కాకమిగహరా (జపాన్): భారత మహిళల హాకీ జట్టు తమ కలను నెరవేర్చుకుంది. నాలుగున్న దశబ్దాలుగా ఆసియాడ్‌లో అందని ద్రాక్షగా ఉన్న స్వర్ణ పతకాన్ని ఎట్టకేలకు అందుకుంది. చైనా అడ్డుగోడను దాటి ఆసియా చాంపియన్‌గా నిలిచి.. 2028 లాస్ ఎంజెల్స్ ఒలింపిక్స్ బెర్తు కూడా సొంతం చేసుకుంది. ఉత్కంఠభరిత ఫైనల్లో 1-0తో డిఫెండింగ్ చాంప్, పారిస్ ఒలింపిక్ రజత విజేత, అత్యంత బలమైన చైనాను ఓడించింది.
1982 తర్వాత ఆసియాడ్‌లో భారత మహిళల హాకీ జట్టుకు ఇదే తొలి స్వర్ణం కావడం విశేషం. 10వ నిమిషంలో స్టార్ ఫార్వర్డ్ లాల్రెమ్సియామి విన్నింగ్ గోల్ కొట్టగా.. గోల్ కీపర్ బిచు దేవి ప్రత్యర్థికి అడ్డుగోడగా నిలిచి భారత్ పసిడి కలను సాకారం చేయడంలో కీలక పాత్ర పోషించింది. 1998, 2018 ఫైనల్స్‌లో రజతాలతో సరిపెట్టుకున్న భారత్, ఈసారి పసిడితో నాలుగు దశాబ్దాల నిరీక్షణకు తెరదించింది. గత ఎడిషన్ సెమీస్‌లో 4-0తో తమను ఓడించిన చైనాపై ప్రతీకారం తీర్చుకుంది.
ట్రాఫిక్ జామ్ కారణంగా టీమ్ బస్సులు ఆలస్యంగా స్టేడియానికి చేరుకోవడంతో మ్యాచ్ గంట ఆలస్యంగా ప్రారంభమైనప్పటికీ భారత జట్టు ఏమాత్రం ఏకాగ్రత కోల్పోలేదు. ఆట ప్రారంభంలోనే మన ప్లేయర్లు చైనా డిఫెన్స్‌పై ఒత్తిడి పెంచారు. ఈ క్రమంలో 10వ నిమిషంలో సాక్షి రాణా అందించిన పాస్‌ను అందుకున్న ఫార్వర్డ్ లాల్రెమ్సియామి అద్భుతమైన రివర్స్ స్టిక్ షాట్‌తో బంతిని గోల్ పోస్ట్‌లోకి పంపి జట్టుకు 1-0 ఆధిక్యాన్ని అందించింది.
ఆరంభంలోనే గోల్ సాధించడంతో భారత జట్టు మ్యాచ్‌పై పట్టు సాధించింది. అనంతరం చైనా వరుస దాడులతో విరుచుకుపడింది. అయితే గోల్‌కీపర్ బిచు దేవి అసాధారణ ప్రదర్శనతో చైనా యత్నాలను తిప్పికొట్టింది. 18వ నిమిషంలో చైనాకు లభించిన తొలి పెనాల్టీ కార్నర్‌ను భారత్ నిలువరించింది. ఇక, మ్యాచ్ 24వ నిమిషంలో ప్రత్యర్థికి పెనాల్టీ స్ట్రోక్ దక్కడంతో కోచ్ షోర్డ్ మరీన్ బిచు దేవిని బరిలోకి దింపాడు. అతని నమ్మకాన్ని నిలబెట్టిన బిచు దేవి ఎడమవైపుకి డైవ్ చేస్తూ చైనీస్ స్ట్రోక్‌ను అద్భుతంగా అడ్డుకుంది.
ఈ సేవ్ మ్యాచ్‌కే ప్రధాన మలుపుగా నిలిచింది. కెప్టెన్ సలీమా టెటే, నవనీత్ కౌర్, సుశీలా చాను, ఈషికా చౌదరి, శిల్పితో కూడిన భారత డిఫెన్స్ ప్రాణం పెట్టి పోరాడి చైనా ఫార్వర్డ్స్కు ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు. ఓ షాట్‌ను నిలువరించే క్రమంలో కెప్టెన్ సలీమా గాయపడినా వెరవకుండా పోరాడింది. ఆఖరి ఐదు నిమిషాల్లో చైనా తమ గోల్ కీపర్‌ను కూడా వెనక్కి పిలిపించి 11 మందితో దాడి చేసినప్పటికీ భారత రక్షణ విభాగాన్ని ఛేదించలేకపోయింది.