న్యూఢిల్లీ, సెప్టెంబర్ 10: సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ల (సిప్) ద్వారా పెట్టుబడులు రికార్డ్ స్థాయికి చేరాయి. గత నెల ఆగస్టులో రూ.32,297 కోట్లుగా నమోదయ్యాయి. అంతకుముందు నెల జూలైలో రూ.31, 961 కోట్లుగా ఉన్నట్టు గురువారం విడుదలైన భారతీయ మ్యూచువల్ ఫండ్ అసోసియేషన్ (యాంఫీ) గణాంకాల్లో తేలింది. ఇక నిరుడు ఆగస్టులో రూ.28,265 కోట్లుగా ఉండగా, అప్పటితో పోల్చితే ఈసారి దాదాపు 14 శాతం వృద్ధి కనిపించింది.
తాజా పెరుగుదలతో ఈ ఆర్థిక సంవత్సరం (2026-27) తొలి 5 నెలల్లో (ఏప్రిల్-ఆగస్టు) దాదాపు రూ.1.6 లక్షల కోట్లకు చేరాయి. ఇదిలావుంటే ఈ ఆగస్టులో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ స్కీములు రూ.29,329 కోట్ల పెట్టుబడుల్ని ఆకర్షించాయి. ఇది గడిచిన 4 నెలల్లో అత్యధికం. స్టాక్ మార్కెట్లలో ఒడిదుడుకులున్నా.. మదుపర్లు మిడ్, స్మాల్‌క్యాప్ ఫండ్లలో ఇన్వెస్ట్ చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారని ట్రేడర్లు చెప్తున్నారు. జూలైలో రూ.24,697 కోట్లుగా ఉన్నట్టు యాంఫీ వెల్లడించింది.