నగరంలోని కొన్ని ఆర్టీఏ కార్యాలయాల్లో కొందరు ఏఓలు ఆడిందే ఆట పాడిందే పాట అవుతున్నది. ఈ ఏడాదిలో ఆర్టీఏ కార్యాలయాల్లో మూడు సార్లు అవినీతి నిరోధక శాఖ ఆకస్మిక తనిఖీలు చేసి పలు కార్యాలయాల్లో జరిగిన అక్రమ కార్యకలాపాలను గుర్తించిన విషయం తెలిసిందే. అయితే ఈ దాడుల నేపథ్యంలో రవాణా శాఖ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ పలు కార్యాలయాలని సందర్శించి పారదర్శక సేవలపై దృష్టి పెట్టాలని సంబంధిత అధికారులకు ఆదేశాలిచ్చింది. ఎటువంటి బ్రోకర్లు కార్యాలయాల్లోకి ఎంట్రీ ఇచ్చినా అది సంబంధిత ఆర్టీఓదే బాధ్యత అని హెచ్చరించింది.
– సిటీబ్యూరో, సెప్టెంబర్ 16 (నమస్తే తెలంగాణ)
వంకలు.. వసూళ్లు!
ఆర్టీఏలో కొందరు ఏఓలు ఉన్నతాధికారుల ఆదేశాలను సైతం పట్టించుకోవడం లేదు. ఆర్టీఓలపై ఓ ఉద్యోగ సంఘంలో తమది కీలక రోల్ అంటూ ఒత్తిడి తీసుకొచ్చి అక్రమాలకు పాల్పడుతున్నారు. ఇటీవల ఇతర జిల్లా నుంచి హైదరాబాద్‌లోని ఓ జోన్‌కు బదిలీ అయిన ఓ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (ఏఓ) నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ఫైళ్లను క్లియర్ చేయడంలో కీలకపాత్ర వహిస్తున్నారు. ఆయన పరిధిలో అయ్యే ప్రతీ పనికి ఓ ధర నిర్ణయించి వసూళ్లకు పాల్పడుతున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. అ కార్యాలయ ఆర్టీఓ అలా చేయొద్దని వాదించినా వినిపించుకోకుండా సంఘం ముసుగులో బెదిరింపులకు పాల్పడటం ఆ కార్యాలయంలో తీవ్ర చర్చనీయాంశమైంది. అదే కార్యాలయంలో పలు అక్రమాలపై గతంలో పోలీస్ కేసులు నమోదయ్యాయి.
కొన్ని వాహనాలకు సంబంధించిన యజమానులు మరణిస్తే వాటిని పరిశీలించకుండానే అమ్యామ్యాలతో వాహన యాజమాన్య హక్కులు మార్చినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఆ విషయంపై సదరు కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అయితే ఆ ఏఓ.. ఏ కార్యాలయంలో విధులు నిర్వర్తించినా వాహనదారులకు సంబంధించిన ఫైళ్లను కాసులతోనే లెక్కిస్తాడని సిబ్బంది సైతం చర్చించుకుంటున్నారు. ఏడాదిలో అనేక సార్లు టూర్లు, విదేశీ ట్రిప్పుల పేరుతో సెలవుల్లో ఉంటూ వచ్చాక తాను నియమించుకున్న ప్రైవేటు సిబ్బందిని ఇన్ని రోజుల కలెక్షన్స్ ఏవని ఒత్తిడి తెస్తున్నట్టు ఆరోపణలున్నాయి. ఆర్టీఏ కార్యాలయాల్లో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పాత్ర చాలా కీలకమైనది. కార్యాలయంలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు క్షేత్రస్థాయి పరిశీలనలు, డ్రైవింగ్ పరీక్షలు చుసుకుంటే, కార్యాలయ అంతర్గత పరిపాలన, ఫైళ్ల నిర్వహణ, సిబ్బంది పర్యవేక్షణ అంతా ఏఓ పరిధిలోనే ఉంటుం ది.
ఏ సెక్షన్లో ఏ ఫైల్ ఆగిపోయింది? ఏ అప్లికేషన్లు పెండింగ్‌లో ఉన్నాయి? వాటిని ఆయనే పరిశీలిస్తారు. వాహన రిజిస్ట్రేషన్లు, లైసెన్సుల జారీ, పర్మిట్లు వంటి విభాగానికి సంబంధించిన రికార్డులను భద్రపరచడం వంటి కార్యకలాపాలకు ఏఓ అధికారులే జవాబుదారిగా ఉండాల్సి ఉంటుంది. వాహనాల రిజిస్ట్రేషన్ ఫీజులు, లైఫ్‌టాక్స్, చలానాలు ఇతర జరిమానాల రూపంలో వచ్చే ప్రభుత్వ ఆదాయాన్ని, లెక్కలను ఏఓనే పర్యవేక్షిస్తారు. రోజువారీ వసూలైన నగదు సక్రమంగా ప్రభుత్వ ఖాతాకు జమ అవుతుందో లేదో అకౌంట్స్ విభాగంతో ఆయన పర్యవేక్షించాల్సి ఉంటుంది. ఈ మొత్తం అంశాలన్నింటినీ ఆర్టీఓలకు నివేదికలు ఇవ్వాల్సి ఉంటుం ది. కార్యాలయాలకు సంబంధించిన ప్రగతి నివేదికలు, కోర్టు కేసుల వివరాలు, ప్రభుత్వానికి పంపాల్సిన నివేదికను సమయానికి ఆర్టీఓ ఆమోదానికి పంపాల్సి ఉంటుంది. ఇంతటి కీలకమైన బాధ్యతల్లో ఉన్న ఆ అధికారులు ఆర్టీఓలను సైతం పక్కదారి పట్టిస్తూ తమ చేతివాటం చూపిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి.
నిబంధనలకు విరుద్ధంగా సీసీలు జారీ
సీసీలు, ఎన్ఓసీలు జారీ చేయడం, వాటిని రద్దు చేయడంలో వేల రూపాయలు డిమాండ్ చేస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. ఆర్సీలు లేని వాహనాలను ఇతర వ్యక్తుల పేర్లపైకి మార్చడంలో వేలాది రూపాయలు దండుకుంటున్నారు. రెండేండ్ల కిందట ఓ వాహనదారుడు సదరు కార్యాలయం నుంచి ఇతర రాష్ర్టానికి తీసుకున్న ఎన్ఓసీని ఇటీవల వెనక్కి తీసుకొచ్చాడు. అయితే ఆ ఎన్ఓసీని క్లియర్ చేయడం కోసం ప్రభుత్వం రుసుంతో పాటు అదనంగా డబ్బులు ముట్టజెబితేనే ఎన్ఓసీ క్లియర్ చేసినట్టు బాధితుడు వివరించాడు. సీసీ(క్లియరెన్స్ సర్టిఫికెట్) జారీ చేయడంలోనూ ఏఓలు నిబంధనలకు విరుద్ధంగా చక్రం తిప్పుతున్నారనే ఆరోపణలున్నాయి. రంగారెడ్డి, మేడ్చల్, హైదరాబాద్‌ల్లోని చాలా కార్యాలయాల్లో ఏఓలు పారదర్శక సేవలు అందిస్తున్నప్పటికీ కొందరి ఏఓల చేష్టలతో ఆర్టీఏకు చెడ్డపేరు వస్తుండటం గమనార్హం.