హైదరాబాద్, సెప్టెంబర్ 16 (నమస్తే తెలంగాణ) : శాసనసభ వేదికగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తమ పై నిరాధారమైన, సత్యదూరమైన ఆరోపణలు చేశారంటూ మాజీ మంత్రి, బీఆర్ఎస్ఎల్పీ ఉపనేత టీ హరీశ్‌రావు, ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి సభా హకుల ఉల్లంఘన కింద నోటీసులు ఇచ్చారు. తమ నోటీసులను బుధవారం స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్‌కు వాట్సాప్, ఈ-మెయిల్ ద్వారా పంపించారు. ఈ నెల 12న అసెంబ్లీలో నిషేధిత భూముల (సెక్షన్ 22ఏ) అంశంపై జరిగిన స్వల్పకాలిక చర్చ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడిన తీరు తీవ్ర అభ్యంతరకరంగా ఉన్నదని బీఆర్ఎస్ నేతలు పేరొన్నారు. ప్రతిపక్ష సభ్యులు సభలో లేని సమయాన్ని ఆసరాగా చేసుకొని, ఏకపక్షంగా తమ వ్యక్తిగత ప్రతిష్టను దిగజార్చేలా అసత్య ప్రచారాలు చేశారని వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలిద్దరూ ఎన్నికల సంఘానికి సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లను ప్రస్తావించారు. తాము చట్టబద్ధంగా ఎన్నికల కమిషన్‌కు సమర్పించిన అఫిడవిట్లలో తమ ఆస్తులు, కుటుంబసభ్యుల వివరాలను పారదర్శకంగా వెల్లడించామని తెలిపారు. బహిరంగంగా అందుబాటులో ఉన్న అఫిడవిట్‌లోని వాస్తవాలను దాచిపెట్టి, అవాస్తవాలు ప్రచారం చేశారని వారు ఆరోపించారు.
తన మామ భూమి వ్యవహారంపై మంత్రి చేసిన వ్యాఖ్యలు పూర్తిగా కల్పితమని హరీశ్‌రావు పేర్కొన్నారు. ఆయన ఒక రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగి అని, 1995లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కేటాయించిన భూమికి 2010లో ఎన్వోసీ లభించగా, చట్టబద్ధంగా బ్యాంక్ చెకుల ద్వారానే కొనుగోలు చేశారని తెలిపారు. ప్రభుత్వ రికార్డుల్లో స్పష్టమైన ఆధారాలు ఉన్నప్పటికీ, రూ.15 కోట్ల విలువైన భూమి అంటూ సభను తప్పుదోవ పట్టించారని మండిపడ్డారు.
ధరణి పోర్టల్‌ను అడ్డం పెట్టుకొని భూదాన్ భూములను అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారంటూ మంత్రి చేసిన ఆరోపణలను మరోవైపు జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఖండించారు. తన విద్యాసంస్థల భూములకు సంబంధించి ఎన్నికల అఫిడవిట్లో సైతం పూర్తి వివరాలను పేరొన్నామని, ఎకడా ఎలాంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలు జరుగలేదని స్పష్టంచేశారు. మంత్రి అసెంబ్లీ నిబంధనలను తుంగలో తొకి, సభలో లేని వ్యక్తుల గురించి, ఎలాంటి ప్రాథమిక ఆధారాలు లేని అంశాలను సభా రికార్డుల్లోకి ఎకించడం శాసనసభ గౌరవానికే మాయని మచ్చని వారు పేరొన్నారు.
రాష్ట్రంలో 22ఏ నిషేధిత భూముల జాబితా కారణంగా ఎదురవుతున్న తీవ్ర ఇబ్బందుల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే మంత్రి పొంగులేటి తమపై బురదజల్లుడు రాజకీయాలకు పాల్పడ్డారని హరీశ్‌రావు, పల్లా విమర్శించారు. పాలనాపరమైన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి సభను రాజకీయ వేదికగా వాడుకున్నారని ధ్వజమెత్తారు. సభా మర్యాదలు, హకులను ఉల్లంఘించిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై తక్షణమే సభాహక్కుల ఉల్లంఘన కింద కఠిన చర్యలు తీసుకోవాలని స్పీకర్‌ను కోరారు. మంత్రి వ్యాఖ్యలను తొలగించాలన్నారు.