భారతీయ చలన చిత్రసీమలో అత్యున్నత పురస్కారమైన దాదాసాహెబ్ ఫాల్కేను బుధవారం కేంద్రప్రభుత్వం ప్రకటించింది. 2024 సంవత్సరానికిగాను ప్రముఖ కన్నడ నటుడు అనంత్‌నాగ్ ఈ ప్రతిష్టాత్మక పురస్కారానికి ఎంపికయ్యారు. ఈ నెల 22న గుజరాత్‌లోని కేవడియాలో జరిగే 72వ జాతీయ చలన చిత్ర అవార్డుల కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఈ పురస్కారాన్ని ప్రదానం చేయనున్నారు. కన్నడంతో పాటు హిందీ, మరాఠి, మలయాళ, తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో అనంత్‌నాగ్ 300పై చిలుకు చిత్రాల్లో నటించారు. ఐదు దశాబ్దాల సుదీర్ఘ నటప్రస్థానంలో ఎన్నో చిరస్మరణీయ పాత్రల ద్వారా ప్రేక్షకుల హృదయాల్ని గెలుచుకున్నారు.
సహజమైన నటనకు చిరునామా
అనంత్‌నాగ్ రంగస్థల కళాకారుడిగా అనుభవం గడించిన అనంతరం సినిమాల్లోకి వచ్చారు. ముంబయిలో విద్యార్థిగా ఉన్నప్పుడే ఆయన కొంకణి, కన్నడ, మరాఠి, హిందీ నాటకాల ద్వారా పేరు తెచ్చుకున్నారు. కన్నడ చిత్రం ‘సంకల్ప’ (1973)తో ఆయన సినీరంగ ప్రవేశం చేశారు. ఈ చిత్రం కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం అందించే సినీ పురస్కారాల్లో ఏడు అవార్డులను గెలుచుకొని సంచలనం సృష్టించింది. సమాంతర సినిమాలతో ప్రఖ్యాతి పొందిన దర్శకుడు శ్యామ్‌బెనగల్‌తో పరిచయం అనంత్‌నాగ్ సినీ కెరీర్‌ను మలుపుతిప్పింది. శ్యామ్‌బెనగల్ దర్శకత్వంలో వచ్చిన ‘అంకుర్’ (1974) ఆయన కెరీర్‌కు బ్రేక్‌నిచ్చింది.
ఆ తర్వాత ఆయన దర్శకత్వంలోనే రూపొందిన మంథన్, కొండుర, కల్యుగ్ వంటి చిత్రాలు అనంత్‌నాగ్‌కు జాతీయ స్థాయిలో గుర్తింపును తెచ్చాయి. కమర్షియల్, ఆర్ట్ సినిమా.. ఫార్మాట్ ఏదైనా తనదైన శైలి సహజ నటనతో ప్రేక్షకుల్ని మెప్పించేవారు అనంత్‌నాగ్. 1976లో వచ్చిన ‘బయలుదారి’ చిత్రం కన్నడనాట అనంత్‌నాగ్ స్థానాన్ని సుస్థిరం చేసింది. ‘గోధీ బన్నా సాధారణ మైకట్టు’ చిత్రంలో అల్జీమర్స్ రోగిగా ఆయన అసాధారణ నటనతో మెప్పించారు. ‘గణేశన మదువె’ (1990) చిత్రం ఆయనలోని హాస్యకోణాన్ని బయటకు తీసింది.
ప్రముఖ తెలుగు రచయిత మల్లాది వెంకట కృష్ణమూర్తి రచించిన ‘వినాయకరావు పెళ్లి’ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ముంగారు మళె (2006) చిత్రం ఆయన్ని కొత్తతరం ప్రేక్షకులకు చేరువచేసింది. కన్నడంలో కన్నేశ్వర రామ, రాజకుమార, గాలిపట-2, కేజీఎఫ్ ఫ్రాంఛైజీ చిత్రాలు ఆయకు మంచి పేరు తీసుకొచ్చాయి. సినిమాలతో పాటు బుల్లితెరమీద కూడా సత్తాచాటారాయన. ఆర్కే నారాయణ్ కథల ఆధారంగా రూపొందించిన ప్రసిద్ధ టెలీ సీరియల్ ‘మాల్గుడి డేస్’లో ఆయన పోషించిన మిఠాయివాలా పాత్ర అందరికి గుర్తుండిపోయింది.
తెలుగులోనూ గుర్తింపు
1977లో వచ్చిన ‘ప్రేమలేఖలు’ చిత్రంతో అనంత్‌నాగ్ తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. ఆ తర్వాత శాంతిక్రాంతి, రాత్రి, శంఖారావం, బాలు చిత్రాలతో గుర్తింపు పొందారు. నితిన్ హీరోగా నటించిన ‘భీష్మ’ చిత్రంలో వ్యాపారవేత్తగా అనంత్‌నాగ్ నటన అందరిని అలరించింది. కన్నడ రాజకీయాల్లోనూ అనంత్‌నాగ్ కీలకంగా వ్యవహరించారు. జనతాదళ్ తరపున ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా, మంత్రిగా పనిచేశారు. 2004లో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి అనంతరం ఆయన రాజకీయ నుంచి వైదొలిగారు. 2025లో ఆయన పద్మభూషణ్ పురస్కారాన్ని అందుకున్నారు. ఐదు దశాబ్దాల కెరీర్లో రంగస్థలంతో పాటు ఆర్ట్, కమర్షియల్ సినిమా, టెలివిజన్..ఇలా అనేక మాధ్యమాల్లో ఆయన నటుడిగా తిరుగులేని పేరు సంపాదించుకున్నారు.