్పూర్రాజు, ఎమ్మెల్యేలు ముఠాగోపాల్, కాలేరు వెంకటేశ్, వివేకానందగౌడ్‌తో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘ఈ రోజు మూసీ బ్యూటిఫికేషన్‌పై ఫైవ్ స్టార్ హోటల్లో ప్రజెంటేషన్ ఇస్తున్న రేవంత్‌రెడ్డి, బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా బాధితుల పక్షాన బీఆర్ఎస్ అడుగుతున్న ప్రశ్నలకు సూటిగా సమాధానం చెప్పాలి’ అని డిమాండ్ చేశారు.
‘మూసీ సుందరీకరణ..ప్రక్షాళన.. పునరుజ్జీవమని పూటకో పేరు మార్చుతూ రోజుకో చోట ప్రజల ఇండ్లు కూల్చే హక్కు ఎవరిచ్చారు? మూసీ అభివృద్ధి పేరిట విధ్వంసకాండ కొనసాగించడంలో ఔచిత్యమేంటి..?’ అని ప్రశ్నించారు. ప్రక్షాళనపై చిత్తశుద్ధి ఉన్న వారెవరూ మొట్టమొదలే పేదల ఇండ్లపై పడరని, సమగ్ర ప్రణాళికల రూపకల్పన తర్వాతే ముందుకెళ్తారని చెప్పారు. ‘వికారాబాద్ నుం చి హైదరాబాద్ వరకు మురుగు నీటిని ఆపకుండా ప్రక్షాళన ఎలా చేస్తావు రేవంత్‌రెడ్డీ? ముందుగా వికారాబాద్‌లో ఎస్టీపీ మరమ్మతుపై దృష్టిపెట్టు’ అని చురకలంటించారు.
రేవంత్‌రెడ్డి ఓసారి మూసీ సుందరీకరణ అంటడు. మరోసారి ప్రక్షాళన అని చెప్తడు. ఇంకోసారి పునరుజ్జీవమని బొంకుతడు. అసలు మీరు చేస్తున్నది ఎకలాజికల్ ఫ్యూరిఫికేషనా? లేక ఆస్తటిక్ బ్యూటిఫికేషనా? పూటకో పేరు మార్చుతూ రోజుకో చోట ప్రజల ఇండ్లు కూల్చే హక్కు మీకెవరిచ్చారు?
– హరీశ్‌రావు
మూసీ ప్రక్షాళనపై ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి ఉంటే ముందుగా మూసీ పరీవాహక ప్రాంత బాధితుల అభిప్రాయాలు తీసుకోవాలని హరీ శ్ డిమాండ్ చేశారు. కానీ ఇదేం చేతగాని రేవంత్‌రెడ్డి వారి ఇండ్ల కూల్చివేతలు మొదలుపెట్టారని మండిపడ్డారు. ‘అన్నదాతలకు రైతుభరోసా ఇవ్వుమంటే పైసల్లేవంటడు. సన్న వడ్లకు బోనస్ అడిగితే ఉలుకడు, పలుకడు. రీయింబర్స్మెంట్ బకాయిలు అడిగితే ఖాళీ ఖజానా అని బుకాయిస్తడు. రిటైర్డ్ ఉద్యోగ, ఉపాధ్యాయులకు బెనిఫిట్స్ ఇవ్వుమంటే ‘నన్ను కోసుకు తిన్నా రూపాయి రాలదు’ అంటడు. మరోవైపు మిస్ వరల్డ్ పోటీలకు వందల కోట్లు ఖర్చు పెడుతడు. సింగరేణి డబ్బుతో ఫుట్‌బాల్ ఆడుతడు. ఇక్కడ పాలన చేతగాదు కానీ పక్క రాష్ర్టాల్లో సోకులకు పోతడు. ‘మా పాలన అద్భుతం’ అని పేపర్ యాడ్స్‌కు వందల కోట్లు తగలేస్తడు’ అంటూ తూర్పారబట్టారు.
అన్నదాతలకు రైతుభరోసా ఇవ్వుమంటే పైసల్లేవంటవు. సన్న వడ్లకు బోనస్ అడిగితే ఉలుకవు.. పలుకవు. రీయింబర్స్మెంట్ బకాయిలు అడిగితే ఖాళీ ఖజానా అని బుకాయిస్తవు. రిటైర్డ్ ఉద్యోగ, ఉపాధ్యాయులకు బెనిఫిట్స్ ఇవ్వుమంటే ‘నన్ను కోసుకు తిన్నా రూపాయి రాలదు’ అంటవు.
మరి మూసీకి లక్షన్నర కోట్లు ఎట్ల ఖర్చు పెడుతవు రేవంత్‌రెడ్డీ?
– హరీశ్‌రావు
ఎలాంటి విజన్ లేని రేవంత్‌రెడ్డికి రియల్ ఎస్టేట్ దందా తప్పా ఇంకేమీ తెలియదని హరీశ్ దుయ్యబట్టారు. ఆయన భూ దందాల కోసమే పేదల ఇండ్లమీద పడ్డారని ధ్వజమెత్తారు. 3,279.19 ఎకరాల్లోని 10,017 నిర్మాణాలను కూల్చి లక్షల మంది జీవితాలను రోడ్డున పడేసేందుకు కుట్రలు చేస్తున్నారని నిప్పులు చెరిగారు. గాంధీ విగ్రహం పెట్టేందుకు ఇన్ని వేల నివాసాలు ధ్వంసం చేయడం అవసరమా? అని ప్రశ్నించారు. రెండున్నరేండ్ల పాలనలో పది ఇండ్లు కూడా కట్టని ఆయనకు వేల ఇండ్లు కూల్చే హక్కు ఎవరిచ్చారని నిలదీశారు.
మూసీ అభివృద్ధి పేరిట విధ్వంసకాండ కొనసాగించడంలోని ఔచిత్యమేంటి? ఎవరి అభిప్రాయాలు తీసుకోకుండానే బస్తీ ప్రజల గుండెల్లో భయాందోళనలు సృష్టించినవా? ఏ ప్రణాళికలు లేకుండానే ఇన్నిరోజులు పేదోళ్ల ఇండ్లు కూల్చినవా?
– హరీశ్‌రావు
‘మూసీ జన ఆందోళన్ బాధితులు మొన్న నన్ను కలిసిన వెంటనే వారిని చర్చలకు పిలిచారు. ఈ రోజు మీటింగ్‌కు వచ్చేందుకు నిరాకరించిన మేధా పాట్కర్‌తో పాటు జన ఆందోళన్ బాధితులను హౌస్ అరెస్ట్ చేయడం దుర్మార్గం’ అని హరీశ్ ఖండించారు. మూసీ ప్రక్షాళన శంకుస్థాపనకు కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌ను ఆహ్వానిస్తామని చెప్పిన విషయాన్ని ప్రస్తావిస్తూ..‘మూసీ పేరిట రేవంత్ చేస్తున్న రియల్ఎస్టేట్ దందాకు, దోపిడీకి బీజేపీ సహకరిస్తున్నదా? పేదల ఇండ్లు కూల్చడాన్ని సమర్థిస్తున్నదా? ఇంతకాలం బస్తీ నిద్ర పేరిట కేంద్ర మంత్రి చేసినవి డ్రామాలేనా?’ అని ప్రశ్నించారు.
మూసీ సుందరీకరణను ప్రారంభించింది బీఆర్ఎస్ సర్కారే. నాడు రూ.4 వేల కోట్లతో 32 ఎస్టీపీలు నిర్మించినం. గోదావరి జలాల తరలింపునకు ప్రణాళికలు తయారు చేసినం. కానీ చిత్తశుద్ధిలేని, చేతగాని కాంగ్రెస్ సర్కార్ ప్రణాళికలు రూపొందించకుండానే వేలాది ఇండ్లు కూల్చివేయడం దుర్మార్గం.
– హరీశ్‌రావు
కార్మికుల సమస్యలపై వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో గళమెత్తాలని హరీశ్‌రావుకు బీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబు యాదవ్ విజ్ఞప్తిచేశారు. శుక్రవారం హైదరాబాద్‌లోని నివాసంలో ఆయనను కలిసి వినతిపత్రం సమర్పించారు. కార్మికులకు కాంగ్రెస్ ఇచ్చిన వాగ్దానాలను గుర్తుచేశారు. అంగన్వాడీ, ఆశ కార్యకర్తలు, ఉపాధిహామీ ఫిల్ట్ అసిసెంట్లు, ఐకేపీ వీవోయేల వేతనాల పెంపు, బీడీ కార్మికులందరికీ పింఛన్, ఆటో డ్రైవర్లకు ఏడాదికి రూ.12 వేల భృతి ఇస్తామని హామీ ఇచ్చిందని పేర్కొన్నారు. రెండేండ్లు దాటినా ఆ ఊసే ఎత్తడంలేదని విమర్శించారు. కార్మికుల పక్షాన అసెంబ్లీలో నిలదీస్తానని హరీశ్‌రావు హామీ ఇచ్చారని రాంబాబు వెల్లడించారు.