Aluminum Foil | అల్యూమినియం ఫాయిల్ ప్రస్తుతం ప్రతి ఇంట్లో కనిపించే వంటింటి వస్తువుగా మారింది. భోజనం ప్యాక్ చేయడం, గ్రిల్ చేసిన చేపలు, చికెన్, కూరగాయలు వండడం వంటి అనేక పనులకు దీనిని విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. అయితే అల్యూమినియం ఫాయిల్‌లో ఆహారాన్ని ఎక్కువసేపు ఉంచడం లేదా అందులోనే వండడం వల్ల కొంత అల్యూమినియం ఆహారంలోకి చేరే అవకాశం ఉంటుందని పలు అధ్యయనాలు సూచిస్తున్నాయి. ముఖ్యంగా పుల్లని, మసాలా ఎక్కువగా ఉండే ఆహారాల విషయంలో ఈ ప్రమాదం మరింత ఎక్కువగా ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో అల్యూమినియం పాత్రలను విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. ఇవి తక్కువ ధరలో లభించడం, శుభ్రం చేయడం సులభం కావడం వల్ల చాలామంది వీటినే ఎంచుకుంటున్నారు. సాధారణంగా అల్యూమినియం పాత్రల్లో వంట చేయడం వల్ల పెద్దగా ప్రమాదం ఉండదని భావించినప్పటికీ, అల్యూమినియం ఫాయిల్‌లో ఆహారాన్ని ఎక్కువసేపు చుట్టి ఉంచడం మాత్రం ఆరోగ్యానికి హానికరంగా మారే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
అల్యూమినియం స్వల్ప పరిమాణంలో శరీరంలోకి వెళ్లినా సాధారణంగా అది శరీరం నుంచి బయటకు వెళ్లిపోతుంది. అందువల్ల తక్కువ స్థాయిలో దీనికి గురికావడం పెద్దగా హానికరం కాదు. అయితే చాలామంది సిఫార్సు చేసిన పరిమితికి మించి అల్యూమినియాన్ని పరోక్షంగా తీసుకుంటున్నారని పరిశోధనలు సూచిస్తున్నాయి. మొక్కజొన్న, ఉప్పు, పసుపు రంగు చీజ్‌లు, కొన్ని మూలికలు, మసాలా దినుసులు, టీ వంటి పదార్థాల్లో కూడా అల్యూమినియం కొంతమేర ఉంటుంది. తాగునీటిని శుద్ధి చేయడానికి ఉపయోగించే అల్యూమినియం సల్ఫేట్ కూడా దీనికి ఒక ఉదాహరణ. కొన్ని పరిశోధనల్లో అల్జీమర్స్ వ్యాధితో బాధపడుతున్న వారి మెదడు కణజాలంలో అల్యూమినియం స్థాయిలు అధికంగా ఉన్నట్లు గుర్తించారు. అలాగే అల్యూమినియం మెదడు కణాల ఎదుగుదలపై ప్రభావం చూపే అవకాశం ఉంటుందని, ఎముకల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నవారిలో సమస్యలను మరింత పెంచే అవకాశాలు ఉంటాయని కొన్ని అధ్యయనాలు తెలియజేశాయి.
ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) తెలిపిన ప్రకారం అల్యూమినియం ఫాయిల్‌లో వండిన ఆహారంలో అల్యూమినియం అనుమతించిన పరిమితిని మించి చేరే అవకాశం ఉందని వెల్లడైంది. ముఖ్యంగా టమాటా, నిమ్మరసం, వెనిగర్ వంటి పుల్లని పదార్థాలు లేదా మసాలాలు ఎక్కువగా ఉన్న ఆహారాల్లో ఈ ప్రక్రియ మరింత వేగంగా జరుగుతుంది. ఆమ్ల స్వభావం కలిగిన ఆహారం అల్యూమినియం పొరను కరిగించి ఆహారంలో కలిసేలా చేస్తుంది. బేక్ చేసే వంటకాల కోసం అల్యూమినియం ఫాయిల్‌కు బదులుగా గాజు (గ్లాస్‌వేర్) లేదా పింగాణీ (పోర్సిలైన్) పాత్రలను ఉపయోగించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇవి ఆహారంతో రసాయనిక ప్రతిచర్యలకు గురయ్యే అవకాశం తక్కువగా ఉండటంతో సురక్షితమైన ప్రత్యామ్నాయాలుగా చెబుతున్నారు.
చల్లని ఆహారాన్ని అల్యూమినియం ఫాయిల్‌లో చుట్టి ఉంచడం సాధారణంగా సురక్షితమే అయినప్పటికీ, అది కూడా ఎక్కువసేపు ఉంచకూడదు. ఆహారం ఎంత పుల్లగా లేదా మసాలా ఎక్కువగా ఉంటే అంతే వేగంగా అల్యూమినియం అందులోకి చేరే అవకాశం ఉంటుంది.
అల్యూమినియం పాత్రల విషయానికి వస్తే.. వాటి ఉపరితలంపై సహజంగా ఏర్పడే ఆక్సైడ్ పొర ఆహారంలోకి అల్యూమినియం చేరకుండా కొంత రక్షణ కల్పిస్తుంది. అయితే పాత్రలను గట్టిగా రుద్ది శుభ్రం చేయడం వల్ల ఈ రక్షణ పొర తొలగిపోయే అవకాశం ఉంటుంది. అలాంటి సందర్భాల్లో పాత్రలో కొద్దిసేపు నీటిని మరిగించడం ద్వారా మళ్లీ సహజ ఆక్సైడ్ పొర ఏర్పడి రక్షణ కల్పిస్తుంది. అందువల్ల అల్యూమినియం ఫాయిల్‌లో ఆహారాన్ని ఎక్కువసేపు నిల్వ చేయకుండా ఉండటం మంచిది. ముఖ్యంగా పుల్లని, మసాలా ఎక్కువగా ఉండే ఆహారాలను అల్యూమినియం ఫాయిల్‌లో వండడం లేదా ఎక్కువసేపు చుట్టి ఉంచడం ఆరోగ్యానికి హానికరంగా మారే అవకాశం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.