గుమ్మడిదల, ఆగస్టు 2: పొలంలో అడుగుపెడితే పచ్చగా వరి నాట్లు కనిపిస్తున్నాయి. మరోచోట మట్టిని చీల్చుకుంటూ ఎదుగుతున్న టమాటా మొక్కలు.. ఇంకోవైపు మక్కజొన్న, కంది పంటలు రైతుల ఆశలకు ప్రతీకగా నిలుస్తున్నాయి. కానీ, ఆ పచ్చదనంలో ఇప్పుడు ఒక భయం దాగి ఉన్నది. ‘ఈ పంటలు కోయడానికి మళ్లీ ఈ పొలంలోకి అడుగు పెట్టగలమా?’ అనే ప్రశ్న 92 మంది రైతు కుటుంబాలను వెంటాడుతున్నది. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల పట్టణ పరిధి అన్నారం గ్రామంలోని 261/1 సర్వే నంబర్లో గల 66 ఎకరాల అసైన్డ్ భూములను టీజీఐఐసీకి బదిలీ చేసేందుకు ప్రభుత్వం ప్రాథమిక గెజిట్ను ఇటీవల విడుదల చేయడంతో సదరు రైతుల కుటుంబాలు తీవ్ర ఆందోళనలో మునిగిపోయాయి.
పంటల మధ్యలో అనిశ్చితి..
వర్షకాలం మొదలవడంతో రైతులు ఇప్పటికే వరి నాట్లు పూర్తి చేశారు. కొందరు టమాట, కంది, మక్కజొన్న పంటలు సాగు చేస్తున్నారు. లక్షల రుపాయలను పెట్టుబడి పెట్టి పంటలను పెంచుతున్న సమయంలో భూముల స్వాధీనం వార్తలు రావడంతో రైతుల కుటుంబాల్లో ఆందోళన నెలకొన్నది. ‘పంట చేతికొస్తుందో లేదో కానీ.. భూమే ఉంటదో లేదు తెలియని పరిస్థితి’ అని రైతులు వాపోతున్నారు. పరిశ్రమలు రావడం మంచిదే గానీ.. ఇప్పటికే నాలుగు దశబ్దాలుగా సాగు చేసుకుని బతుకుతున్న కుటుంబాలను నిర్వాసితులుగా మార్చడం ఎంత వరకు సమంజసమనే ప్రశ్న స్థానికంగా వినిపిస్తున్నది. అభివృద్ధి కోసం భూములు అవసరమైతే ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించి, రైతుల జీవనాధారాన్ని కాపాడాలని స్థానికులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
మా పొలాలను టీజీఐఐసీకి ఇవ్వం
నాలుగు దశబ్దాల క్రితం రాళ్లూ రప్పలు ఉన్న భూములను చదును చేసుకుని పంట పొలాలకు అనువుగా చేసుకుని బతుకుతున్న మా భూములపైనే ప్రభుత్వం కన్నుపడింది. మా బతుకులను ఆగం చేయొద్దు. ఏండ్లుగా ఈ పంటలపైనే నమ్ముకుని బతుకుతున్నం. నాడు ప్రభుత్వం భూములిచ్చి నేడు కాంగ్రెస్ పాలనలో వెనక్కితీసుకుంటామంటే ఎలా? ఎట్టి పరిస్థితిల్లోనూ మా భూములను ఇవ్వబోం. అదే పరిస్థితి వస్తే రైతులందరం కలిసి ఉద్యమిస్తాం. మా భూములను కాపాడుకోవడానికి ఆందోళన బాటపడుతాం. మా భూములను టీజీఐఐసీకి బదిలీ చెయ్యొద్దని కలెక్టర్కు, రెవెన్యూ అధికారులకు వినతి పత్రాలను అందజేశాం. ప్రభుత్వం పునరాలోచించి మా భూములు మాకే ఉండేలా చూడాలని కోరుకుంటున్నాం.
-దర్గా భిక్షపతి, రైతు, అన్నారం, మం:గుమ్మడిదల (సంగారెడ్డి జిల్లా)
మరి 51 ఎకరాల పొజిషన్ ఎక్కడ?
అన్నారంలో 261/1 సర్వే నంబర్ అసైన్డ్ భూముల్లో అప్పట్లో 117 మంది రైతులకు ఎకరా చొప్పున పట్టాలిచ్చారు. ఇందులో 66 ఎకరాలో 92 మంది రైతుల కుటుంబాలం పంటలను సాగుచేసుకుంటూ జీవనం సాగిస్తున్నాం. ఈ భూములు భూభారతి పోర్టల్లో ఆన్లైన్లో ఉన్నాయి. మిగిలిన 51ఎకరాలు భూ భారతిలో కనిపించడం లేదు. మరీ ఆ భూములను బయటకు తీయ్యవచ్చుకదా? 117 ఎకరాల్లో 66 ఎకరాలు రైతుల భూములే కనిపిస్తున్నాయి. మరి 51 ఎకరాలు ఎక్కడ ఉన్నాయి? అవి ప్రస్తుతం ఎవరి ఆధీనంలో ఉన్నాయి? ఇది ఆలోచించక వాటి పొజిషన్ చూపించకుండా ఉన్న 66 ఎకరాలపైనే ఎందుకు టీజీఐఐసీ కన్ను ఎందుకు పడింది? ముందు 51 ఎకరాల్లో ఎక్కడున్నాయో పొజిషన్ చూపించాలి.
-బెంబడి సంజీవరెడ్డి, అన్నారం 8వ వార్డు కౌన్సిలర్, గుమ్మడిదల