హైదరాబాద్, సెప్టెంబర్ 10 (నమస్తే తెలంగాణ): ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పార్టీ అధినేత, తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టను దెబ్బతీసేలా ముఖ్యమంత్రి చూపించిన ‘సంధ్యారావు’ అనే ఎక్స్ అకౌంట్‌ను ఎవరు నిర్వహిస్తున్నారో పోలీసులే తేల్చాలని బీఆర్ఎస్ ప్రధానకార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ డిమాండ్ చేశారు. ఈ మేరకు హైదరాబాద్ సైబర్‌క్రైమ్ పోలీస్‌స్టేషన్ (సీసీఎస్)లో ఆయన గురువారం చేశారు. @SandhyaraoBRS అనే ఎక్స్ అకౌంట్ ద్వారా బీఆర్ఎస్ పార్టీలో ఎలాంటి ఉనికిలో లేని ‘ఇంటర్నేషనల్ సెక్రటరీ’ అనే నకిలీ హోదాను వాడుకుంటూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఫిర్యాదులో పేరొన్నారు.
కేసీఆర్ నివాసానికి దళిత వర్గాల వారు వచ్చి వెళ్లిన తర్వాత ఇంటిని పసుపు నీళ్లతో శుద్ధి చేసుకున్నారంటూ ఈ అకౌంట్ ద్వారా పూర్తిగా నిరాధారమైన, కులవిద్వేషాలను రెచ్చగొట్టే అసత్య పోస్టులు పెట్టారని ఆయన మండిపడ్డారు. ఈ పోస్ట్, హ్యాండిల్ గురించి సీఎం రేవంత్‌రెడ్డి సైతం శాసనసభలో ప్రస్తావించిన తక్షణమే, ఆ అకౌంట్, పోస్టులు పూర్తిగా అదృశ్యం కావడం వెనుక పెద్ద కుట్ర కోణం ఉన్నదని, దీనిపై సమగ్ర దర్యాప్తు జరపాలని కోరారు. నిందితులు ఎవరనేది తేల్చడంతోపాటు, డిజిటల్ ఆధారాలు (ఐపీ లాగ్‌లు, అకౌంట్ డాటా) కనుమరుగైపోకుండా ఎక్స్ సంస్థకు తక్షణమే సమాచారం అందించి ఎఫ్ఐఆర్ న మోదు చేయాలని కోరారు.
పోలీసులకు ఫిర్యాదు చేసిన అనంతరం ఆర్ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ.. సంధ్యారావు ఎవరో కాదు.. సాక్షాత్తు సీఎం రేవంత్‌రెడ్డే అని ఆరోపించారు. ఫేక్ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి.. అసెంబ్లీ వేదికగా పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని చెప్పా రు. సంధ్యారావు అకౌంట్ మహిళ పేరు మా త్రమేనని, ఫొటో కూడా మహిళదే అయినా.. ట్విట్టర్ స్పేస్‌లో మాట్లాడింది మాత్రం పురుషుడని చెప్పారు. ఆ పురుషుడు ఎవరు? ఆ వాయిస్ ఎవరిది? రేవంత్‌రెడ్డిదా? ఆయన అనుచరుల దా? అని ప్రశ్నించారు. ఈ ఫేక్ న్యూస్‌పై పోలీసులు కేసు నమోదు చేసి నిందితులను అరెస్టు చేయాలని కోరారు. అసెంబ్లీ వేదికగా సంధ్యారావు అకౌంట్ గురించి సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడారని.. ఎవరైనా నిజంగా అవమానంగా భావిం చి, దాడులకు పాల్పడితే ఎవరు బాధ్యులు? అల్లర్లు, కొట్లాటలు సృష్టించే భాష మాట్లాడిన రేవంత్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలని అన్నారు. లక్షల ట్విట్టర్ అకౌంట్లు ఉన్నా.. సంధ్యారావు అకౌంటే ఎలా దొరికింది? వేల పోస్టులు ఉన్నా, ఈ పోస్టునే రేవంత్‌రెడ్డి అసెంబ్లీలో ఎలా చదివారు? అని ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నేతలు వై సతీశ్‌రెడ్డి, వాసుదేవరెడ్డి పాల్గొన్నారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 10 (నమస్తే తెలంగాణ): అసెంబ్లీలో సీఎం ప్రకటించిన ‘సంధ్యారావు’ సృష్టికర్త అనుముల అలియాస్ అబద్ధాల రేవంత్‌రెడ్డేనని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ మండిపడ్డారు. హైదరాబాద్‌లోని తెలంగాణభవన్‌లో కార్పొరేషన్ మాజీ చైర్మన్ వై సతీశ్‌రెడ్డితో కలిసి గురువారం విలేకరులతో మాట్లాడారు. ఎర్రవల్లిలో మాదిగలు చావు డప్పుకొట్టారని అవమానించిన ముఖ్యమంత్రి వెంటనే బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజాసమస్యలపై మాట్లాడేందుకు వచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను కాంగ్రెస్ సర్కార్ అడ్డుకోవడం సిగ్గుచేటని ధ్వజమెత్తారు. మహిళా ఎమ్మెల్యేల వద్ద పురుష పోలీసు లు, పురుష ఎమ్మెల్యేల వద్ద మహిళా పోలీసులను పెట్టి కావాలని వివాదాస్పదం చేశారని దుయ్యబట్టారు.
అసెంబ్లీ గేట్ ఎదుట జరిగిన ఘటనలో తప్పు లేకుండా ఒక ఎమ్మెల్సీపై కేసులు పెట్టారని మండిపడ్డారు. స్పీకర్ ప్రసాద్‌ను కాంగ్రెస్ సభ్యులే పదే పదే దళితుడని అవమానిస్తున్నారని పేర్కొన్నారు. మంత్రి సీతక్క సభను తప్పుదోవ పట్టించారని, తాతా మధు స్పీకర్‌ను తిట్టలేదని పోలీస్ రిపోర్టుతో పాటు కోర్టు కూడా కొట్టివేసిందని వ్యాఖ్యానించారు. ఎర్రవెల్లిలో కేసీఆర్ ఇంటిపై దాడికి వెళ్లిన వారికి ఎమ్మెల్యేలు కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి, బీర్ల ఐలయ్యయాదవ్, వేముల వీరేశం నాయకత్వం వహించారని, పోలీసులే ఎస్కార్ట్ ఇచ్చి పంపించారని మండిపడ్డారు. కేసీఆర్‌ను కాపాడుకునేందుకు వెళ్లిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను మాత్రం పోలీసులు అరెస్ట్ చేశారని విమర్శించారు.
బీఆర్ఎస్ అంతర్జాతీయ కార్యదర్శి సంధ్యారావు పేరిట పోస్ట్ రేవంత్‌రెడ్డే సృష్టించారని ఆర్ఎస్పీ మండిపడ్డారు. అసలు ఫేక్ న్యూస్ పెట్టింది రేవంతేనని, అసెంబ్లీని తప్పుదోవ పట్టిస్తూ చర్చించడమే కాకుండా చివరికి సిట్ వేసింది కూడా ఆయనేనని ధ్వజమెత్తారు. వీర్లపల్లి శంకర్‌పై బంజారాహిల్స్‌లో కేసు పెట్టినా ఇప్పటివరకు ఎఫ్ఐఆర్ కూడా నమోదు కాలేదని పేర్కొన్నారు. కాంగ్రెస్ నేతలు డప్పును, మాదిగలను అవమానించారని మండిపడ్డారు. సజీవంగా ఉన్న వ్యక్తిని చావాలని డప్పు, మాదిగ జాతి కోరుకోబోదని స్పష్టంచేశారు. సీఎం వెంట నే మాదిగలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.