అరచేతిలో స్వర్గం చూపించి.. పేదల నీడను కబళించడం! ఆకాశ హర్మ్యాలను చూపించి బస్తీలను బలిపెట్టడం! భావితరాలను ప్రస్తావిస్తూ.. బాధితులను రోడ్డున పడేయడం! ఇందిరమ్మ రాజ్యమంటూ ఇల్లు లేకుండా చేయడం! గాంధీ సరోవర్ అని పేరు పెట్టి.. బతుకుల్ని చిదిమేయడం! మూసీ ప్రాజెక్టులో అన్నీ పరస్పర విరుద్ధాలే! మాటకు, చేతకు పొంతన కుదరని విషయాలే!
మూసీపై రేవంత్ సర్కార్ ఆడుతున్న దాగుడుమూతలకు లెక్కే లేదు. వాటికి కొనసాగింపు అన్నట్టుగా డీపీఆర్ విడుదల చేసింది. బాధితుల్లేరు. మేధావుల్లేరు. పర్యావరణవేత్తలను సంప్రదించిందీ, ప్రజలతో చర్చించిందీ లేదు. బఫర్ అంటూ ఇండ్లు కూల్చి భారీ నిర్మాణాలు కట్టడమేనా సుందరీకరణ? పేదల్ని తరిమేసి రియల్ఎస్టేట్ దందాకు బాటలు పర్చడమేనా పునరుజ్జీవం? భూముల లొల్లే తప్ప, బతుకుల ప్రస్తావనేది? అసలు పాయింట్లను వదిలేసిన సర్కార్ పవర్‌పాయింట్.. ప్రజల ప్రశ్నలకు సమాధానం లేని గ్రాఫిక్ గారడీగా మిగిలిపోయింది.
హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, మార్చి 13 (నమస్తే తెలంగాణ): అసలే సింగపూర్ కన్సల్టెంట్ల ప్రజెంటేషన్.. గాలిలో అమరావతిని నిర్మించిన అనుభవం.. ఇంకేముంది! చారిత్రక మూసీ నది గ్రాఫిక్స్‌లో నిండా మునిగిపోయింది. లండన్, దక్షిణ కొరియా, పారిస్, సింగపూర్, దుబాయ్, జపాన్ ఇలా అనేక రివర్ ఫ్రంట్ ప్రాజెక్టుల స్ఫూర్తితో మన మూసీ నదీ పరీవాహకం భారీ ఎత్తున ఆకాశహర్మ్యాల రంగుల ప్రపంచంలో తేలియాడనున్నది. బాపూఘాట్ నుంచి గౌరెల్లి వరకు 200 మీటర్ల వెడల్పుతో విస్తరించనున్న నదికి రెండువైపులా హోటళ్లు, రెస్టారెంట్లు, వినోద కేంద్రాలు, రాత్రి మార్కెట్లతో జిగేల్ మనిపించేందుకు రేవంత్ సర్కార్ రంగం సిద్ధం చేసింది.
ఈ మేరకు శుక్రవారం సాయంత్రం కాంగ్రెస్ ప్రభుత్వం హోటల్ తాజ్ కృష్ణాలో ఇచ్చిన మూసీ సుందరీకరణ పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌తో మూసీ నది ఇక రియల్ వ్యాపారానికి కేంద్ర బిందువుగా మారనున్నదని మరోసారి రుజువైంది. గతంలో సచివాలయం వేదికగా సీఎం రేవంత్‌రెడ్డి చెప్పినట్టుగానే ఈ ప్రజెంటేషన్‌లోనూ రేవంత్ సర్కార్ పాత పాటే పాడింది. కొత్త చరిత్రను లిఖించేందుకు పరీవాహకంలోని నిరుపేదలంతా తమ ఇండ్లు త్యాగం చేయాలని పిలుపునిచ్చింది. ఐదు దశల్లో మూసీ ప్రాజెక్టు చేపడుతున్నామని ప్రకటించిన ప్రభుత్వం రోజుల వ్యవధిలోనే ఫేజ్-1లోని గాంధీ సరోవర్ అంచనా వ్యయాన్ని రూ.5 వేల కోట్ల నుంచి రూ.6,500-7వేల కోట్లకు పెంచేసింది.
భూములు, ఇండ్లు కోల్పోతున్న బాధితుల మనోగతాన్ని పట్టించుకోకుండా పర్యావరణవేత్తలు, మేధావుల సలహాలు లేకుండానే ప్రాజెక్టు సమగ్ర నివేదిక (డీపీఆర్)ను పూర్తిచేసి వారం తర్వాత సలహాలు తీసుకుంటామని ప్రకటించింది. కానీ ఏడాదిన్నర పాటు మథనం చేసి తయారు చేశామన్న నివేదికలో ఎక్కడ ఎన్ని ఎకరాలు సేకరించనున్నారు? ఎన్ని ఇండ్లు, నిర్మాణాల్ని కూల్చివేయనున్నారనే వివరాలు మాత్రం బహిరంగ పరచలేదు.
రెండున్నరేండ్లుగా మూసీ పాట పడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం అసలు స్వరూపం మరోసారి బట్టబయలైంది. ఆది నుంచీ అంతా శంకిస్తున్నట్టుగానే ఫక్తు రియల్ ఎస్టేట్ వ్యాపారానికి ఈ జీవనదిని వాడుకోనున్నదని తేలిపోయింది. తాజ్ కృష్ణాలో నిర్వహించిన ప్రజెంటేషన్‌ను పరిశీలిస్తే మూసీ మురికిని వదిలించడం కంటే ప్రధానంగా పర్యాటకం, పెట్టుబడులు రాబట్టి నైట్ మార్కెట్‌తో మూసీ పరీవాహకాన్ని రియల్ వ్యాపారంతో కూడిన ఆర్థిక కేంద్రంగా మార్చేందుకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇచ్చినట్టుగా అర్థమవుతున్నది. ముఖ్యంగా అమరావతి గ్రాఫిక్స్‌తో ప్రాచుర్యం పొందిన సింగపూర్ కన్సార్టియం ఇక్కడా అదే గ్రాఫిక్స్ మాయాజాలాన్ని ప్రదర్శించింది. లండన్‌లోని థేమ్స్, దక్షిణ కొరియాలోని సియోల్, పారిస్‌లోని సియెన్, సింగపూర్ రివర్ ఫ్రంట్, దుబాయ్ వాటర్ ఫ్రంట్, టో క్యో సమిదా రివర్‌ఫ్రంట్ ఫొటోలను జోడించి మూసీని గ్రాఫిక్స్‌లో ముంచేసింది.
ఆది నుంచీ మూసీ సుందరీకరణ ప్రాజెక్టు అంచనా వ్యయంపై పూటకో ప్రకటన చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం డీపీఆర్ పూర్తి చేసిన ఫేజ్-1 గాంధీ సరోవర్ ప్రాజెక్టు అంచనా వ్య యాన్ని కేవలం రోజుల వ్యవధిలోనే అమాం తం పెంచేసింది. రూ.50 వేల కోట్ల నుంచి మొదలైన మూసీ ప్రాజెక్టు అంచనా ఒక్కసారిగా లక్షన్నర కోట్లకు చేరుకున్నది. దీనిపై ప్రజల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత రావడంతో ప్రభుత్వం ఇప్పుడు ఐదు దశల్లో చేపడుతామంటూ ప్రాజెక్టును విభజించింది. ఇందులో భాగంగా ఫేజ్-1కు రూ.5 వేల కోట్లు అవుతాయని కొన్నిరోజులుగా ప్రచారం చేసింది. కానీ ఎమ్మార్డీసీఎల్ ఎండీ నర్సింహారెడ్డి ఇచ్చిన ప్రజెంటేషన్‌లో స్పష్టంగా మొదటి దశ అంచనా వ్యయం రూ.6500-7వేల కోట్లుగా స్పష్టంచేశారు. ఇక్కడ కీలక విషయం ఏమిటంటే ఈ అంచనా వ్యయంలో ఎక్కడా భూసేకరణకు పరిహారం లేదని, టీడీఆర్ రూపంలో పరిహారం ఇస్తామని ఎండీ నర్సింహారెడ్డి చెప్పారు. కొన్నిరోజుల కిందట మా త్రం సీఎం రేవంత్‌రెడ్డి మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్ వారికి భూమికి భూమిగానీ, ఫ్లాట్‌కు ఫ్లాట్గానీ ఇస్తామని చెప్పడం గమనార్హం.
జంట జలాశయాల నుంచి గౌరెల్లి వరకు 55 కిలోమీటర్ల మూసీ సుందరీకరణకు నది రెండువైపులా బఫర్‌జోన్ వరకు కూల్చివేసే ఇండ్లు, నిర్మాణాలపై కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా దోబూచులాడుతూనే ఉన్నది. అసలు ప్రాజెక్టుపై కించిత్తు ప్రాథమిక అంచనా లేకుండానే చాదర్‌ఘాట్ పరిధిలో మూసానగర్, శంకర్‌నగర్‌లో ఏకంగా 174 ఇండ్లు కూల్చివేసి ఆ కుటుంబాలను వీధిన పడేసింది. ఇప్పుడు తాపీగా ఎగువన మొదటి దశ చేపడుతామని చెప్తున్నది. ఈ క్రమంలో అసలు ఎందుకు రెండేండ్ల కిందటే ఆ ఇండ్లు కూల్చివేశారో? ఎవరికీ అంతుబట్టని అంశం. కాగా మూసీ ప్రాజెక్టుకు మొత్తంగా 3 వేలకు పైగా ఎకరాలు సేకరించి, 10,017 ఇండ్లే కూల్చివేయనున్నట్టు ప్రభుత్వం 2025, డిసెంబర్లో గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. కానీ తాజ్ కృష్ణాలో ఇచ్చిన ప్రజెంటేషన్‌లో భాగం గా 55 కిలోమీటర్ల పొడవు 200 మీటర్ల వెడల్పుతో నదిని స్వాధీనం చేసుకొని కార్యకలాపాలు చేపడుతామని ప్రకటించారు. ఇందులో ప్రతిచోటా నది వెడల్పు 100 మీటర్లుగా ఉంటే రెండువైపులా 50 మీటర్ల బఫర్‌జోన్ చొప్పున మరో వంద మీటర్లు మొత్తంగా 200 మీటర్ల వెడల్పులో (సుమారు 660 అడుగులు) ఇండ్లు, నిర్మాణాలు కూల్చివేస్తామని స్పష్టం చేశారు. గెజిట్‌లో ప్రకారం కాకుండా అంతకుమించి భారీ ఎత్తున ఇండ్లు ఈ పరిధిలోకి వస్తున్నాయని సాధారణంగా గూగుల్ మ్యాప్‌ను చూస్తే అర్థమవుతుంది. అందుకే నర్సింహారెడ్డి తన ప్రజెంటేషన్‌లో ఎక్కడా నిర్మాణాల వివరాలు వెల్లడించలేదు.
మూసీ సుందరీకరణ ప్రాజెక్టులో కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్నది ఒకటి.. గ్రాఫిక్స్ రూపం లో చూపిస్తున్నది మరొకటనేది అర్థమవుతున్నది. నదికి రెండువైపులా 50 మీటర్ల చొప్పు న బఫర్‌జోన్ ఏర్పాటు చేస్తామని, అందులో ఎలాంటి నిర్మాణాలకు అనుమతులు ఉండవని అంటున్నది. భారీ ఎత్తున పెట్టుబడులను ఆకర్షించి నైట్ మార్కెట్‌తో అద్భుతమైన పర్యాటక కేంద్రాన్ని నిర్మిస్తామని సెలవిస్తున్నది. ఈ నేపథ్యంలో హోటళ్లు, రెస్టారెంట్లు, వినోద కేంద్రాల నిర్మాణం ఎక్కడ చేస్తారనే కీలక అం శాన్ని మాత్రం వెల్లడించలేదు.
ప్రజెంటేషన్ సందర్భంగా సీఎం రేవంత్ ‘మీ అందరికీ ఇష్టమైతేనే ప్రాజెక్టు చేస్తా.. లేకపోతే మానుకుంటా’ అని పునరుద్ఘాటించారు. ఇందులో అందరి భాగస్వామ్యం కావాలని చెప్పారు. వాస్తవానికి డీపీఆర్ రూపకల్పనకు ముందే ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాలి. కానీ రేవంత్ సర్కార్ అదేమీ లేకుండా సింగపూర్ కన్సార్టియంతో నాలుగు గోడల మధ్య డీపీఆర్ పూర్తి చేసి స్టార్ హోటల్లో ప్రజెంటేషన్ ఇచ్చింది. భూములు, ఇండ్లు కోల్పోయేవారు, మేధావులు, పర్యావరణవేత్తలు, ప్రజ లు కలిసి రావాలని పిలుపునిచ్చింది. ఏదో నామమాత్రంగా సూచనలు స్వీకరించామనేందుకు వారం తర్వాత డీపీఆర్‌ను వెబ్సైట్లో ఉంచి సలహాలు స్వీకరిస్తామని నర్సింహారెడ్డి ప్రకటించారు. సర్కార్ ఏకపక్ష నిర్ణయాలకు నిరసనగానే మేధా పాట్కర్ పీపీటీని బహిష్కరించారన్న విమర్శలున్నాయి.
కేసీఆర్ ప్రభుత్వం మూసీ ప్రక్షాళన కోసం ఏటా ఐదు టీఎంసీల గోదావరి జలాలను జంట జలాశయాలకు తరలించాలనే ప్రణాళిక వేసింది. కాంగ్రెస్ మల్లన్నసాగర్ నుంచి 20 టీఎంసీలు తరలించి అందు లో 15 టీఎంసీలను నగర తాగునీటి కోసం, మిగిలిన ఐదు టీఎంసీలు మూసీ ప్రక్షాళనకు మళ్లిస్తామని చెప్పింది. ఆ మేరకు టెండర్లు పూర్తి చేసి పనులు కూడా అప్పగించింది. కానీ పీపీటీలో మూసీ ప్రక్షాళనకు కేవలం రెండున్నర టీఎంసీలే మళ్లించనున్నట్టు స్పష్టం చేయడం విస్మయానికి గురిచేసింది. సగానికి సగం తగ్గించ డం వెనుక సాంకేతిక కారణాలున్నాయా? అనే చర్చ జరుగుతున్నది.
మూసీ సుందరీకరణ పేరిట సర్కార్ బఫర్ జోన్‌ను కూడా చెరపట్టేందుకు సిద్ధమైందని పీపీటీలో తేలింది. మూసీ బఫర్ జోన్ పరిధిలోనే మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్ ఉన్నదనీ, ఈ భవనమే అక్రమమని, దాన్ని ఖాళీ చేయాలని చెప్తున్న సర్కార్ అదే బఫర్ జోన్లో భారీ నిర్మాణాలకు ప్రణాళికలు రూపొందించింది. మూసీ మధ్యలోనే గాంధీ సరోవర్ పేరిట అతిపెద్ద టవర్, ఇతర భవనాలు కట్టనున్నట్టు పీపీటీ ద్వారా స్పష్టమైంది. ప్రాజెక్టు విషయంలో మధు రిడ్జ్ అపార్ట్‌మెంట్‌కు వర్తించిన బఫర్ జోన్ నిబంధనలు, రివర్ బెడ్‌లోనే కడుతున్న భారీ నిర్మాణాలకు, పక్కనే ఉండే భారీ రాట్నం, 20 అంతస్తుల్లో నిర్మించే భవనాలకు వర్తించవా? అని నిపుణులు ప్రశ్నిస్తున్నారు. బఫర్ జోన్ నిబంధనలను మూసీలో కలిపి 55 కిలోమీటర్ల పొడవునా నదికి ఇరువైపులా భారీ భవంతులు, రివర్ ఫ్రంట్ పేరిట ప్రభుత్వం చేపట్టే నిర్మాణాలతో మూసీ ఏవిధంగా పునరుజ్జీవం పోసుకుంటుందని విస్మయానికి గురవుతున్నారు. మురుగు నీటిని కట్టడి చేయాల్సింది పోయి, నది వెంట భారీ భవంతులు నిర్మించి అక్కడ ఉత్పతయ్యే మురుగునీటిని ఎటు వైపు మళ్లిస్తారని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు.