Salman Khan | బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నటిస్తున్న కొత్త చిత్రం ఇప్పటికే సినీ వర్గాల్లో భారీ చర్చకు దారితీస్తోంది. టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో, ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న ఈ ప్రతిష్టాత్మక యాక్షన్ ఎంటర్టైనర్ 2027 ఈద్ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ ప్రాజెక్ట్‌పై ఇప్పటికే అంచనాలు నెలకొనగా, ఇప్పుడు సల్మాన్ ఖాన్ రెమ్యునరేషన్‌కు సంబంధించిన వార్తలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి. బాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం, సాధారణంగా ఒక్కో చిత్రానికి రూ.120 కోట్లకు పైగా పారితోషికం తీసుకునే సల్మాన్ ఖాన్ ఈ ప్రాజెక్ట్ కోసం భారీగా తగ్గించుకున్నారట. దాదాపు రూ.50 కోట్లను వదులుకుని రూ.70 కోట్ల రెమ్యునరేషన్‌కే అంగీకరించినట్లు ప్రచారం జరుగుతోంది.
ఈ వార్త బయటకు రావడంతో బాలీవుడ్లో విస్తృతంగా చర్చ సాగుతోంది. ఇంత పెద్ద స్టార్ హీరో తన పారితోషికాన్ని తగ్గించడం వెనుక కేవలం బడ్జెట్ కారణం మాత్రమే కాకుండా, వ్యక్తిగత అనుబంధం కూడా ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమా నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తున్న సహ నిర్మాత రఫీ కాజీ సల్మాన్ ఖాన్‌కు ఎంతోకాలంగా సన్నిహిత మిత్రుడని సమాచారం. స్నేహానికి ఎంతో విలువ ఇచ్చే సల్మాన్, తన మిత్రుడి కోసం ఈ నిర్ణయం తీసుకున్నారనే వార్తలు బాలీవుడ్లో వినిపిస్తున్నాయి. వ్యాపార ప్రయోజనాల కంటే వ్యక్తిగత బంధాలకు ప్రాధాన్యత ఇచ్చే వ్యక్తిగా సల్మాన్‌కు ఇప్పటికే ప్రత్యేక గుర్తింపు ఉంది. అందుకే ఈ నిర్ణయం కూడా అదే కోణంలో చూడాలని పలువురు సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
పారితోషికం విషయంలో సల్మాన్ ఖాన్ వెనక్కి తగ్గడం ఇదే తొలిసారి కాదని బాలీవుడ్ వర్గాలు గుర్తు చేస్తున్నాయి. గతంలో కూడా తనకు అత్యంత సన్నిహితులైన నిర్మాతలు, దర్శకుల సినిమాల్లో గెస్ట్ రోల్స్‌ను ఎలాంటి రెమ్యునరేషన్ తీసుకోకుండా చేసిన సందర్భాలు ఉన్నాయి. కొన్ని చిత్రాల్లో నేరుగా భారీ పారితోషికం తీసుకునే బదులు, థియేట్రికల్, శాటిలైట్ లేదా ఓటీటీ హక్కుల లాభాల్లో వాటా తీసుకునే విధంగా ఒప్పందాలు చేసుకున్న సందర్భాలూ ఉన్నాయి. ఇటీవలి కాలంలో సల్మాన్ ఖాన్ నటించిన కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయాయి. దీంతో ఈసారి బలమైన కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఘన విజయాన్ని అందుకోవాలనే లక్ష్యంతో ఉన్నట్లు తెలుస్తోంది.వంశీ పైడిపల్లి ఎమోషనల్ కథన శైలి, మాస్ కమర్షియల్ ఎలిమెంట్స్, దిల్ రాజు నిర్మాణ విలువలు కలిసి ఈ ప్రాజెక్ట్‌ను మరింత ప్రత్యేకంగా నిలబెడతాయనే అంచనాలు ఉన్నాయి.