Dragon | టాలీవుడ్లో మోస్ట్ అవేటెడ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న పాన్-ఇండియా చిత్రం ‘డ్రాగన్’. యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా, స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. ప్రశాంత్ నీల్ సినిమాలంటేనే విజువల్ వండర్స్, ఎమోషనల్ డెప్త్ మరియు గూస్బంప్స్ తెప్పించే యాక్షన్ ఎపిసోడ్స్ ప్రధాన ఆకర్షణగా ఉంటాయి. అయితే ఈసారి ‘డ్రాగన్’ కోసం నీల్ ఆ అంచనాలకు మించి రెట్టింపు స్థాయిలో యాక్షన్ ప్లాన్ చేసినట్లు సమాచారం.
కేవలం సాధారణ కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్లా కాకుండా, హాలీవుడ్ స్థాయి సాంకేతిక విలువలతో విజువల్ విందుగా ఈ చిత్రాన్ని మలచడానికి చిత్ర యూనిట్ చాలా శ్రమిస్తోంది. ముఖ్యంగా సినిమాలో ప్రత్యేకంగా డిజైన్ చేసిన మూడు భారీ యాక్షన్ బ్లాక్స్ ఈ చిత్రానికి ప్రధాన హైలైట్‌గా నిలవనున్నాయి. ప్రతి ఫైట్ సీక్వెన్స్‌కు బలమైన భావోద్వేగ నేపధ్యం ఉండేలా ప్రశాంత్ నీల్ ఈ సన్నివేశాలను తీర్చిదిద్దినట్లు తెలుస్తోంది. సినిమా ప్రారంభంలో వచ్చే జైల్ ఫైట్ గురించి ఇప్పటికే సోషల్ మీడియాలో భారీ చర్చ నడుస్తోంది. అత్యంత క్లిష్టమైన సెట్టింగుల మధ్య, భారీ హంగులతో తెరకెక్కించిన ఈ సీక్వెన్స్ ప్రేక్షకులను సీట్లలో కదలకుండా కట్టిపడేయడం ఖాయమని యూనిట్ వర్గాలు చెబుతున్నాయి.
ఇక చిత్రంలోనే అత్యంత శక్తివంతమైన ఎపిసోడ్‌గా కాళీమాత ప్రాంగణం ఫైట్ నిలవబోతోంది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, విజువల్స్, ఆర్ట్ డిపార్ట్మెంట్ సృష్టించిన మ్యాజిక్ ఈ ఫైట్‌ను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లనున్నాయి. కాళీమాత ప్రాంగణం నేపథ్యంలో వచ్చే ఈ యాక్షన్ సీక్వెన్స్‌లో ఎన్టీఆర్ మాస్ అండ్ రౌద్ర రూపం థియేటర్లలో ప్రేక్షకులకు పూనకాలు తెప్పించడం పక్కా. అలాగే ఈ మూడు యాక్షన్ బ్లాక్స్‌లో అత్యంత క్రూరమైన మరియు భావోద్వేగంతో కూడిన బ్లడ్ ఫైట్ ఎపిసోడ్ సినిమాకే అసలైన హైలైట్‌గా నిలవబోతున్నట్లు సమాచారం. ఇది సాధారణ పోరాటంలా కాకుండా ఒక సర్వైవల్ వార్ లా సాగుతుంది. ప్రశాంత్ నీల్ తనదైన శైలిలో రక్తపుటేరులు పారేలా, ప్రతి ఫ్రేమ్‌లోనూ ఇంటెన్సిటీ మిస్ కాకుండా దీన్ని రూపొందించారు. ఈ మూడు భారీ యాక్షన్ బ్లాక్‌లు సినిమా రన్‌టైమ్‌లో కీలక మలుపులుగా నిలుస్తూ, కథను పరుగులు పెట్టించడంలో ప్రధాన పాత్ర పోషిస్తాయని సమాచారం. వెండితెరపై ఈ విజువల్ వండర్‌ను చూస్తున్నప్పుడు ప్రేక్షకులు మైమరచిపోవడం ఖాయమనే మాట బాక్సాఫీస్ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది.