హైదరాబాద్, సెప్టెంబర్ 16 (నమస్తే తెలంగాణ) : చట్టం ముందు అందరూ సమానమే అనే రాజ్యాంగ ప్రాథమిక సూత్రం శాసనసభ సాక్షిగా తీవ్ర పరిహాసానికి గురైంది. ప్రజా సమస్యలపై చర్చించి, ప్రజల హకులను కాపాడాల్సిన అత్యున్నత చట్టసభ వేదికపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రజాస్వామ్యవాదులను విస్మయానికి గురిచేస్తున్నాయి. ‘నిషేధిత జాబితాలో ముఖ్యమంత్రి ఆస్తిని మంత్రి పెడుతారా అధ్యక్షా? నా ఆస్తి మీదికే వస్తే మంత్రి కొనసాగుతాడా అధ్యక్షా?’ అంటూ ముఖ్యమంత్రి స్వయంగా ప్రశ్నించడం సభా సంప్రదాయాలకే విరుద్ధమని రాజ్యాంగ నిపుణులు ఆక్షేపిస్తున్నారు. హైడ్రా సాయంతో ఎఫ్టీఎల్, బఫర్జోన్ల పేరిట నగరంలో సామాన్యుల నిర్మాణాలను క్షణాల్లో కూల్చివేస్తున్న సరార్ తీరుకు, ముఖ్యమంత్రి స్వయంగా చేసిన వ్యాఖ్యలకు పొంతనే లేకుండాపోయింది. రక్తం ధారపోసి, జీవితాంతం కూడబెట్టిన సొమ్ముతో ఇండ్లు నిర్మించుకున్న పేద, మధ్యతరగతి ప్రజల గోడు పట్టించుకోకుండా బుల్డోజర్లను ప్రయోగిస్తున్న పాలకులు..
తమ సొంత ఆస్తుల దగ్గరికి వచ్చేసరికి చట్టాలను తమ ఆధీనంలోకి తీసుకొనే ప్రయ త్నం చేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పేదల గుడిసెల మీద చట్టం యథేచ్ఛగా తన ప్రతాపాన్ని చూపుతుంది కానీ, ముఖ్యమంత్రి భవంతి వైపు కన్నెత్తి చూస్తే మాత్రం మంత్రుల కుర్చీలకే ముప్పు వస్తుందనడం పచ్చి ద్వంద్వ వైఖరికి నిదర్శనం అంటున్నారు. రాజ్యాంగబద్ధ వ్యవస్థలో నిబంధనల ప్రకారం నడుచుకోవాల్సిన సీఎం తన సొంత మంత్రివర్గ సహచరుడిపైనే శాసనసభ సాక్షిగా ఈ తరహా హెచ్చరికలు చేయడం ఆయన నియంతృత్వ పోకడలకు అద్దం పడుతున్నదని అంటున్నారు. తన ఆస్తి రక్షణ కోసం తోటి మంత్రుల పదవులను పణంగా పెట్టేలా మాట్లాడటం ప్రజాస్వామ్య స్ఫూర్తికే గొడ్డలిపెట్టు. చట్టాలు సామాన్యుడిని బలిపీఠం ఎకించడానికి, పాలకుల ఆస్తులను కాపాడటానికి మాత్రమే పనిచేస్తాయా అన్న ఆగ్రహం ప్రజల్లో వ్యక్తమవుతున్నది. తమ ఆస్తులు ప్రశ్నించరానివని, తాము వ్యవస్థలన్నింటికీ అతీతులమని భావించే ఏ పాలకులకైనా ప్రజాక్షేత్రంలో తిరసారం తప్పదని రాజకీయవేత్తలు అంటున్నారు.