తెలంగాణలో టీ-హబ్, వీ-హబ్, టీ-వర్స్, టాస్ వంటి సంస్థలు మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడం, యువతకు ఉద్యోగ నైపుణ్యాలు కల్పించడంలో విప్లవాత్మక మార్పులు తెచ్చినయ్. ఇంక్యుబేషన్ దశ నుంచి స్వదేశీ రాకెట్లను ప్రయోగించే స్థాయికి ఎదిగిన ‘సైరూట్ ఏరోస్పేస్’ తెలంగాణ ఇన్నోవేషన్ వ్యవస్థ విజయానికి తిరుగులేని నిదర్శనం.
-కేటీఆర్
హైదరాబాద్, సెప్టెంబర్ 16 (నమస్తే తెలంగాణ) : రాబోయే 2028 తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో బీజేపీతో ఎలాంటి పొత్తు పెట్టుకోబోమని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టంచేశారు. హర్యానాలోని సోనిపట్‌లో ప్రఖ్యాత ఓపీ జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీలో బుధవారం ‘ఇన్నోవేషన్ ఇన్ గవర్నెన్స్: ది స్టోరీ ఆఫ్ ఏ స్టార్టప్ స్టేట్’ అనే అంశంపై కేటీఆర్ ప్రసంగించారు. ఈ సందర్భంగా విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు బదులిస్తూ.. ‘బీజేపీతో ఎలాంటి పొత్తు ఉండదు’ అని స్పష్టమైన ప్రకటన చేశారు. డీలిమిటేషన్‌పై అడిగిన మరో ప్రశ్నకు ఆయన బదులిస్తూ.. ప్రస్తుతం లోక్‌సభలో దక్షిణాది రాష్ట్రాలకు 24 శాతం ప్రాతినిధ్యం ఉందని గుర్తుచేశారు. దేశవ్యాప్తంగా లోక్‌సభ స్థానాల సంఖ్యను దామాషా ప్రకారం పెంచితేనే దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యానికి అన్యాయం జరుగదని పేరొన్నారు. ఆ దామాషా ప్రకారం సీట్ల పెంపు జరిగితే డీలిమిటేషన్ బిల్లుకు మద్దతు ఇవ్వడానికి బీఆర్ఎస్కు ఎలాంటి అభ్యంతరం ఉండదని తెలిపారు. అంతకుముందు తెలంగాణ ఆవిర్భావం నుంచి సాధించిన ప్రగతి, పాలనా సంసరణలు, వినూత్న ఆలోచనల అమలుపై ఆయన విసృ్తతంగా వివరించారు.
కృత్రిమ మేధస్సు (ఎఐ), సాంకేతిక మార్పులపై విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు కేటీఆర్ ఆసక్తికర సమాధానాలు ఇచ్చారు. గతంలో కంప్యూటర్లు, ఇంటర్నెట్ వచ్చినప్పుడు కూడా వ్యతిరేకత వచ్చిందని, ఇప్పుడు ఏఐ విషయంలోనూ అదే జరుగుతున్నదని అన్నారు. సాంకేతిక మార్పులను అడ్డుకోలేమని, ఏఐని సానుకూలంగా స్వీకరించి ముందుకు సాగాలని సూచించారు.
తెలంగాణ రాష్ట్రాన్ని ఒక స్టార్టప్ స్టేట్‌గా అభివర్ణించిన కేటీఆర్, అభివృద్ధి ప్రస్థానాన్ని ‘నిర్దిష్టత (సర్టెనిటి), అవకాశాలు (పాజిబులిటీ)’ అనే రెండు సిద్ధాంతాల ద్వారా వివరించారు. తెలంగాణలో స్టార్టప్ సంసృతిని బలోపేతం చేసేందుకు చేపట్టిన టీ-హబ్, వీ-హబ్, టీ-వర్స్, టాస్ వంటి సంస్థల పనితీరును కేటీఆర్ ప్రస్తావించారు. మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడం, ప్రోటోటైపింగ్, హార్డ్‌వేర్ నమూనాలు రూపొందించడం, యువతకు ఉద్యోగ నైపుణ్యాలు కల్పించడంలో ఇవి విప్లవాత్మక మార్పులు తెచ్చాయని చెప్పారు. సాధారణ ఇంక్యుబేషన్ దశ నుంచి స్వదేశీ రాకెట్లను ప్రయోగించే స్థాయికి ఎదిగిన ‘సైరూట్ ఏరోస్పేస్’ తెలంగాణ ఇన్నోవేషన్ వ్యవస్థ విజయానికి తిరుగులేని నిదర్శనమని గుర్తుచేశారు.
తెలంగాణ సాధించిన ప్రగతిలో సాగునీరు, తాగునీరు, వ్యవసాయం, విద్యుత్తు రంగాలు కీలకపాత్ర పోషించాయని కేటీఆర్ వివరించారు. చారిత్రకంగా దశాబ్దాలపాటు కరువుతో అల్లాడిన తెలంగాణ ప్రాంతానికి గోదావరి జలాలను తరలించే సవాలుకు కాళేశ్వరం ప్రాజెక్టు ఇంజినీరింగ్ పరిషారంగా నిలిచిందని వివరించారు. 201415లో తెలంగాణలో వరి ధాన్యం ఉత్పత్తి కేవలం 44.4 లక్షల టన్నులు మాత్రమే ఉండగా, బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులు, ఉచిత విద్యుత్తు వంటి చర్యల వల్ల 2023 24 నాటికి రికార్డు స్థాయిలో 168.8 లక్షల టన్నులకు పెరిగిందని తెలిపారు.
పరిమితులను, ఆటంకాలను సమస్యలుగా భావించి ఆగిపోవద్దని, వాటిని అవకాశాలుగా మలచుకోవాలని కేటీఆర్ విద్యార్థులకు సూచించారు. నిరంతరం నేర్చుకోవడం, నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడం, వాటిని ఆచరణలో పెట్టడంపైనే దృష్టి సారించాలని యువతకు ఉద్బోధించారు. తెలంగాణ అభివృద్ధి కథను దేశ యువతకు తెలియజేసే అవకాశం కల్పించినందుకు ఓపీ జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీకి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. విద్యార్థులు, మేధావులతో ఆలోచనలు పంచుకోవడానికి వేదిక కల్పించిన యూనివర్సిటీ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ డాక్టర్ సీ రాజ్‌కుమార్‌కు, యాజమాన్యానికి ఆయన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రసంగం అనంతరం జరిగిన ప్రశ్నోత్తరాల సెషన్లో విద్యార్థులు విధాన రూపకల్పన, రాజకీయాలు, అభివృద్ధి చెందుతున్న సరికొత్త టెక్నాలజీలపై వేసిన ప్రశ్నలకు ఆయన విశ్లేషణాత్మకంగా సమాధానాలు ఇచ్చారు.
విద్యార్థులతో జరిగిన ముఖాముఖిలో కేటీఆర్ సమాధానాలు, ఆయన వాగ్ధాటి విశేషంగా ఆకట్టుకున్నాయి. దేశ రాజకీయ భవిష్యత్తు, ప్రాంతీయ ఆకాంక్షలు, పారిశ్రామిక అభివృద్ధిపై ఆయన వ్యక్తం చేసిన లోతైన అభిప్రాయాలకు విద్యార్థులు, అధ్యాపకుల నుంచి ప్రశంసలు వెల్లువెత్తాయి. దాదాపు గంటకు పైగా సాగిన ఈ చర్చా కార్యక్రమంలో విద్యార్థుల సందేహాలను నివృత్తి చేస్తూ ఆయన ఉత్సాహపరిచారు.