న్యూఢిల్లీ: ఫ్లైదుబాయ్ విమానంలో భారతీయ పైలట్ స్మిత్ మచ్చర్‌పై దాడి చేసిన వ్యక్తిని(Flydubai Co-Pilot) ఒమన్ దేశస్థుడిగా గుర్తించిన విషయం తెలిసిందే. అయితే అతని పేరును తాజాగా వెల్లడించారు. ఆ కోపైలట్ పేరు హమమ్ అల్ హమ్మమి. ఫ్లైదుబాయ్ విమానాన్ని ఇజ్రాయిల్‌లో కూల్చాలని అతను భావించినట్లు ప్రాథమిక దర్యాప్తులో తెలిసింది. ఒమన్ అధికారులు ఆ పైలట్‌పై గతంలో ఆంక్షలు విధించారు. ఉగ్రవాద ప్రేరేపిత ఐడియాలజీ ఉన్న కారణంగా అతన్ని వెలివేసినట్లు ఓ అంతర్జాతీయ మీడియా తన కథనంలో తెలిపింది. దుబాయ్ నుంచి 174 మంది ప్రయాణికులతో టెల్ అవివ్ వెళ్తున్న ఫ్లైదుబాయ్ విమానాన్ని ఎమర్జెన్సీగా సౌదీ అరేబియాలోని తబుక్‌లో దించిన విషయం తెలిసిందే.
పైలట్ మచ్చర్‌పై దాడి చేసిన ఒమన్ వ్యక్తి తల్లితండ్రుల వివరాలను వెల్లడించారు. అతని తండ్రి ఒమన్ దేశస్థుడు కాగా, తల్లి సిరియా దేశస్థురాలు. యూఏఈలో అతను జన్మించాడు. అల్హమమి ఎక్కువగా ఒమన్ బయట పెరిగాడు. అతను సిరియాలో ఎక్కువ కాలం గడిపాడు. దీంతో అక్కడ అతను తీవ్రవాద ఐడియాలజీకి అట్రాక్ట్ అయ్యాడు.
2024లో ఒమన్ ఎయిర్ సంస్థలో కోపైలట్‌గా శిక్షణ పొందాడు. ఆ సమయంలో అతని వద్ద తీవ్రవాద భావజాలానికి సంబంధించిన మెటీరియల్‌ను గుర్తించారు. అయితే ఆ తర్వాత అతన్ని అడ్మినిస్ట్రేటివ్ రోల్లో పనిచేసేందుకు అవకాశం కల్పించారు. కానీ సెక్యూర్టీ రిస్క్ నేపథ్యంలో ఫ్లయింగ్ నుంచి అతన్ని తప్పించారు. అల్హమమిపై బ్యాన్ ఉన్నా.. ఫ్లైదుబాయ్ అతన్ని ఉద్యోగంలోకి తీసుకున్నది. అతి సున్నితమైన యూఏఈ, ఇజ్రాయెల్ రూట్లో విమానాలు నడిపేందుకు అతనికి ఫ్లైదుబాయ్ అవకాశం ఇచ్చింది.