హైదరాబాద్, సెప్టెంబర్ 10 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ప్రజాపాలన ముసుగులో బరితెగించిన అవినీతి దందాల్లో ఇదీ ఒకటి. అధికార పీఠం అండతో ప్రభుత్వ ఖజానాను కొల్లగొట్టే సరికొత్త లికర్ కుంభకోణానికి తెరలేసింది. హైదరాబాద్ నగరంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన, భారీ ఆదాయం తెచ్చిపెట్టే లగ్జరీ మద్యం దుకాణాన్ని ముఖ్యనేత అత్యంత సన్నిహితుడికి కట్టబెట్టేందుకు ఎక్సైజ్ శాఖ కమిషనర్ కార్యాలయం తెరలేపింది. నిబంధనలను బేఖాతరు చేస్తూ.. న్యాయస్థానంలో కేసు ఉండగానే ఎక్సైజ్ మద్యం దుకాణాన్ని ఇతర వ్యాపారులెవరికీ సమాచారం తెలియకుండా, గుట్టుచప్పుడు కాకుండా కట్టబెట్టినట్టు తెలిసింది. ప్రభుత్వ ఆదాయాన్ని పణంగా పెట్టి ముఖ్యనేత మిత్రుడి జేబులు నింపేందుకు అధికార యంత్రాంగం దాసోహమైందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
తెలంగాణ వ్యాప్తంగా మద్యం దుకాణాల లైసెన్సుల కేటాయింపు ప్రక్రియ కోసం నిరుడు సెప్టెంబర్‌లో తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆ సమయంలోనే రాష్ట్రంలోని మిగతా మద్యం దుకాణాలతోపాటు హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని ప్రముఖ లగ్జరీ లికర్ బొటిక్కు అవకాశం ఉన్న దుకాణానికి కూడా ఎక్సైజ్ శాఖ టెండర్లు పిలిచింది. అప్పట్లో వేలాది దరఖాస్తులతో టెండర్ల ప్రక్రియ ముగిసి, దుకాణాల డ్రా కూడా తీశారు.
అయితే జూబ్లీహిల్స్, శంషాబాద్, ఖాజాగూడ, మియాపూర్‌లో ఉన్న టానిక్ మద్యం దుకాణాల విషయంలో వివాదం చెలరేగింది. గతంలో టానిక్ గ్రూప్‌లో ఉన్న పాత గ్రూప్ వ్యక్తులకే మళ్లీ ఈ టెండర్లు దకాయని తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తాయి. పాత యజమానులే బినామీలతో చక్రం తిప్పారనే ఆరోపణలతో ప్రభుత్వం కొన్ని దుకాణాల లెసెన్స్‌లను ఖరారు చేయకుండా నిలిపివేసింది. ఆ దుకాణాల టెండర్లను రద్దు చేశారా? లేక నిలిపివేశారా? అన్న విషయాన్ని ఎక్సైజ్ శాఖ అత్యంత గోప్యంగా ఉంచింది. ఎందుకంటే తెరవెనుక పెద్ద తలకాయలు వేసిన ఎత్తుగడలు అప్పటికే మొదలయ్యాయి.
దరఖాస్తు ప్రకటన లేకుండానే..
సరిగ్గా రెండురోజుల క్రితం జూబ్లీహిల్స్ టానిక్ లగ్జరీ లికర్ బొటిక్కు అవకాశం ఉన్న దుకాణం విషయంలో అధికారులు వేసిన పాచికలు విస్తుపోయేలా చేశాయి. అత్యంత విలాసవంతమైన బ్రాండ్లు మాత్రమే విక్రయించి, నెలకు కోట్ల రూపాయల్లో లాభాలను ఆర్జించే అవకాశం ఉన్న ఈ దుకాణానికి కేవలం రెండు రోజుల క్రితమే ఆగమేఘాల మీద టెండర్ నోటిఫికేషన్ ఇచ్చారు. పాత లైసెన్సీ కోర్టులో కేసు వేసినట్టు తెలిసింది. ఈ విషయం కోర్టులో ఉండగానే అధికారులు మరో వ్యక్తికి లైసెన్స్ కట్టబెట్టడం గమనార్హం. నిబంధనల ప్రకారం ప్రభుత్వం విస్తృతంగా పత్రికా ప్రకటనలు ఇవ్వాలి. ఎక్సైజ్ అధికారిక పోర్టల్‌లో అందరికీ కనిపించేలా పబ్లిక్ డొమైన్లో ఆ సమాచారాన్ని ఉంచాలి.
కానీ అటువంటిదేమీ జరుగలేదని మద్యం వ్యాపారులే చెప్తున్నారు. టెండర్ల ప్రక్రియ మొదలైనప్పటి నుంచే ముఖ్యనేతకు అత్యంత సన్నిహితుడు స్వయంగా రంగంలోకి దిగినట్టు చెప్తున్నారు. నిబంధనల ప్రకారం టెండర్ జరిగిందని కాగితాల్లో చూపించడానికి తన సొంత అనుయాయులతోనే ఉద్దేశపూర్వకంగా ఆరు దరఖాస్తులు వేయించారని చెప్తున్నారు. నిజాయితీగా బహిరంగ ప్రకటన ఇచ్చి, దరఖాస్తులను ఆహ్వానించి ఉంటే కనీసం 150 దరఖాస్తులు వచ్చేవని స్వయంగా మద్యం వ్యాపారులే చెప్తున్నారు. ఒకో దరఖాస్తు రుసుము ఆధారంగా లెకిస్తే కేవలం అప్లికేషన్ ఫీజుల రూపంలోనే ప్రభుత్వానికి సుమారు రూ.4.5 కోట్ల పైచిలుకు ఆదాయం సునాయాసంగా సమకూరేది. కానీ కేవలం 6 దరఖాస్తుల ద్వారా ప్రభుత్వ ఖజానాకు చేరింది కేవలం రూ.18 లక్షలు మాత్రమే. ఆ దరఖాస్తుల వ్యవహారంపై ఎక్సైజ్ ఉన్నతాధికారుల వివరణ కోసం ప్రయత్నించగా, వారు అందుబాటులోకి రాలేదు.