CEC Gyanesh Kumar : ఎన్నికల సంఘం పనితీరుపై ప్రతిపక్ష ఇండియా బ్లాక్ కూటమి పార్టీలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నికల సంఘం ప్రధానాధికారి (సీఈసీ)గా ఉన్న జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. వరుసగా ఆందోళన చేపడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం కీలక ప్రకటన చేసింది. ప్రతిపక్షాల్ని కలిసేందుకు సిద్ధమే అని ఎన్నికల సంఘం ప్రకటించింది.
తమ డిమాండ్లతో ఇటీవల ఇండియా బ్లాక్ ఎంపీలు ఆందోళన చేశారు. ఎన్నికల సంఘం ప్రధాన కార్యాలయానికి వెళ్లి.. ఎన్నికల సంఘం అధికారులను కలవాలని వారు ప్రయత్నిస్తున్నారు. మంగళవారం నాడు పార్లమెంట్ నుంచి ఈసీ కార్యాలయం వరకు ప్రతిపక్ష నేతలు ర్యాలీ నిర్వహించగా.. పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఈ అంశం ఇంకా వివాదాస్పదంగా మారింది. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు స్పందించారు. ఏ పార్టీకి చెందిన ప్రతినిధిని అయినా కలిసేందుకు తాము సిద్ధమే అన్నారు. గతంలో కూడా తమను పలు పార్టీల నేతలు కలిశారని గుర్తు చేశారు.
నిబంధనలకు అనుగుణంగా, ఒక పద్ధతి ప్రకారం తమను కలిశారని గుర్తు చేశారు. ఇప్పుడు కూడా అదే పద్ధతిలో కలిస్తే తాము సిద్ధమేనని ఈసీ ప్రకటించింది. ఇప్పటివరకు తమను కలిసేందుకు ఏ పార్టీ అనుమతి కోరలేదని వెల్లడించారు. అలాగే, ఏ పార్టీకి అపాయింట్మెంట్ ఇవ్వలేదన్నారు. అయినప్పటికీ ఏ పార్టీ వారినైనా కలుస్తామని, వారి ఆందోళనల్ని పరిగణనలోకి తీసుకుంటామని చెప్పారు. మరోవైపు మంగళవారం ఆందోళన చేసిన రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ సహా అనేకమంది నేతలపై ఢిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.