క్రిమినల్ వేస్ట్ అంటూ రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు చేయడం ఇంజినీర్ల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమే. ఈ వ్యవహారంపై స్పందించాల్సిన నైతిక, రాజకీయ బాధ్యత రాహుల్‌గాంధీపై ఉన్నది. ఇంత జరిగినా రాహుల్ మౌనంగా ఉండటం అంటే సీఎం వ్యాఖ్యలను సమర్థించినట్టే.
-కేటీఆర్
హైదరాబాద్, ఆగస్టు 2 (నమస్తే తెలంగాణ): ఇంజినీరింగ్ విద్యార్థులను క్రిమినల్ వేస్ట్‌గా అభివర్ణించిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఆయనపై చర్యలు తీసుకోకుండా మౌనం వహిస్తున్న రాహుల్‌గాంధీ వెంటనే బేషరతుగా క్షమాపణలు చెప్పాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. ఓట్ల కోసం అరచేతిలో వైకుంఠం చూపి గద్దెనెక్కిన తర్వాత నిట్టనిలువునా యువతను మోసం చేసిన కాంగ్రెస్సే అసలు సిసలైన ‘క్రిమినల్ వేస్ట్’ అని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. విద్యార్థులపై సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు ఆదివారం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీకి బహిరంగలేఖ రాశారు.
అంతర్జాతీయ కంపెనీలకు ప్రాతినిధ్యం వహిస్తూ లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తూ అంతరిక్షంలోకి రాకెట్లను పంపిస్తూ దేశప్రతిష్టను ఇనుమడింపజేస్తున్న భారతీయ ఇంజినీర్లను అవమానిస్తూ ముఖ్యమంత్రి క్రిమినల్ వేస్ట్ అంటూ వ్యాఖ్యలు చేయడం వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమేని పేర్కొన్నారు. రేవంత్‌రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలపై స్పందించాల్సిన నైతిక, రాజకీయ బాధ్యత రాహుల్‌గాంధీపై ఉన్నదని లేఖలో స్పష్టంచేశారు.
తెలంగాణవ్యాప్తంగా దుమారం రేగుతున్న ఈ వ్యవహారంపై రాహుల్‌గాంధీ మౌనం వహించడం..రేవంత్‌తో క్షమాపణలు చెప్పించకపోవడం దురదృష్టకరమని వాపోయారు. రాహుల్ మౌనంగా ఉండటం అంటే తెలంగాణ ముఖ్యమంత్రి వ్యాఖ్యలను సమర్థించినట్టేనని తేల్చిచెప్పారు. యువత ఆత్మగౌరవాన్ని కించపరిచేలా మాట్లాడిన రేవంత్‌రెడ్డితో పాటు..ఆయనను రాష్ట్రంలోకి పంపించిన రాహుల్‌గాంధీ సైతం యువతకు క్షమాపణలు చెప్పాలని పునరుద్ఘాటించారు.
నేటి యువతరం భావి భారత నిర్మాతలు అనే విషయాన్ని రాహుల్‌గాంధీ గుర్తుంచుకోవాలని కేటీఆర్ హితవుపలికారు. యువతతో పెట్టుకుంటే పుట్టగతులుండవని హెచ్చరించారు. ‘గతంలో యువతతో పెట్టుకున్న మీ నానమ్మ ఇందిరాగాంధీకి, తెలంగాణ ఉద్యమ సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వానికి ఏ గతి పట్టిందో తెలుసుకోవాలి’ అని సూచించారు. యూత్ తలుచుకుంటే నియంతలు, నియంతృత్వ పార్టీల మెడలు ఎలా వంచుతారో గుర్తు తెచ్చుకోవాలని చురకలంటించారు. ఇదే యువత కేసీఆర్ నాయకత్వంలో కాంగ్రెస్ మెడలు వంచి తెలంగాణను సాధించుకున్న విషయాన్ని మరోసారి జ్ఞప్తికి తెచ్చుకోవాలని సూచించారు. అసెంబ్లీ ఎన్నికల ముందర ఓట్ల కోసం యువతను మభ్యపెట్టిన రాహుల్‌గాంధీకి నైతిక బాధ్యతను గుర్తుచేసేందుకే ఈ లేఖ రాస్తున్నానని స్పష్టంచేశారు.
రేవంత్ వ్యాఖ్యలపై మౌనం వహిస్తున్న రాహుల్‌గాంధీ ప్రజాస్వామ్యం, రాజ్యాంగం, నైతికత, యువతకు దక్కాల్సిన గౌరవం లాంటి అంశాలపై మాట్లాడే అర్హత కోల్పోయారని కేటీఆర్ స్పష్టంచేశారు. యువత గురించి రాహుల్ చెప్పే ఊకదంపుడు ప్రసంగాలకు భిన్నంగా సీఎం రేవంత్‌రెడ్డి విద్యార్థులు, ఇంజినీర్లు, టీచర్లను క్రిమినల్ వేస్ట్ అనడం శోచనీయమని పేర్కొన్నారు. కేవలం ప్రసంగాలతో స్థాయి పెరుగదనే విషయాన్ని రాహుల్ గుర్తించాలని హితవుపలికారు. ‘ఇప్పటికైనా కండ్లు తెరిచి అడ్డగోలుగా మాట్లాడిన మీ ముఖ్యమంత్రితో క్షమాపణలు చెప్పించాలి’ అని డిమాండ్ చేశారు. లేదంటే దేశ యువత గురించి మాట్లాడే నైతికహక్కు ఆయనకు లేదని తేల్చిచెప్పారు.
దేశ ప్రగతిలో కీలకభూమిక పోషిస్తున్న ఇంజినీర్లను క్రిమినల్ వేస్ట్ అనడమే కాంగ్రెస్ విధానామా? అని కేటీఆర్ ప్రశ్నించారు. యువతపై నోరు పారేసుకోవడం, అడ్డగోలు వ్యాఖ్యలు చేయడం, వారి నైతిక ైస్థెర్యాన్ని దెబ్బతీయడం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి అలవాటుగా మారిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. గతంలో యూనివర్సిటీ విద్యార్థులను ‘బీరు, బిర్యానీ బ్యాచ్’ అంటూ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించారు. భావి భారత పౌరులను తీర్చిదిద్దేందుకు తమ జీవితాలను ధారపోస్తున్న గురువులను ఉద్దేశించి సైతం చులకనగా మాట్లాడారని గుర్తుచేశారు. రేవంత్‌రెడ్డి పాలనను పక్కనబెట్టి ప్రశ్నించేవారి గొంతునొక్కడమే పనిగా పెట్టుకున్నారని దెప్పిపొడిచారు. తెలంగాణ యువత రేవంత్ వ్యవహారశైలి, ఆయన మాట్లాడుతున్న తీరును గమనిస్తున్నదని, తగిన బుద్ధి చెప్పేందుకు సమయం కోసం ఎదురుచూస్తున్నదని హెచ్చరించారు. ఇప్పటికైనా రాహుల్‌గాంధీ మేలుకొని యువత ఆకాంక్షను గుర్తించి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో క్షమాపణలు చెప్పిస్తారని ఆశిస్తున్నానని పేర్కొన్నారు.
అంతర్జాతీయ కంపెనీలకు ప్రాతినిధ్యం వహిస్తూ.. లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తూ.. అంతరిక్షంలోకి రాకెట్లను పంపిస్తూ.. దేశప్రతిష్టను ఇనుమడింపజేస్తున్న భారతీయ ఇంజినీర్లను క్రిమినల్ వేస్ట్ అంటూ ముఖ్యమంత్రి రేవంత్ వ్యాఖ్యలు చేయడం ఇంజినీర్ల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమే, రేవంత్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై స్పందించాల్సిన నైతిక, రాజకీయ బాధ్యత రాహుల్‌గాంధీపై ఉన్నది.
-కేటీఆర్