NTR | ఫహాద్ ఫాజిల్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ ప్రీ-రిలీజ్ వేడుక హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. అక్టోబర్ 2న సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తారక్ రాకతో ఈవెంట్లో అభిమానుల సందడి మరింత పెరగగా.. దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు చేసిన సరదా వ్యాఖ్యలు మాత్రం ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. శశాంక్ ఏలేటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ఫాంటసీ ఎంటర్టైనర్ను ఎస్.ఎస్. రాజమౌళి సమర్పిస్తున్నారు. ఆర్కా మీడియా వర్క్స్, షోయింగ్ బిజినెస్ బ్యానర్లపై శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని, ఎస్.ఎస్. కార్తికేయ నిర్మించారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు, ట్రైలర్ సినిమాపై ఆసక్తిని పెంచాయి.
వేదికపైకి వచ్చిన కె. రాఘవేంద్రరావు తన ప్రసంగాన్ని ‘జై ఎన్టీఆర్’ అంటూ ప్రారంభించడంతో అభిమానులు ఒక్కసారిగా కేరింతలు కొట్టారు. అయితే వెంటనే ఆయన తన మాటలకు కాస్త ఫన్ అందించారు. తాను చెప్పిన ‘జై ఎన్టీఆర్’ అక్కడ కూర్చున్న జూనియర్ ఎన్టీఆర్‌ను ఉద్దేశించి కాదని, విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావును ఉద్దేశించిందేనని స్పష్టం చేస్తూ నవ్వులు పూయించారు. ఆ తర్వాత నందమూరి కుటుంబంలోని తరాలను ప్రస్తావిస్తూ తనదైన శైలిలో చమత్కరించారు. నందమూరి తారక రామారావు తర్వాత ఆయన కుమారుడు నందమూరి హరికృష్ణ, ఆ తర్వాత ఆయన కుమారుడు జూనియర్ ఎన్టీఆర్ అంటూ రాఘవేంద్రరావు చెప్పుకొచ్చారు. చివరగా తారక్‌ను ‘జెన్‌జీ ఎన్టీఆర్’ అంటూ సరదాగా సంబోధించడంతో సభలో నవ్వులు పూశాయి.
దర్శకేంద్రుడి మాటలు వింటూ జూనియర్ ఎన్టీఆర్ చిరునవ్వులు చిందించాడు. పక్కనే ఉన్న ఎస్.ఎస్. రాజమౌళి కూడా నవ్వుతూ కనిపించారు. రాఘవేంద్రరావుకు, ఎన్టీఆర్ కుటుంబానికి ఉన్న అనుబంధం నేపథ్యంలో సాగిన ఈ సరదా సంభాషణ అక్కడున్న వారిని ఆకట్టుకుంది.రాఘవేంద్రరావు చేసిన వ్యాఖ్యల కంటే ఆయన మాటలకు తారక్ ఇచ్చిన స్పందనే ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కువగా చర్చకు వస్తోంది. ఎలాంటి అసహనం లేకుండా నవ్వుతూ తారక్ ఆ సందర్భాన్ని స్వీకరించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. దర్శకేంద్రుడితో తారక్‌కు ఉన్న సాన్నిహిత్యం ఈ సందర్భంలో మరోసారి కనిపించిందంటూ పలువురు నెటిజన్లు స్పందిస్తున్నారు. ముఖ్యంగా సీనియర్ ఎన్టీఆర్‌ను ప్రస్తావించిన సమయంలో తారక్ చూపించిన గౌరవం కూడా అభిమానుల దృష్టిని ఆకర్షించింది.