హైదరాబాద్, సెప్టెంబర్ 16 (నమస్తే తెలంగాణ) : దేశంలోని నగరాలను ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదలకు అనుకూలంగా మార్చేందుకు తాతాలిక ఉపశమనాలు కాకుండా సమగ్రమైన, శాశ్వత పరిషారాలను అన్వేషించాల్సిన బాధ్యత పాలకులపై ఉన్నదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు పేర్కొన్నారు. ప్రఖ్యాత స్వచ్ఛంద సంస్థ ‘జనాగ్రహ’ ఆధ్వర్యంలో బుధవారం న్యూఢిల్లీలోని ఇండియా హ్యాబిటాట్ సెంటర్లో ‘షెహరోంపే చర్చ’ పేరిట అఖిలపక్ష సదస్సును ఘనంగా నిర్వహించారు. సదస్సులో భాగంగా ఎంపీలు మహువా మాజీ, ఎస్ నిరంజన్‌రెడ్డి, జనాగ్రహ సీఈవో శ్రీకాంత్ విశ్వనాథన్‌తో కలిసి కేటీఆర్ ప్యానెల్ చర్చలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. పట్టణీకరణ సవాళ్లు, గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణలో చేపట్టిన వినూత్న విధానాలను వివరించారు. కేసీఆర్ హయాంలో తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పట్టణాభివృద్ధి, మౌలిక వసతుల కల్పన, పౌరసేవల మెరుగుదలకు అమలుచేసిన అత్యుత్తమ విధానాలు, ఆచరణాత్మక కార్యాచరణను ప్రస్తావించారు. భవిష్యత్తులో దేశంలోని నగరాలను మరింత మెరుగ్గా తీర్చిదిద్దేందుకు అవసరమైన బ్లూప్రింట్‌పై ఈ చర్చావేదికలో సమగ్రంగా చర్చించారు.
రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌పై పెరుగుతున్న జనాభా, మౌలిక వసతుల భారాన్ని తగ్గించేందుకు గత కేసీఆర్ ప్రభుత్వం వ్యూహాత్మకంగా అడుగులు వేసిందని కేటీఆర్ వివరించారు. పాలనా వికేంద్రీకరణను ప్రధాన లక్ష్యంగా చేసుకొని, రాష్ట్రంలోని ప్రతి జిల్లా కేంద్రంలో ఒక సూపర్ స్పెషాలిటీ దవాఖానతోపాటు ప్రభుత్వ వైద్య కళాశాలను నెలకొల్పినట్టు తెలిపారు. దీనివల్ల గ్రామీణ, పట్టణ ప్రాంత ప్రజలు చికిత్స కోసం రాజధానిపై ఆధారపడే పరిస్థితి గణనీయంగా తగ్గిందని చెప్పారు.
సమాంతర ఆర్థిక వృద్ధిని సాధించాలనే లక్ష్యంతో ఐటీ పరిశ్రమను కేవలం హైదరాబాద్ నగరానికే పరిమితం చేయకుండా టైర్-2 నగరాలకు కూడా విస్తరించామని కేటీఆర్ తెలిపారు. వరంగల్, ఖమ్మం, కరీంనగర్, నిజామాబాద్, మహబూబ్‌నగర్ వంటి పట్టణాల్లో అత్యాధునిక ఐటీ టవర్లను ఏర్పాటు చేయడం ద్వారా స్థానిక యువతకు వారి సొంత ప్రాంతాల్లోనే ఉపాధి అవకాశాలు లభించాయని, ఫలితంగా మెట్రో నగరాలకు జరిగే వలసలు కూడా అదుపులోకి వచ్చాయని వివరించారు.
పట్టణాల్లో ట్రాఫిక్ రద్దీ, ప్రజారవాణా సమస్యల పరిషారానికి హై-స్పీడ్ రైలు మార్గాలే కీలకమని మాజీ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ప్రభుత్వాలు ఈ దిశగా దృష్టిసారించి ప్రధాన నగరాలను అనుసంధానించే హై-స్పీడ్ రైలు కారిడార్లను అభివృద్ధి చేస్తే, మెగా నగరాలపై రోజువారీ ప్రయాణికుల ఒత్తిడి చాలావరకు తగ్గుతుందని చెప్పారు. రాబోయే దశాబ్దకాలంలో ఈ ఆధునిక రవాణా వ్యవస్థలు దేశవ్యాప్తంగా పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తాయన్న బలమైన ఆశాభావాన్ని వ్యక్తంచేశారు.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా నగర పాలక సంస్థలకు మూలధన సేకరణ, నిధుల కొరత అతిపెద్ద సవాలుగా మారిందని కేటీఆర్ పేర్కొన్నారు. పట్టణాల్లో నిరంతర అభివృద్ధి పనులను కొనసాగించడానికి, రోజువారీ నిర్వహణకు అవసరమైన నిధులను సమకూర్చుకోవడంలో మున్సిపాలిటీలు తీవ్ర ఇబ్బందులు ఎదురొంటున్నాయని తెలిపారు. ఈ ఆర్థిక లోటును అధిగమించడానికి వినూత్నమైన, అందరికీ ఆమోదయోగ్యమైన సమ్మిళిత ఆర్థిక పరిషారాలను అన్వేషించాల్సిన అవసరం ఉన్నదని సూచించారు.
సదస్సు ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ‘భారత్ ఏఐ ఎక్స్‌పీరియన్షియల్ సెంటర్’ను కేటీఆర్ సందర్శించారు. ప్రజా సంక్షేమం, పౌరసేవల మెరుగుదల కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాధనాలను అభివృద్ధి చేస్తున్న పలు సాంకేతిక సంస్థల ప్రతినిధులతో ఆయన ముచ్చటించారు. కాగా, భారత నగరాల్లో జీవన ప్రమాణాల మెరుగుదల, పట్టణ పాలనా సంసరణల కోసం ప్రభుత్వాలు, కాగ్, నీతి ఆయోగ్, ఆర్థిక సంఘాలతో కలిసి పనిచేస్తున్న లాభాపేక్షలేని స్వచ్ఛంద సంస్థగా ‘జనాగ్రహ’ కీలక పాత్ర పోషిస్తున్నదని నిర్వాహకులు వివరించారు.
పౌరులు తమ సమస్యలను ప్రజాప్రతినిధుల దృష్టికి తెచ్చినప్పుడు తక్షణ రాజకీయ లబ్ధి కోసమో లేదా ఆకస్మిక ప్రతిస్పందనలతోనో సరిపెట్టడం ఏమాత్రం సరైంది కాదని కేటీఆర్ పేర్కొన్నారు. సంక్లిష్టమైన పట్టణ సవాళ్లను అధిగమించాలంటే దీర్ఘకాలిక వ్యూహాలు, విధానపరమైన స్పష్టతతో కూడిన సంపూర్ణ ప్రణాళికలను రూపొందించుకోవాలని ఉద్ఘాటించారు. పాలకులు శాశ్వత ప్రాతిపదికన పరిషారాలను అమలు చేసినప్పుడే నగరాల రూపురేఖలు మారతాయని అభిప్రాయపడ్డారు.