సిటీబ్యూరో, సెప్టెంబర్ 16 (నమస్తే తెలంగాణ) : 22ఏ కష్టాలు ఇప్పట్లో తీరేలా లేవు. కాంగ్రెస్ సర్కార్ అంటించిన ‘నిషేధిత’ నిప్పు రవ్వ.. పేదల ఆస్తులను దహించివేస్తున్నది.. ఆ ఆగ్రహ అగ్నికీలలను చల్లార్చేందుకు తక్షణ చర్యలు తీసుకోవడంలో సర్కార్ పూర్తిగా విఫలమైందనే ఆరోపణలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. అధీకృత ప్రభుత్వ సంస్థలే అనుమతులిచ్చిన లేఔట్లు, భవనాలను నిషేధిత జాబితాలో చికుకుంటే..వాటిని తొలగించేందుకు మరికొంత సమయం పట్టేలా ఉంది. హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ వంటి అధికారిక సంస్థలు నిర్మాణాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఆ భూములు.. నిషేధిత జాబితాలో ఉండడం గమనార్హం.
ఈ విషయాన్ని స్వయంగా ముఖ్యమంత్రి అసెంబ్లీ వేదికగా అంగీకరించడం.. ప్రభుత్వ యంత్రాంగంలోని సమన్వయ లోపాన్నే బయటపెడుతున్నదనే విమర్శలు వస్తున్నాయి. అయితే ఈ జాబితా నుంచి అలాంటి ఆస్తులను తొలగించేందుకు నిర్దిష్ట విధి విధానాలను వారం రోజుల్లోగా రూపొందించాలని అధికారులను ఆదేశించగా, ఆ ప్రక్రియ పూర్తయినా.. జాబితా నుంచి తొలగింపు ప్రక్రియ అనుకున్నంత సులువు కాదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. తక్షణ చర్యలతోనే పరిష్కారమంటూ..ప్రభుత్వ తీరుపై భూ యజమానులు మండిపడుతున్నారు.
ఏండ్ల కిందటే జీహెచ్ఎంసీ ప్లాన్ అప్రూవల్స్ తీసుకొని.. కరెంటు మీటర్లు, డ్రైనేజీ కనెక్షన్లు పొందిన ఆస్తి పన్ను కడుతున్న ఇండ్లు సైతం రాత్రికి రాత్రి నిషేధిత జాబితాలో చేరడంతో గ్రేటర్ హైదరాబాద్లో వందలాది కాలనీలు కొద్ది రోజులుగా ఆందోళనలో మునిగిపోయాయి. పటాన్చెరు నియోజకవర్గంలో ఒక కాలనీలోనే 55 ఎకరాల్లో 1,500 ఇండ్లు అన్ని శాఖల అనుమతులతో పన్నెండేండ్ల కిందట నిర్మించుకుంటే… ఒకసారిగా నిషేధిత జాబితాలో చేరడంపై నివాసితులు ఆవేదన చెందుతున్నారు. సర్కారే అనుమతించిన నిర్మాణాలను ప్రభుత్వమే నిషేధించడం ఏమిటన్న ప్రశ్నకు ఇప్పటికీ స్పష్టమైన సమాధానం లేదు.
అనుమతులు ఉన్న లేఔట్లు, ప్లాట్లను ఎలా గుర్తించాలి, ఎలాంటి ప్రమాణాలతో నిషేధిత జాబితా నుంచి తొలగించాలనే దానిపై మార్గదర్శకాలు సిద్ధం చేయాలని సీఎం ఆదేశించినప్పటికీ, ఈ సమస్య ఇప్పటికే నెలల తరబడి కొనసాగుతున్నదన్న విషయాన్ని ఆయన మరిచిపోయారు. అసెంబ్లీ సమావేశాలు మొదలైనప్పటి నుంచే 22ఏ అంశంపై చర్చకు బీఆర్ఎస్ పట్టుబట్టింది. కానీ ప్రభుత్వం వాయిదాలతో కాలం గడిపిన సంగతి తెలిసిందే. తాజాగా సభలో సీఎం తప్పును అంగీకరిస్తూ, దిద్దుబాటు చర్యలు తీసుకున్నా… నిర్దిష్ట విధివిధానాలు వెలువడేదాకా, వాటి అమలు జరిగేదాకా బాధితులు మరింత కాలం నిరీక్షించక తప్పని పరిస్థితి. అధీకృత సంస్థల అనుమతులున్న ఆస్తులకు వెంటనే విముక్తి కల్పించాల్సిన చోట, వారం రోజుల నిబంధనల రూపకల్పనతో సరిపెట్టడం పాలనా వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునే యత్నంగానే కనిపిస్తున్నది.
రిజిస్ట్రేషన్లు, పట్టాలు, రుణాలు వంటి అవసరాల కోసం ఏండ్లుగా ఎదురుచూస్తున్న సామాన్యులకు, ప్రభుత్వ యంత్రాంగం అనుమతుల విధానం శాపంగా మారింది. సొంత సంస్థలు జారీ చేసిన అనుమతులను మరిచిన సర్కార్, ఆ భారాన్ని ప్రజల నెత్తిన వేసింది. ఇప్పటికే వేలాదిగా నిషేధిత ఉచ్చులో చిక్కుకున్న ఆస్తులను రక్షించుకునేందుకు ఎంతోమంది భూ యజమానులు దళారులు, మధ్యవర్తులకు బలవుతున్నారు. ఈ వ్యవహరాన్ని పారదర్శకంగా పరిష్కరిస్తామని చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో ఇప్పటికే నలిగిపోతున్న బాధితులకు ఏ విధంగా ఊరటనివ్వడం లేదు.