Bigg Boss 10 | బిగ్ బాస్ తెలుగు సీజన్ 10లో పదో రోజు ఆట రసవత్తరంగా సాగింది. కెప్టెన్సీ కంటెండర్స్ టాస్క్‌తో మొదలైన రోజు.. కిచెన్‌లో వివాదం, ఫిజికల్ టాస్క్, సంచాలకుడి తీరుపై గొడవ, చివర్లో కెప్టెన్సీ రేసులో కీలక మలుపుతో ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా వంశీ, రోహిత్ మధ్య జరిగిన వాగ్వాదం హౌస్‌లో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణాన్ని తీసుకొచ్చింది. కెప్టెన్సీ కంటెండర్స్ టాస్క్‌లో భాగంగా వంశీ, సృష్టి సంచాలకులుగా వ్యవహరించారు. ఈ టాస్క్‌లో అమన్–షాలిని ఒక టీంగా, ముఖేష్–ఝాన్సీ మరో టీంగా పోటీ పడ్డారు. ఇందులో ఒకరు వివిధ జంతువుల్లా హావభావాలతో నటించాలి. తమ భాగస్వామి ఏ జంతువును అనుకరిస్తున్నాడో గుర్తించి, దానికి సంబంధించిన పెట్టెను మరో సభ్యుడు సరిగ్గా అమర్చాల్సి ఉంటుంది.
ఈ పోటీలో ముఖేష్, ఝాన్సీ జోడీ విజయం సాధించింది. అమన్ జంతువును సరిగ్గా నటించి చూపించలేకపోవడం, షాలిని వేగంగా పెట్టెలను అమర్చలేకపోవడం వారి ఓటమికి కారణమైంది. టాస్క్‌లో గెలిచిన ముఖేష్, ఝాన్సీకి ఓడిపోయిన వారిలో ఒకరిని కెప్టెన్సీ కంటెండర్స్ రేసు నుంచి పూర్తిగా తప్పించే అవకాశం ఇచ్చారు. ఇద్దరూ కలిసి అమన్ పేరును ఎంచుకోవడంతో అతడు కెప్టెన్సీ రేసు నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత హౌస్ కిచెన్‌లో ఆహారం విషయంలో వంశీ, వర్షిణి మధ్య మాటామాటా పెరిగింది. ఇద్దరి మధ్య వివాదం తీవ్రంగా మారుతున్న సమయంలో రామ్ ప్రసాద్, దేబ్జానీ జోక్యం చేసుకుని పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేశారు. అయితే ఆ తర్వాత జరిగిన ఫిజికల్ టాస్క్‌తో హౌస్‌లో మళ్లీ వేడి వాతావరణం నెలకొంది.
ఈ పోటీలో త్రిగుణ్–రామ్ ప్రసాద్ ఒక జట్టుగా, రోహిత్–దేబ్జానీ మరో జట్టుగా బరిలోకి దిగారు. పై నుంచి పడుతున్న బంతుల బ్యాగ్‌లను అందుకోవడంతో పాటు ప్రత్యర్థుల నుంచి వాటిని లాక్కునేందుకు పోటీ పడాల్సి వచ్చింది. ఈ టాస్క్‌లో త్రిగుణ్, రామ్ ప్రసాద్ విజయం సాధించారు. అయితే దేబ్జానీ మాత్రం చివరి వరకు గట్టిగా పోరాడింది. ఓటమిని అంగీకరించకుండా ఆమె శక్తివంచన లేకుండా ప్రయత్నించింది. ఈ టాస్క్‌కు వంశీ సంచాలకుడిగా వ్యవహరించగా.. అతడి నిర్ణయాలపై రోహిత్ అభ్యంతరం వ్యక్తం చేశాడు. సంచాలకుడిగా వంశీ సరిగ్గా వ్యవహరించలేదని రోహిత్ ఆరోపించడంతో ఇద్దరి మధ్య మాటల యుద్ధం మొదలైంది. వివాదం క్రమంగా తీవ్రరూపం దాల్చి ఇద్దరూ ఒకరిపై ఒకరు దూసుకెళ్లే పరిస్థితి ఏర్పడింది. పరస్పరం ఘాటు వ్యాఖ్యలు చేసుకోవడంతో హౌస్‌లో ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది. టాస్క్‌లో సంచాలకుడి నిర్ణయాలే వివాదానికి ప్రధాన కారణంగా మారాయి.
ఫిజికల్ టాస్క్‌లో రోహిత్, దేబ్జానీ ఓడిపోవడంతో వారిలో ఒకరు కెప్టెన్సీ కంటెండర్స్ రేసు నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే ఇద్దరూ తాము తప్పుకోవడానికి సిద్ధంగా లేకపోవడంతో మరో కొత్త పంచాయతీ మొదలైంది. రోహిత్.. దేబ్జానీని త్యాగం చేసి తనకు అవకాశం ఇవ్వాలని కోరాడు. తాను తదుపరి స్థాయికి వెళ్తే ఫిజికల్ టాస్క్‌లలో పోటీ పడటం కష్టమవుతుందని, అందుకే తన కోసం తప్పుకోవాలని ఆమెను కోరాడు. అయితే దేబ్జానీ మాత్రం అందుకు ఒప్పుకోలేదు. తాను తదుపరి స్థాయిలో పోటీ పడగలనో లేదో ఆడితేనే తెలుస్తుందని స్పష్టం చేసింది. ‘నువ్వే నా కోసం త్యాగం చేయి’ అంటూ రోహిత్‌కే తిరిగి చెప్పడంతో ఇద్దరి మధ్య వాదన మరింత ఆసక్తికరంగా మారింది.
రోహిత్, దేబ్జానీ మధ్య సమస్య పరిష్కారం కాకపోవడంతో.. చివరకు విజేతలైన త్రిగుణ్, రామ్ ప్రసాద్‌కు నిర్ణయం తీసుకునే బాధ్యతను బిగ్ బాస్ అప్పగించారు. ఇద్దరూ చర్చించి రోహిత్‌ను కెప్టెన్సీ కంటెండర్స్ రేసు నుంచి తప్పించారు. దీంతో దేబ్జానీకి తదుపరి స్థాయికి వెళ్లే అవకాశం దక్కింది. పదో రోజు ఆట ముగిసే సమయానికి త్రిగుణ్, రామ్ ప్రసాద్‌తో పాటు దేబ్జానీ కూడా కెప్టెన్సీ కంటెండర్స్ రేసులో నిలిచింది. మరోవైపు అమన్, రోహిత్ ఈ రేసు నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. దీంతో రాబోయే కెప్టెన్సీ పోటీ మరింత ఆసక్తికరంగా మారే పరిస్థితి కనిపిస్తోంది.