హైదరాబాద్, సెప్టెంబర్ 16 (నమస్తే తెలంగాణ) : భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తున్న భారత్ ఫ్యూచర్ సిటీలో పెట్టుబడులు పెట్టేలా సింగపూర్ కంపెనీలను ప్రోత్సహించాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆ దేశ ప్రతినిధుల బృందాన్ని కోరారు. సెమీకండక్టర్ రంగంలో సింగపూర్‌కు ఉన్న సాంకేతిక, పారిశ్రామిక అనుభవాన్ని తెలంగాణతో అనుసంధానించి.. రాష్ట్రంలో ఫ్యాబ్ పరిశ్రమలతో పాటు అనుబంధ పరిశ్రమలు, సరఫరా వ్యవస్థను అభివృద్ధి చేసేలా చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు.
సింగపూర్ వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖకు చెందిన ఎనర్జీ అండ్ ట్రేడ్ శాశ్వత కార్యదర్శి ఆగస్టిన్ లీ నేతృత్వంలోని ఆ దేశ ఉన్నతస్థాయి ప్రతినిధుల బృందం బుధవారం సచివాలయంలో శ్రీధర్ బాబుతో సమావేశమైంది. అంతర్జాతీయ భాగస్వామ్యాల ద్వారా తెలంగాణను ‘గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ హబ్’గా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున తీసుకుంటున్న చర్యలను మంత్రి వివరించారు. హై వాల్యూ ఇండస్ట్రీస్, పరిశోధన, టెక్నాలజీ ఆధారిత పరిశ్రమలకు అవసరమైన ఎకోసిస్టమ్‌ను రాష్ట్రంలో అభివృద్ధి చేసేందుకు ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్నామన్నారు.
ఐటీ/ఐటీఈఎస్, ఎమర్జింగ్ టెక్నాలజీస్, సెమీకండక్టర్లు, ఎలక్ట్రానిక్స్, అడ్వాన్స్డ్ మాన్యుఫ్యాక్చరింగ్, లైఫ్ సైన్సెస్, బయోటెక్నాలజీ, ఏరోస్పేస్, గ్రీన్ టెక్నాలజీ, రెన్యూవబుల్ ఎనర్జీ, లాజిస్టిక్స్, అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఆర్ అండ్ డీ, సిల్ డెవలప్మెంట్, ఇన్నోవేషన్ తదితర రంగాల్లో తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు సింగపూర్ కంపెనీలకు విస్తృత అవకాశాలున్నాయన్నాయని పేరొన్నారు.
రాష్ట్రంలో సెమీ కండక్టర్ల పరిశ్రమ ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నట్టు సింగపూర్ ప్రతినిధులు తెలిపారు. ఈ మేరకు బుధవారం అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సింగపూర్ వాణిజ్య-పరిశ్రమల మంత్రిత్వ శాఖకు చెందిన ఇంధన వాణిజ్య విభాగం శాశ్వత కార్యదర్శి అగస్టిన్ లీ సహా ఇతర ప్రతినిధులు భేటీ అయ్యారు. మూసీ పునరుజ్జీవం, ఫ్యూచర్ సిటీ అభివృద్ధి అంశాలను సింగపూర్ ప్రతినిధులకు సీఎం వివరించారు.