ఖైరతాబాద్, సెప్టెంబర్ 10 : బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులపై కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగింది. పక్కా పథకం ప్రకారం.. అసెంబ్లీకి వెళ్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను గేటు వద్దనే అడ్డుకున్న ప్రభుత్వం… తాజాగా వారిపైనే ఉల్టా కేసులు పెట్టించింది. అసెంబ్లీలోకి వెళ్తున్న పురుష ఎమ్మెల్యేలకు అడ్డంగా మహిళా పోలీసులను, మహిళా ఎమ్మెల్యేలకు అడ్డంగా పురుష పోలీసులను వ్యూహాత్మకంగా నిలబెట్టారు. ఈ సందర్భంగా జరిగిన తోపులాటలను ప్రభుత్వం తమకు అనుకూలంగా మార్చుకొనేందుకు మహిళా పోలీసు సిబ్బందితో బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులపై బుధవారం ఫిర్యాదు చేయించడమే కాకుండా, ఆగమేఘాలపై కేసు లు నమోదు చేయడం గమనార్హం. బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలపై జరిగిన దాడిపై మాత్రం పోలీసులు కేసు నమోదు చేయకపోవడం కక్ష సాధింపు చర్యలకు నిదర్శనం.
అసెంబ్లీ వద్ద విధుల్లో ఉన్న సమయంలో తమతో అనుచితంగా ప్రవర్తించి, విధులకు ఆటంకం కలిగించారని ఆరోపిస్తూ హైదరాబాద్ సిటీ ఆర్మ్డ్ రిజర్వ్‌కు చెందిన మహిళా కానిస్టేబుల్ సైఫాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పలువురు బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులపై కేసు నమోదైంది. ఈ నెల 7న అసెంబ్లీ గేట్ నంబర్-3 వద్ద బందోబస్తు విధులు నిర్వర్తిస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకున్నదని ఫిర్యాదులో పేర్కొన్నా రు. ఎమ్మెల్యేలు హరీశ్‌రావు, కేటీఆర్, సుధీర్‌రెడ్డి, వివేకానంద, కమలాకర్, కౌశిక్‌రెడ్డి, ఎమ్మెల్సీ నవీన్‌రెడ్డితోపాటు మరికొందరు తమను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారని, పోలీసు సిబ్బందిని భయపెట్టే విధంగా వ్యవహరించారని ఆరోపించారు.
మహిళా సిబ్బందిని అడ్డుగా పెట్టుకొని రాజకీయాలు చేస్తున్నారంటూ ప్రశ్నించడంతోపాటు స్థానిక డీసీపీ ఎవరంటూ గట్టిగా మాట్లాడారని ఫిర్యాదులో పేర్కొన్నారు. కొందరు తమ దుస్తులు విప్పి మహిళా పోలీసుల సమీపంలోకి వచ్చారని, దీంతో తాము తీవ్ర అసౌకర్యానికి, మానసిక ఒత్తిడికి గురయ్యామని ఆమె ఆరోపించారు. అధికారంలోకి వచ్చిన తర్వా త తమ సంగతి చూస్తామంటూ కొందరు హెచ్చరించారని, అవమానకరంగా మాట్లాడారని ఫిర్యాదులో వివరించారు. ఈ ఘటనలో తాను గాయపడటంతో వైద్యచికిత్స కూడా పొందాల్సి వచ్చిందని తెలిపారు. ఫిర్యాదును స్వీకరించిన సైఫాబాద్ పోలీసులు మహిళల గౌరవానికి భంగం కలిగించేలా దాడి, లైంగిక వేధింపులు, అసభ్య ప్రవర్తన తదితర ఆరోపణలకు సంబంధించిన బీఎన్ఎస్లోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 10 (నమస్తే తెలంగాణ): బీజేఎల్పీలో నేతలు తలోదారి అన్నట్టుగా వ్యవహరించినట్టు తెలుస్తున్నది. గురువారం అసెంబ్లీలోని బీజేఎల్పీ కార్యాలయంలో మహేశ్వర్‌రెడ్డి అధ్యక్షతన శాసనసభా పక్షం భేటీ కొనసాగింది. అసెంబ్లీలో ఎలా ముందుకు వెళ్లాలనే అంశాలపై జరిగిన ఈ భేటీలో ఎమ్మెల్యేలు తలోదారిగా వ్యవహరించినట్టు తెలిసింది. 22ఏపై చర్చకు పట్టుబట్టాలని కొందరు ఎమ్మెల్యేలు డిమాండ్ చేయగా.. సెన్సస్-2027పై చర్చించాల్సిందే అని మరికొంతమంది చెప్పినట్టు సమాచారం. ‘మూడు రోజులుగా వాకౌట్ చేస్తున్నామని, చర్చలో పాల్గొనకపోతే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని కొందరు అభిప్రాయపడినట్టు తెలిసింది.
అసెంబ్లీ నుంచి బీజేపీ పారిపోయిందనే అపవాదు వస్తుందని, అది పార్టీకి మంచిది కాదని పలువురు వాదించినట్టు సమాచారం. ప్రభుత్వం మాట్లాడేందుకు తమకు మైక్ ఇవ్వడం లేదని, చర్చలో పాల్గొంటే ఎలాంటి ప్రయోజనం లేదని మరో ఎమ్మెల్యే అభిప్రాయపడినట్టు తెలిసింది. బీజేపీకి మైక్ ఇవ్వకుండా సభలో కేంద్ర ప్రభుత్వాన్ని, ప్రధాని మోదీని తిడుతుంటే చూస్తూ ఊరుకోవాలా..? అని ఇంకొందరు వ్యతిరేకించినట్టు సమాచారం. దీని కంటే 22ఏపై పట్టుబట్టి సభను బాయ్‌కాట్ చేయడమే మంచిదని మరో ఎమ్మెల్యే సూచించినట్టు తెలిసింది. చివరికి ఎలాంటి నిర్ణయం తీసుకోకుండానే బీజేఎల్పీ మీటింగ్ ముగిసింది.