హైదరాబాద్, సెప్టెంబర్ 16 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ భూమిలో ఒక గజం లేదా ఎకరం కోసం ఆలోచించే వ్యక్తి కేసీఆర్ కాదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు స్పష్టంచేశారు. తెలంగాణ ఉద్యమం కోసం ప్రాణాలను సైతం పణంగా పెట్టిన కేసీఆర్‌పై అసైన్డ్ భూముల పేరుతో ఈ తరహా ఆరోపణలు చేయడం సరికాదని మండిపడ్డారు. నిన్నటివరకు బహిరంగ సభల్లో వెయ్యి ఎకరాల ఫామ్‌హౌస్ అంటూ ఆరోపణలు చేసిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. ఇవాళ అసెంబ్లీలో 67 ఎకరాలు అంటున్నారని ఎద్దేవా చేశారు.
ఆరోపణల్లో ఇంత తేడా ఎందుకు వచ్చిందో ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు. పదేండ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్‌కు హైదరాబాద్‌లో సరిపడా సొంత ఇల్లు కూడా లేదని చెప్పారు. ధరణి పేరుతో కేసీఆర్‌పై, కేటీఆర్‌పై, తనపై, బీఆర్ఎస్ నేతలపై బురదజల్లే ప్రయత్నం మానుకోవాలని హెచ్చరించారు. రేవంత్‌రెడ్డి కుటుంబానికి 308 ఎకరాలు ఉన్నట్టు గంటలోపే ప్రజలు సమాచారం ఇచ్చారని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా ఇంకెన్ని ఎకరాలు, ఫ్యూచర్‌సిటీ చుట్టూ వందల ఎకరాలు బయటపడ్తయోనని అనుమానం వ్యక్తంచేశారు. తమ ప్రభుత్వ హయాంలో జరిగిన ధరణి, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో వచ్చిన భూభారతిపై, అనుముల కుటుంబ ఆస్తులు, తమ ఆస్తులపై సిట్టింగ్ జడ్జితో విచారణకు సిద్ధమా? అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి హరీశ్‌రావు సవాల్ విసిరారు.
నాడు వెయ్యి ఎకరాలు.. నేడు 67 ఎకరాలు అయ్యాయా?
కేసీఆర్ వ్యక్తిగత ఆస్తులపై సీఎం రేవంత్‌రెడ్డి చేసిన ఆరోపణలపై హరీశ్‌రావు తీవ్రంగా స్పందించారు. ‘కేసీఆర్ మీద ఆరోపణలు చేశారు. కేసీఆర్ వ్యక్తిత్వం ఏమిటి? ఆయనది ఒక గజం కోసమో, ఎకరం ప్రభుత్వ భూమి కోసమో ఆలోచిం చే వ్యక్తిత్వమా? తెలంగాణ కోసం ప్రాణా న్ని పణంగా పెట్టిన వ్యక్తిత్వం ఆయనది. తెలంగాణ కోసం, తెలంగాణ ప్రజల కోసం చావు అంచుల దాకా వెళ్లిన వ్యక్తి త్వం ఆయనది? అలాంటి వ్యక్తిని పట్టుకొని ఈ రకంగా మాట్లాడొచ్చా? నిన్నటిదాకా వె య్యి ఎకరాల ఫామ్‌హౌస్ అని పబ్లిక్ మీటింగుల్లో మాట్లాడినవ్. ఇవాళ 67 ఎకరాలు అంటవ్. నీ ఆరోపణలు ప్రజలు అర్ధకావడం లేదనుకుంటున్నవా?’ అని ప్రశ్నించారు. కేసీఆర్‌కు అసైన్డ్ భూములు ఉన్నాయన్న ఆరోపణలపై ఆధారాలు చూపాలని డిమాండ్ చేశారు.
కేసీఆర్‌కు సరైన ఇల్లు కూడా లేదు
పదేండ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్‌కు నిజంగా ఈ రోజు హైదరాబాద్‌లో ఉండటానికి ఇల్లు లేదని హరీశ్‌రావు పేర్కొన్నారు. ‘తెలంగాణ ఉద్యమ కాలంలో కేసీఆర్ కట్టుకున్న చిన్న ఇల్లు తప్ప.. నీలాగా జూబ్లీహిల్స్ ప్యాలెస్ ఉన్నదా? పదేండ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్‌కు కారు పార్కింగ్‌కు, ఆయన స్టాఫ్ ఉండటానికి సరిపోయే ఇల్లు కూడా లేనటువంటి పరిస్థితి. ఆయన వ్యవసాయ క్షేత్రంలో వ్యవసాయం చేసుకుంటున్నరు. వందల ఎకరాల వ్యవసాయ భూములు ఉన్న కుటుంబంలో కేసీఆర్ పుట్టారు. చింతమడకకు వెళ్లి అడిగితే ఎవరైనా చెప్తారు. ఆయన వ్యవసాయ క్షేత్రంలో ఉంటే దాని మీద కూడా బురదజల్లారు. అసైన్డ్భూములు ఉన్నయి అంటరు. అసలు కేసీఆర్‌కు ఒక గజమైన అవసరమా? ఆయన వ్యక్తిత్వం ఏమిటి? అలాంటి వ్యక్తి మీద కూడా ఇలాంటి ఆరోపణలా?’ అని హరీశ్ ప్రశ్నించారు.
నవీన్‌రావుకు కేసీఆర్‌తో బంధుత్వమే లేదు
కేసీఆర్ కుటుంబంతో సంబంధం ఉన్న భూములపై వస్తున్న ఆరోపణలను ప్రస్తావిస్తూ.. ఎమ్మెల్సీ నవీన్‌రావు భూములను కూడా కేసీఆర్ కుటుంబానికి చెందినవిగా చూపించేందుకు ప్రయత్నిస్తున్నారని హరీశ్‌రావు విమర్శించారు. ఒకే సామాజిక వర్గానికి చెందినంత మాత్రాన ఎమ్మెల్సీ నవీన్‌రావు భూములను కేసీఆర్ కుటుంబ ఆస్తులుగా చూపడం సరికాదని హితవు పలికారు. ఎమ్మెల్సీ నవీన్‌రావుతో కేసీఆర్‌కు ఎలాంటి బంధుత్వం లేదు. వెలమ అయినంత మాత్రాన ఆయన భూములు తీసుకొచ్చి కేసీఆర్ కుటుంబం భూములని ఆయన ఖాతాలో వేస్తవా? బ్లడ్ రిలేషన్ కూడా లేదు. ఇవన్నీ ఆయన భూములు అని చెప్తున్నవ్. కేసీఆర్‌కు 430 ఎకరాల భూములు ఉన్నాయని ఎలా అంటావ్?’ అని ప్రశ్నించారు.