Rachita Ram | కన్నడ సినీ పరిశ్రమలో తన అందం, సహజ నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కథానాయిక రచితా రామ్. ‘డింపుల్ క్వీన్’గా అభిమానులు ముద్దుగా పిలుచుకునే ఆమెకు అక్టోబర్ 3 పుట్టినరోజు. ప్రతి ఏడాది తన పుట్టినరోజు సందర్భంగా అభిమానులను నేరుగా కలుసుకోవడం రచితకు అలవాటు. కేక్ కట్ చేసి, అభిమానులతో సెల్ఫీలు దిగుతూ వారితో ఆనందాన్ని పంచుకుంటారు. అయితే ఈ ఏడాది పుట్టినరోజు వేడుకల్లో ఆమెకు ఊహించని అనుభవం ఎదురైంది. అభిమానులతో కలిసి సెల్ఫీలు దిగుతున్న సమయంలో ఓ వ్యక్తి రచితా రామ్ వద్దకు వచ్చాడు. తొలుత ఆమెతో సెల్ఫీ దిగిన అతడు అనంతరం షేక్ హ్యాండ్ ఇచ్చాడు. ఆ వెంటనే ఎవరూ ఊహించని విధంగా రచితా రామ్ రెండు బుగ్గలను పట్టుకుని గిల్లి అక్కడి నుంచి వేగంగా వెళ్లిపోయాడు. ఈ ఘటన క్షణాల్లో జరగడంతో అక్కడే ఉన్న భద్రతా సిబ్బంది కూడా అతడిని వెంటనే అడ్డుకోలేకపోయారు.
అనుకోని ఘటనతో రచితా రామ్ ఒక్క క్షణం షాక్కు గురైనప్పటికీ, అక్కడ ఎలాంటి అసహనం వ్యక్తం చేయలేదు. వెంటనే తేరుకుని చిరునవ్వుతో మిగిలిన అభిమానులతో సెల్ఫీలు దిగుతూ కార్యక్రమాన్ని కొనసాగించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. వీడియో చూసిన నెటిజన్లు మాత్రం భిన్నంగా స్పందిస్తున్నారు. కొందరు అభిమాని చేసిన పనిని సరదాగా తీసుకుంటుండగా, మరికొందరు మాత్రం తీవ్రంగా తప్పుబడుతున్నారు. అభిమానాన్ని వ్యక్తం చేసే పేరుతో నటీనటుల వ్యక్తిగత పరిధిని దాటడం సరికాదని, ఎవరినైనా తాకే ముందు వారి అనుమతి తీసుకోవాల్సిన అవసరం ఉందని పలువురు కామెంట్లు చేస్తున్నారు. సెలబ్రిటీలను అభిమానించడం ఎంత ముఖ్యమో, వారి వ్యక్తిగత స్వేచ్ఛను, గౌరవాన్ని కాపాడటం కూడా అంతే ముఖ్యమని సూచిస్తున్నారు.
రచితా రామ్ అసలు పేరు బిందియా రాము. ప్రముఖ భరతనాట్య కళాకారుడు కె.ఎస్. రాము కుమార్తె అయిన ఆమె చిన్నప్పటి నుంచే శాస్త్రీయ నృత్యంలో శిక్షణ పొందారు. ఇప్పటివరకు 50కి పైగా వేదికలపై భరతనాట్య ప్రదర్శనలు ఇచ్చిన ఆమె తొలుత బుల్లితెర సీరియళ్ల ద్వారా గుర్తింపు తెచ్చుకున్నారు. 2013లో ‘బుల్బుల్’ సినిమాతో కన్నడ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన రచితా రామ్ తొలి సినిమాతోనే మంచి గుర్తింపు సొంతం చేసుకున్నారు. ఆ తర్వాత ‘రన్నా’, ‘రథవర’, ‘చక్రవ్యూహ’, ‘భర్జరి’, ‘నటసార్వభౌమ’, ‘క్రాంతి’ వంటి చిత్రాల్లో నటించి కన్నడ చిత్ర పరిశ్రమలో అగ్ర కథానాయికగా ఎదిగారు. తన నటనకు ఫిలింఫేర్, సైమా వంటి అవార్డులను కూడా అందుకున్నారు.. తెలుగులో ‘సూపర్ మచ్చి’ సినిమాతో పరిచయమైన ఆమె, తమిళంలో రజనీకాంత్ నటించిన ‘కూలీ’ చిత్రంతో కోలీవుడ్లోకి అడుగుపెట్టారు. ఆ సినిమాలో విభిన్న ఛాయలున్న పాత్రలో నటించి ప్రశంసలు అందుకున్నారు. ‘కాకా’ సినిమాలోనూ రచితా రామ్ కీలక పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం.
😄 Be honest, what kind of fan are you—playful 😜 or calm 😇?
Which one are you? 👀#RachitaRam pic.twitter.com/F3A16HFc9W
— Filmyyy__duniyaaa (@Filmyduniyaaa) October 3, 2026