Taslima Nasreen : బంగ్లాదేశ్ నుంచి బహిష్కరణకు గురైన ఆ దేశ మాజీ ప్రధాని, అవామీ లీగ్ పార్టీ అధినేత్రి షేక్ హసీనా ఇండియాలో ఆశ్రయం పొందుతున్న సంగతి తెలిసిందే. తాజాగా షేక్ హసీనాకు బంగ్లాదేశ్ బహిష్కృత రచయిత్రి తస్లీమా నస్రీన్ మద్దతు పలికారు. ఆమె బంగ్లాదేశ్ రావాలనుకుంటే అక్కడి ప్రభుత్వం ఆమె పార్టీ అయిన బంగ్లాదేశ్ అవామీ లీగ్‌పై నిషేధం తొలగించాలని తస్లీమా డిమాండ్ చేశారు. తస్లీమా నస్రీన్ 19 ఏళ్ల తర్వాత పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతా తిరిగి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆదివారం జరిగిన ఒక కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. షేక్ హసీనా బంగ్లాదేశ్ తిరిగి వెళ్లి, అక్కడి ఎన్నికల్లో పోటీ చేయాలని కోరారు.
‘‘బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనాను దేశం నుంచి బహిష్కరించడం సరికాదు. ఆమెను పదవి నుంచి తొలగించిన విధానం తప్పు. అది ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం. ఆమె పార్టీని నిషేధించడం కూడా అప్రజాస్వామికమే. ప్రభుత్వం ఆ పార్టీని ఎన్నికల్లో పోటీ చేయనివ్వాలి. హసీనా బంగ్లాదేశ్ తిరిగి వెళ్లాలని కోరుకుంటున్నా. ఆమె పార్టీపై నిషేధం ఎత్తివేయాలి’’ అని తస్లీమా వ్యాఖ్యానించారు. 2024 జూలైలో బంగ్లాదేశ్‌లో జరిగిన ఘర్షణల సమయంలో షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోయింది. ఆందోళనకారులు ఆమెపై, ప్రభుత్వంపై తిరుగుబాటు చేశారు. దీంతో ఆమె బంగ్లా నుంచి ఇండియా పారిపోయి వచ్చారు. రెండేళ్లుగా ఇక్కడే ఆశ్రయం పొందుతున్నారు. త్వరలోనే బంగ్లాదేశ్ తిరిగి వెళ్తానని ఆమె ఇటీవలే వెల్లడించింది. ఈ ఏడాది చివరికల్లా ఇండియా నుంచి బంగ్లా వెళ్తానని ప్రకటించింది. అయితే, ఆమె బంగ్లాదేశ్‌లో అడుగుపెట్టిన వెంటనే అరెస్టు చేస్తామని అక్కడి ప్రభుత్వం ప్రకటించింది.
ఆమెకు మరణశిక్ష జారీ అయిందని, అందువల్ల అమె లొంగిపోయే అవకాశం కూడా ఇవ్వకుండా అరెస్టు చేస్తామని బంగ్లా ప్రభుత్వం తెలిపింది. షేక్ హసీనాను అప్పగించాలని కూడా బంగ్లాదేశ్ రెండేళ్లుగా కోరుతోంది. 2025 నవంబర్‌లో బంగ్లాదేశ్‌లోని కోర్టు షేక్ హసీనాకు మరణశిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించింది. 2024లో జరిగిన ఘర్షణల సమయంలో తీవ్ర అణచివేతకు పాల్పడ్డారని, పలువురి మరణానికి కారణమయ్యారని ఆరోపిస్తూ ఆమెకు మరణశిక్షను ఖరారు చేసింది కోర్టు. షేక్ హసీనాతోపాటు హోం మినిస్టర్ అసదుజ్జమాన్ ఖాన్‌కు కూడా కోర్టు మరణశిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించింది. కానీ, ఈ తీర్పు ఏకపక్షం అని, అన్యాయం అని షేక్ హసీనా విమర్శించారు.