కారేపల్లి,ఆగష్టు 2: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వ్యతిరేక విధానాలపై సమరభేరికి సిద్ధం కావాలని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఎర్రబాబు పిలుపునిచ్చారు. మండల కేంద్రంలోని విద్వాన్ స్కూల్లో ఆదివారం అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) కారేపల్లి మండల మహాసభ జరిగింది. ఈ మహాసభకు ముఖ్య అతిధిగా హాజరైన ఎర్రబాబు మాట్లాడుతూ.. యువతకు ఉపాధి కల్పించకుండా ప్రభుత్వాలు వారిని ఓటు బ్యాంకుగా మాత్రమే వాడుకుంటున్నాయని ధ్వజమెత్తారు.
పార్లమెంట్ సాక్షిగా ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న కేంద్ర ప్రభుత్వం,ఇప్పటివరకు ఆ హామీని నెరవేర్చలేదనీ సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఎర్రబాబు మండిపడ్డారు. రైల్వే శాఖలోనే 65 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నప్పటికీ నోటిఫికేషన్లు ఇవ్వడం లేదని ఆయన తెలిపారు. ప్రభుత్వ శాఖల్లో కేవలం రిటైర్మెంట్లు తప్ప కొత్తగా రిక్రూట్మెంట్లు లేవని ఎర్రబాబు విమర్శించారు. తాము అధికారంలోకి వస్తే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మాట తప్పిందని ఆయన మండిపడ్డారు. ఉద్యోగాలు, ఉపాధి లేకపోవడం వల్ల నేటి యువత గంజాయి, మత్తు పదార్థాలకు బానిసలవుతూ దారితప్పి చెడు అలవాట్ల వైపు ఆకర్షితులవుతున్నారని ఎర్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలపై దాడులు పెరగడానికి ఇది కూడా ఒక కారణమని ఆయన పేర్కొన్నారు.

నిరుద్యోగులందరికీ ఉద్యోగం వచ్చే వరకు నిరుద్యోగ భృతి చెల్లించి,అన్ని శాఖల్లోని ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని ఎర్రబాబు డిమాండ్ చేశారు. రైతులకు మద్దతు ధరతో పాటు సకాలంలో ఎరువులు, విత్తనాలు అందించి ఆదుకోవాలని ఆయన కోరారు. కార్మికుల హక్కులను కాలరాసే చట్టాలను రద్దు చేసి, సరైన వేతనాలు అందించాలని డిమాండ్ చేశారు. పోటీ పరీక్షలను రదర్శకంగా నిర్వహించానీ,వృద్ధులకు, పింఛనుదారులకు నెలానెలా సకాలంలో పెన్షన్లు అందించి సామాజిక భద్రత కల్పించాలని ఆయన కోరారు.
యువత, విద్యార్థులు, కార్మికులు తమ హక్కుల సాధన కోసం ఐక్యంగా పోరాటాలకు సిద్ధం కావాలని ఎర్రబాబు పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి నానబాల రామకృష్ణ, సీపీఐ నాయకులు ఉంగరాల సుధాకర్, రావి శివరామకృష్ణ, ఏఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఇటుకల రామకృష్ణ, జిల్లా సహాయ కార్యదర్శి చింతల రమేష్, వర్కింగ్ ప్రెసిడెంట్ మద్దోజు శ్రావణ్ కుమార్, మండల పార్టీ సీనియర్ నాయకులు తాతా వెంకటేశ్వర్లు, చెన్నంశెట్టి భూషయ్య, పుచ్చకాయల శ్రీనివాసరావు, గోకర సైదులు, రాజేష్, బొమ్మగాని మహేష్, కేతావత్ రవి, బొమ్మల కృష్ణ, కర్ణ కుమార్, ఈసం నరేష్, తదితరులు పాల్గొన్నారు.