సిటీబ్యూరో, సెప్టెంబర్ 16 (నమస్తే తెలంగాణ): రాజేంద్రనగర్ జోన్‌లోని శంషాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి తన ఇంటిని 2018లో రిజిస్టర్డ్ సేల్‌డీడ్ ద్వారా కొనుగోలు చేశారు. కొనుగోలు చేసిన నాటి నుంచి తానే ఆస్తిని స్వాధీనంలో ఉంచుకుని వినియోగిస్తున్నట్లు తెలిపారు. ఆ తర్వాత ఒక రౌడీషీటర్ స్థానిక పోలీసుల సహకారంతో తన ఆస్తిని ఆక్రమించే ప్రయత్నం చేస్తున్నారంటూ బాధితుడు సీపీ సజ్జనార్‌కు ఫిర్యాదు చేశారు. తనపై తప్పుడు ఫిర్యాదు చేయించి ఆ కేసులో ఇరికించిన తర్వాత అదే డివిజన్ పరిధిలో ఉన్న ఒక ప్రాంతంలోని తన వ్యాపార కేంద్రం నుంచి అరెస్టు చేసిన పోలీసులు ఆ ఏసీపీ కార్యాలయానికి తీసుకెళ్లారు.
అక్కడ రాత్రంతా లాకప్‌లోనే ఉంచి తన సంతకాలు, వేలిముద్రలు తీసుకుని టైప్ చేసిన కొన్ని బాండ్ పేపర్లతో పాటు ఖాళీ బాండ్‌పేపర్లు, ఖాళీ పేపర్లపై బలవంతంగా సంతకాలు, వేలిముద్రలు తీసుకున్నారని బాధితుడు ఆరోపించారు. తనకు జరిగిన అన్యాయంపై ఈనెల 4న సీపీకి పోస్టు ద్వారా తన ఫిర్యాదును పంపించానని, తిరిగి కమిషనర్ సజ్జనార్ రెండు రోజుల కిందట బాలాపూర్‌లో వినాయక ఉత్సవ ఏర్పాట్లను పరిశీలించే సమయంలో కూడా మరోసారి ఏసీపీ, ఎస్ఐలపై లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసినట్లు బాధితుడు తెలిపారు. వారం రోజుల కిందట పాతబస్తీలోని ఒక ప్రాంతంలో చెట్లమందులు ఇచ్చేవారి దగ్గర కొంత గంజాయి పోలీసులకు దొరికింది.
ఆ గంజాయిని పట్టుకున్న తర్వాత అతనిపై కేసు పెట్టకుండా ఉండాలంటే సార్‌తో మాట్లాడాలంటూ.. ఆ సబ్ ఇన్స్పెక్టర్ అతనికి చెప్పారు. సార్ మొదట లైన్లోకి రాకపోయి కొంత బెట్టు చేసిన తర్వాత చివరకు ఎస్ఐ కొంత బతిలాడినట్లు నటించడంతో సరే ఏదో ఒకటి కానియ్యమను అని చెప్పారు. దీంతో సార్ ఐదు అడిగారంటే ఆ వ్యక్తి తాను అంత ఇచ్చుకోలేనని చెప్పడంతో చివరకు రెండు లక్షలకు సెటిల్మెంట్ చేసి ఎలాంటి కేసు లేకుండా వదిలేసినట్లు ఆ స్టేషన్లోనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇలా ఒకటి కాదు రెండు కాదు.. ఆ డివిజన్లో జరిగే ప్రతీ వ్యవహారంలో డివిజన్ పెద్ద సార్‌దే కీలక పాత్ర. తన డివిజన్లో ఉన్న అన్ని పోలీసు స్టేషన్లలో తాను చెప్పిందే నడవాలని స్టేషన్ అధికారులను ఆదేశించారు.
తనకు చెప్పకుండా ఆయా స్టేషన్ అధికారులు పిటీ కేసు కూడా పెట్టకూడదంటూ వారికి ఆంక్షలు పెట్టారు. స్టేషన్‌కు వచ్చే భూ పంచాయతీలన్నీ తన వద్దకు తీసుకొని వచ్చేలా ఆ స్టేషన్లలో పనిచేసే కొందరు ఎస్ఐలను పురమాయించి వారి ద్వారా మొత్తం లావాదేవీలు నడిపిస్తున్నారు. ఎస్ఐలతో పాటు స్థానిక రౌడీషీటర్లు తెచ్చే పంచాయితీలకు ఒక రేటు కట్టి వాటా ల రూపంలో డబ్బులు తీసుకుంటూ..సెటిల్మెంట్లు చేస్తున్నారంటూ.. ఆ అధికారిపై తీవ్ర ఆరోపణలున్నా యి. పాతబస్తీలోని రాజేంద్రనగర్ జోన్లో ఉన్న ఈ డివిజన్ అధికారి నాలుగు పోలీస్స్టేషన్లను పర్యవేక్షిస్తున్నారు.
ఈ పోలీసు స్టేషన్లలో నిరంతరం ఏదో ఒక భూ పంచాయితీ, సివిల్ తగాదాలే ఎక్కువగా రావడంతో వాటిని సెటిల్ చేయడానికి ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ కల్పించుకుంటూ తనకు అనుకూలమైన పోలీసులు, రౌడీషీటర్లను ఉపయోగిస్తూ లక్షల రూపాయలు దోచుకుంటున్నారంటూ ఆ డివిజన్‌లోనే చర్చ జరుగుతోంది.భూమి కేసులు వచ్చాయంటే చాలు.. ఆ భూమి ప్రస్తుతం మార్కెట్ రేటులో పర్సంటేజ్ మాట్లాడుకొని అందుకు తగినట్లుగా ఆక్రమణదారులతో కుమ్మక్కై అమాయకులను వేధిస్తున్నారని కమిషనరేట్‌లో ఈ అధికారిపై చాలా ఫిర్యాదులు ఉన్నాయి. తనపై ఎన్ని ఆరోపణలు వచ్చినా తన బాస్ అండ ఉండగా తనను ఎవరూ ఏమీ చేయలేరంటూ యథేచ్ఛగా దందాలు చేసుకుంటున్నారనిపోలీసులు మాట్లాడుకుంటున్నారు.
బాస్‌కు నచ్చి మెచ్చిన ప్రధాన అనుచరుల్లో ఒకరుగా ఆ డివిజన్ అధికారి తన ఏరియాలో వ్యవహరిస్తున్న తీరు మొత్తం కమిషనరేట్‌లోని అధికారులతో పాటు జోన్‌లోని ప్రధాన అధికారులకు తలనొప్పిగా మారినా అతన్ని ఏమీ అనలేకపోతున్నారంటూ పోలీసులు చెవులుకొరుక్కుంటున్నారు. ఆ అధికారి తన గ్యాంగ్‌లో ఒక సీసీఎస్ కానిస్టేబుల్, ఒక టాస్క్‌ఫోర్స్ కానిస్టేబుల్‌ను పెట్టుకుని వారు తన డివిజన్‌కు సంబంధం లేకపోయినా.. వారి ద్వారా పెద్దపెద్ద పంచాయితీలు చేస్తూ లక్షలకు లక్షలు దోపిడీ చేస్తున్నారని రాజేంద్రనగర్ జోన్లో చెప్పుకొంటున్నారు.
సిక్‌లీవ్‌లో వెళ్లే యోచనలో అధికారులు!
ఈ డివిజన్ అధికారి అరాచకాలు భరించలేక నెల రోజుల కిందట ఆ డివిజన్లోని ఒక పోలీసు స్టేషన్లో పనిచేస్తున్న ఓ మహిళా సబ్ ఇన్స్పెక్టర్ సెలవు పెట్టి వెళ్లారు. ఆమె తాను ఈ అక్రమాలకు సాక్ష్యంగా ఉండలేనంటూ.. తన సహచర ఉద్యోగులతో చెప్పడంతో వారు ఆ అధికారికి విషయం చెప్పారు. దీంతో డివిజన్ అధికారి మహిళా ఎస్సైను పిలిచి లీవ్ క్యాన్సిల్ చేసుకుని పని చేసుకోవాలని చెప్పడంతో పాటు తన వ్యవహారాల్లో మరోసారి ఆమెకు సంబంధం లేకుండా చూస్తానని హామీ ఇవ్వడంతో వెనక్కి తిరిగి వచ్చినట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే ఇదే డివిజన్లో రెండు పోలీస్స్టేషన్ల ఇన్స్పెక్టర్లు తాము సిక్‌లీవ్‌లో వెళ్లడానికి సిద్ధమైనట్లు సమాచారం. డివిజన్ అధికారి తమకు తెలియకుండా తమ పోలీస్స్టేషన్లలో ఎస్సైల ద్వారా లావాదేవీలు చేయడంతో పాటు స్టేషన్‌కు వెళ్లి ఏదైనా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్‌పై మాట్లాడుదామన్నా వెంటనే ఫోన్ చేసి మీరు ఎందుకు అలా మాట్లాడుతున్నారంటూ వేధిస్తున్నారని తమ సన్నిహితులతో చర్చించినట్లు తెలిసింది.
అంతేకాకుండా డివిజన్ అధికారిపై స్థానిక జోన్ అధికారికి చెప్పినా ఆయన బాస్ మనిషి.. ఆయన ఏం చెబితే అది చేయండంటూ చెప్పడంతో ఆ ఇద్దరు అధికారులు ఉద్యోగం చేయలేమంటూ చేతులెత్తేసినట్లు తెలిసింది. మొత్తం నాలుగు పోలీసుస్టేషన్లలోనూ అధికారుల పరిస్థితి ఇలాగే ఉన్నా.. మిగతా రెండు చోట్ల ఎలాగోలా సర్దుకుపోతున్నారు. కానీ ఈ రెండు స్టేషన్ల పరిధిలో ఎక్కువగా భూ పంచాయతీలు వస్తుండడంతో ఇన్స్పెక్టర్లను పూర్తిగా తీసేసినట్లుగా మాట్లాడి వారి ప్రమేయం లేకుండానే తమ స్టేషన్ల ఎస్సైల ద్వారా వ్యవహారాలు నడుపుతున్నారని తమ సన్నిహితులతో ఆ ఇద్దరు అధికారులు వాపోయినట్లు సమాచారం.