న్యూఢిల్లీ, సెప్టెంబర్ 16: యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) లావాదేవీ రూ.2,000 దాటితే 0.4 శాతం మర్చంట్ డిస్కౌంట్ రేటు (ఎండీఆర్)ను చెల్లించాలన్న కేంద్ర ప్రభుత్వం నిర్ణయం నేపథ్యంలో వ్యాపారులు నగదు చెల్లింపులకే జై కొడుతున్నారు. మోదీ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయం అక్టోబర్ 15 నుంచి అమల్లోకి రానున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఈ అదనపు భారాన్ని తప్పించుకోవడానికి ఇప్పట్నుంచే రిటైల్ మార్కెట్లో వ్యాపారులు తమ కస్టమర్లను వీలైనంత వరకు నగదు రూపంలో చెల్లింపులు జరుపాలని కోరుతున్నారు.
2020 జనవరి నుంచి జీరో ఎండీఆర్ విధానం అమల్లోకి వచ్చిన సంగతి విదితమే. అయితే ఆరున్నరేండ్లు దాటాక కేంద్రం మళ్లీ చార్జీలను ప్రకటించింది. ‘ప్రభుత్వం యూపీఐ పేమెంట్స్‌ను తెచ్చినప్పుడు మేము మద్దతిచ్చాం. ఇప్పటికే వివిధ లావాదేవీ చార్జీలను, జీఎస్టీ భారాన్ని మోస్తున్నాం. ఇప్పుడు ఎండీఆర్ చార్జీలు అమలైతే ఇక నగదు లావాదేవీలనే ప్రోత్సహిస్తాం’ అని ఢిల్లీలోని కమలానగర్ మార్కెట్ అసోసియేషన్ అధ్యక్షుడు నితిన్ గుప్తా అన్నారు. కాగా, యూపీఐ ఎండీఆర్.. పండుగ సీజన్ అమ్మకాలపై ప్రతికూల ప్రభావాన్ని చూపగలదని భారతీయ రిటైలర్ల సంఘం (ఆర్ఏఐ) ఆందోళన వ్యక్తం చేస్తున్నది. ఇన్నాళ్లూ డిజిటల్ పేమెంట్స్‌ను ప్రోత్సహించిన చిరు వ్యాపారులు ఇకపై నగదు చెల్లింపుల దిశగా వెళ్లే అవకాశాలున్నాయని హెచ్చరించింది. మంగళవారం ఈ ఎండీఆర్ చార్జీలను కేంద్రం పరిచయం చేసిన విషయం తెలిసిందే.
18 శాతం జీఎస్టీ?
రూ.2,000 దాటిన యూపీఐ చెల్లింపులపై ఎండీఆర్ చార్జీలకు అదనంగా 18 శాతం వస్తు, సేవల పన్ను (జీఎస్టీ)ను వ్యాపారులు చెల్లించాల్సి రావచ్చన్న అంచనాలు వినిపిస్తున్నాయి. ఇవే నిజమైతే ప్రతిపాదిత ఎండీఆర్ చార్జీలు.. ఖజానాకు రూ.3,500-4,000 కోట్ల మేర ఆదాయాన్ని పెంచవచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే నమోదిత వ్యాపారులు ఈ భారం నుంచి ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ఐటీసీ)ను క్లెయిమ్ చేసుకోవడం ద్వారా ఊరట పొందవచ్చనీ ఎక్స్పర్ట్స్ అంటున్నారు.
తగ్గేదేలే: కేంద్రం
ఎండీఆర్ చార్జీలపై వెనుకకు తగ్గే ప్రసక్తే లేదని బుధవారం కేంద్ర ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి. రూ.2,000 దాటిన యూపీఐ చెల్లింపులపై విధించిన ఎండీఆర్ చార్జీల విషయంలో పునరాలోచన ఏమైనా ఉందా? అన్న ప్రశ్నకు అలాంటిదేమీ లేదని ఓ ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. నిజానికి యూపీఐ సిస్టమ్ పరిచయం చేస్తున్నప్పుడే ఈ చార్జీల విధింపు నిర్ణయాన్ని తీసుకున్నట్టు ఆయన తెలిపారు. ఈ చార్జీలతో యూపీఐ స్వయం సుస్థిరమవుతుందన్నారు.
సుప్రీంలో పిల్ దాఖలు
నిర్ణీత పర్సన్-టు-మర్చంట్ లావాదేవీలపై ఎండీఆర్‌ను విధిస్తూ మోదీ సర్కార్ తీసుకున్న నిర్ణయంపై సుప్రీం కోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. పారదర్శకత లేదా ప్రజాభిప్రాయం లేకుండానే, సరైన భద్రతా ప్రమాణాలను పాటించకుండానే ఈ చార్జీలను ప్రకటించారని పిటిషన్లో పేర్కొన్నారు. ఈ క్రమంలోనే పేమెంట్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్స్ యాక్ట్ 2007లోని సెక్షన్ 10ఏ సవరణకున్న రాజ్యాంగ చెల్లుబాటును పిటిషనర్ సవాల్ చేశారు. దీనిపై ఆర్బీఐ, కేంద్ర ప్రభుత్వ స్వతంత్ర సమీక్షనూ కోరారు.
పేమెంట్ యాప్స్‌కే లాభం : జీటీఆర్ఐ
ఎండీఆర్ చార్జీలతో చిరు వ్యాపారులు, సామాన్య వినియోగదారులు యూపీఐ లావాదేవీలకు దూరం జరిగి మళ్లీ నగదు చెల్లింపులకే మొగ్గు చూపుతారని గ్లోబల్ ట్రేడ్ రిసెర్చ్ ఇనీషియేటివ్ (జీటీఆర్ఐ) వ్యవస్థాపకుడు అజయ్ శ్రీవాత్సవ అభిప్రాయపడ్డారు. ఈ నిర్ణయం గూగుల్ పే, ఫోన్‌పేలకు లాభించగలదన్నారు. నిజానికి భారతీయ వ్యాపారులు, వినియోగదారులపై చార్జీలు విధించడానికి బదులు విదేశీ పేమెంట్ యాప్సే భాగస్వామ్య ఫీజు చెల్లించాలన్నారు. ఆహార, ఎరువులు, వ్యవసాయ రుణాలు, ఇంధన రాయితీలకు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్న కేంద్రంపై యూపీఐ లావాదేవీలను ఉచితంగానే ఉంచడం వల్ల పడే భారం చాలా చిన్నదని గుర్తుచేశారు. మొత్తానికి అమెరికా ఒత్తిళ్ల మధ్య కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నదన్న ఆరోపణల నేపథ్యంలో శ్రీవాత్సవ వ్యాఖ్యలు మిక్కిలి ప్రాధాన్యాన్ని సంతరించుకుంటున్నాయిప్పుడు.