లక్నో: గురుకుల పాఠశాలకు చెందిన ఐదుగురు విద్యార్థులు నీటి ట్యాంక్ శుభ్రం చేస్తుండగా విషవాయువులు పీల్చి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారిలో నలుగురు నీటి ట్యాంక్ లోపల మరణించారు. ఒక విద్యార్థి ప్రాణాలతో బయటపడ్డాడు. పోలీసులు ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. (Students Die Of Toxic Gas) ఉత్తరప్రదేశ్‌లోని మథుర జిల్లాలో ఈ సంఘటన జరిగింది. బృందావన్‌లోని చైతన్య విహార్ ప్రాంతంలో నిర్వహిస్తున్న ఒక గురుకులంలోని నీటి ట్యాంక్ నుంచి దుర్వాసన వస్తున్నది. దీంతో దానిని శుభ్రం చేసేందుకు కొందరు విద్యార్థులు ప్రయత్నించారు. సుమారు 12 అడుగుల లోతున్న ఆ ట్యాంక్‌లోని నీటిని మోటార్‌తో బయటకు తోడారు. ఆ తర్వాత తొలుత ఒక విద్యార్థి నీటి ట్యాంక్‌లోకి దిగాడు. అతడు బయటకు రాకపోవడంతో మరో నలుగురు విద్యార్థులు అందులోకి వెళ్లారు.
కాగా, వారు కూడా బయటకు రాకపోవడంతో అక్కడున్న మిగతా విద్యార్థులు ఆందోళన చెందారు. వాటర్ ట్యాంక్‌లోకి దిగిన ఐదుగురు విద్యార్థులను బయటకు తీశారు. విష వాయువులు పీల్చి తీవ్ర అస్వస్థతకు గురైన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే నలుగురు విద్యార్థులు మరణించినట్లు డాక్టర్లు నిర్ధారించారు. మరో విద్యార్థికి చికిత్స అందిస్తున్నారు.
మరోవైపు ఈ సమాచారం తెలుసుకున్న జిల్లా కలెక్టర్, పోలీస్ అధికారులు ఆ గురుకుల పాఠశాలకు చేరుకున్నారు. మరణించిన విద్యార్థులను మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్కు చెందిన 20 ఏళ్ల మను కటారే, మధ్యప్రదేశ్‌లోని విదిశకు చెందిన 17 ఏళ్ల దేవాన్ష్ శర్మ, ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌కు చెందిన 17 ఏళ్ల ఆర్యన్ పాండే, మీరట్‌కు చెందిన 18 ఏళ్ల విషు శర్మగా గుర్తించారు.
నలుగురు విద్యార్థుల మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి పోలీసులు తరలించారు. వారి కుటుంబాలకు ఈ సమాచారం అందించారు. ఈ సంఘటనతో పాటు ఆ గురుకులం నిర్వహణపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ అధికారి తెలిపారు. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా ఈ సంఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు.