హైదరాబాద్, సెప్టెంబర్ 16 (నమస్తే తెలంగాణ) : ‘ప్రాణాలను పణంగా పెట్టి తెలంగాణ రాష్ర్టాన్ని సాధించిన కేసీఆర్ అంటే ఏందో తెలంగాణ ప్రజలకు తెలుసు. ఆయన భూములు కలిగిన వ్యవసాయ కుటుంబంలో పుట్టారు. ప్రస్తు తం వ్యవసాయ క్షేత్రంలో నివాసం ఉంటున్నారు. ఉద్యమకాలంలో ఆయనకు హైదరాబాద్‌లో కారు పార్కింగ్‌కు కూడా సరిపడ ఇల్లు లేని పరిస్థితి..’ అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ లీడర్ హరీశ్‌రావు పేర్కొన్నారు. అలాంటి మహానేతపై అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ బురదజల్లడం దుర్మార్గమని దుయ్యబట్టారు. గొప్పగా బతికిన కేసీఆర్‌పై అసైన్డ్‌ల్యాండ్ తీసుకున్నారంటూ సీఎం ఆరోపణలు చేయడాన్ని ఖండించారు. ప్రాణాన్నే లెక్కచేయని మహానేతను పట్టుకొని చిల్లరగా మాట్లాడటం సిగ్గుచేటని మండిపడ్డారు. కేసీఆర్ వ్యక్తిత్వం గురించి ప్రజలకు తెలుసని, సీఎం చేసిన ఆరోపణలను నమ్మబోరని స్పష్టంచేశారు. కేసీఆర్‌తో బంధుత్వంలేని ఎమ్మెల్సీ నవీన్‌రావుకు ఉన్న భూములను ఆయనకు అంటగట్డడం శోచనీయమని ఖండించారు. వెలమ కులానికి చెందినంత మాత్రాన నవీన్‌రావు భూములను కేసీఆర్ కుటుంబం ఖాతాలో వేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలనలో 22ఏ పేరిట జరిగిన దారుణాలపై ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే ఊకదంపుడు ఉపన్యాసమిచ్చారని మండిపడ్డారు. ‘రేవంత్‌రెడ్డీ.. నీకు దమ్ముంటే, చెప్పిన మాటపై నిలబడే వ్యక్తివే అయితే, కేసీఆర్ కుటుంబంపై చేసినఆరోపణలు, నీ మూడే ండ్ల పాలనలో జరిగిన భూదందాలు, నిషేధిత భూముల పేరిట జరిగిన అక్రమ వ్యవహారాలపై విచారణకు సిద్ధంకావాలి..’ అని హరీశ్ సవాల్ విసిరారు.
రంగనాయక్‌సాగర్ దగ్గర తనకు ఫామ్‌హౌస్ ఉన్నదని సీఎం రేవంత్‌రెడ్డి చేసిన ఆరోపణలను హరీశ్‌రావు ఖండించారు. అక్కడ తనకు వ్యవసాయ భూమి ఉన్నట్టు అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎన్నికల కమిషన్‌కు సమర్పించిన అఫిడవిట్లో స్పష్టం చేశానని, అంతకంటే ఒక్క గుంట కూడా ఎక్కువలేదని చెప్పారు. ఇందుకు సంబంధించి చెల్లించిన ఆదాయపన్ను వివరాలను మీడియాకు చూపుతూ, సీఎం చేసిన ఆరోపణలు పచ్చి అబద్ధమని కొట్టిపారేశారు. ‘నా భూమి గురించి రెండేండ్ల నుంచి విజిలెన్స్ అధికారులు వందలసార్లు ఆరా తీశారు. 50సార్లు కలెక్టర్లు, ఆర్డీవోలు, సర్వేయర్లు పిలిచి వివరాలు ఇవ్వాలని అడిగారు. కానీ ఏమీ తేల్చలేకపోయార’ని పేర్కొన్నారు. అధికారులు రెవెన్యూ సర్వేయర్‌తో కొలిపించి తన భూమికి హద్దులు నిర్ణయించారని, కొన్నభూమి కంటే రెండు గుంట లు తక్కువగానే ఉన్నదని ఏడీ సర్వేయర్ 13 ఎకరాల 10 గుంటలుగా నిర్ధారించిన విషయాన్ని స్పష్టంచేశారు.
తన ఫామ్‌హౌస్ కోసమే అప్పటి మున్సిపల్ అధికారులు రోడ్డు వేశారని సీఎం రేవంత్‌రెడ్డి చేసిన ఆరోపణలు సత్యదూరమని హరీశ్‌రావు కొట్టిపారేశారు. తనకు ఆ అవసరం కూడా లేదని స్పష్టంచేశారు. ‘చంద్లాపూర్ నుంచి సిరిసిల్లకు వచ్చే రోడ్డు రిజర్వాయర్‌లో మునిగి పోవడంతో జడ్పీలో తీర్మానం చేసి, జడ్పీ చైర్మన్, సర్పంచ్ ద్వారా లెటర్ తీసుకొని వారి కోరిక మేరకు ఇరిగేషన్ డిపార్ట్మెంటే రోడ్డు వేసిందని పేర్కొన్నారు. కానీ, సీఎం మాత్రం మున్సిపల్ డిపార్ట్మెంట్ వేసిందని తప్పుగా చెప్పారని గుర్తుచేశారు. నా సోదరుడు, మామ విషయంలోనూ సీఎం చేసిన ఆరోపణలు పూర్తిగా తప్పని చెప్పారు. ‘నా బ్రదర్ 30 ఏండ్ల క్రితం అమెరికా వెళ్లాడు. అక్కడ సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నడు. ఆయన భార్య డాక్టర్, కూతురు కూడా జాబ్ చేస్తది. వాళ్లు 2010 నుంచి పౌల్ట్రీ బిజినెస్‌లో ఉన్నరు. వాళ్లు ఖురాన్ అని సీఎం చెప్పిన రాజ్బ్రీడర్స్ అనే కంపెనీని 2019లో కొనుగోలు (షేర్ట్రాన్స్ఫర్) చేశారు. తర్వాత బ్యాం కు లోన్ కోసం వాళ్లు ఎమ్మార్వో, కలెక్టర్లకు లెటర్‌పెట్టి నిబంధనల ప్రకారం టీఎం-33లో దరఖాస్తుపెడితే అప్పటి ప్రభుత్వం సదరు కంపెనీని వారి పేరిట మార్పిడీ చేసింది. కానీ, సీఎం రేవంత్‌రెడ్డి మాత్రం తన సోదరుడు అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపణలు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.
22ఏపై సర్కార్‌ను ఎండగట్టడంలో బీఆర్ఎస్ విజయవంతమైందని హరీశ్‌రావు పేర్కొన్నారు. బీఆర్ఎస్ పోరాటంతోనే అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వం దిగొచ్చిందని స్పష్టంచేశారు. ‘రేవంత్‌రెడ్డీ.. నీ ఇంటిని నిషేధిత జాబితా నుంచి ఏ విధంగానైతే తొలగించినవో, అదేవిధంగా నిర్ణీత కాలవ్యవధిని నిర్ణయించి ప్రజల ఆస్తులను తొలగించాలి. ముఖ్యమంత్రి సిట్ వద్దు.. పిట్ వద్దు.. నీ ఆస్తులు.. మా ఆస్తులపై మా హయాంలో ధరణిలో జరిగిన వ్యవహారాలు.. నీ పాలనలో భూ భారతి ముసుగులో జరిగిన అక్రమాలపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణకు బీఆర్ఎస్ సిద్ధం..నువ్వు రెడీనా.. సవాల్ విసురుతున్నా.. దమ్ముంటే స్వీకరించాల’ని హరీశ్‌రావు పేర్కొన్నారు.
సీఎం రేవంత్‌రెడ్డి కుటుంబానికి 308 ఎకరాల భూములు ఉన్నాయని హరీశ్‌రావు సంచలన ఆరోపణలు చేశారు. ‘రేవంత్‌రెడ్డీ… నీకు మాదిరిగా వివరాలు అందించే నెట్వర్క్ మాకు లేదు. నువ్వు అసెంబ్లీలో మాట్లాడుతున్న సమయంలోనే కేవలం గంటన్నరలోనే నీ నియోజకవర్గ ప్రజలే ఈ వివరాలు నాకు వాట్సాప్ చేశారు. అయినా ఇప్పటికిప్పుడు డాక్యుమెంట్లు తీసుకొని ఆధారాలు సహా ఆరోపణలు చేస్తున్నా.. కొట్రా గ్రామంలో నీకు, నీ తమ్ముళ్లు, నీ బిడ్డ పేరిట 175 ఎకరాలు ఉన్నట్టు తేలింది. అంతేకాకుండా, దీని పక్కనుంచే ఓఆర్ఆర్ అలైన్మెంట్, బుల్లెట్ రైలు వచ్చిందని ఆ గ్రామస్తులు ఫోన్ చేసి చెప్పారు. ఇందుకు సంబంధించిన డాక్యుమెంట్లు కూడా పంపించారు. కొండారెడ్డిపల్లిలో 75 ఎకరాలు.. అఫిడవిట్ ప్రకారం కేవలం 54 ఎకరాలే..’ అని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇవి కేవలం గంటలోనే అందిన వివరాలని, ఇంకా రాష్ట్రవ్యాప్తంగా ఎన్ని భూములు ఉన్నాయో లెక్క తేలాల్సి ఉన్నదని, ఒక్క ఫ్యూచర్‌సిటీ చుట్టూనే వందల ఎకరాలు కొల్లగొట్టినట్టు ఆరోపణలు ఉన్నాయని పేర్కొన్నారు.