కల్పవల్లి కాళేశ్వరాన్ని పనిగట్టుకొని పడావుపెట్టి, ఇప్పుడు కరువుపాట పాడుతున్నది కాంగ్రెస్ సర్కార్. రాష్ట్రంలో 235 మండలాల్లో కరువు వచ్చిందని క్యాబినెట్ చర్చిస్తున్న తరుణానికీ మేడిగడ్డ వద్ద లక్ష క్యూసెక్కుల గోదావరి వరద కొనసాగింది. అలా ఈ సీజన్లో ఇప్పటివరకు రేవంత్ సర్కార్ చేజేతులా దిగువకు వదిలేసిన విలువ 750 టీఎంసీలు! ఒక్క మేడిగడ్డలో నీళ్లు ఎత్తిఉంటే.. అన్నారం నుంచి బస్వా పూర్ దాకా, మానేరు నుంచి ఇటు నిజాంసాగర్ దాకా నీళ్లు పారేవి. 100 టీఎంసీలు ఎత్తుకున్నా 8వేల చెరువులు నిండేవి. సాగుకు భరోసాదక్కేది. కానీ, వరదను వదిలేసి, ఉత్తర తెలంగాణను కరువుముఖంలోకి నెట్టింది కాంగ్రెస్ సర్కార్.
హైదరాబాద్, అక్టోబర్ 2 (నమస్తే తెలంగాణ): ‘అంగట్లో అన్నీ ఉన్నా.. అల్లుడి నోట్లో శని’ అనే చందంగా కాంగ్రెస్ సర్కార్ నిర్వాకం ఉన్నది. ఓవైపు ఎల్ నినో కారణంగా రాష్ట్రంలో కరువు పరిస్థితులు దాపురించినా.. మరోవైపు గోదాట్లో నీళ్లు ఏపీకి తరలిపోతున్నా నిమ్మకునీరెత్తినట్టు వ్యవహరిస్తున్నది. ఇప్పటికీ జలాలను ఒడిసిపట్టి అటు పంటలకు ఇటు తాగునీటికి అందించే అవకాశం ఉన్నా.. కక్ష పూరిత రాజకీయాలతో పబ్బం గడుపుకొంటున్నది. ఓ వైపు నీళ్లు లేక కండ్లముందే పంటలు ఎండిపోయి రైతులు కన్నీళ్లు పెట్టుకుంటుంటే ప్రభుత్వం మాత్రం తమాషా చూస్తున్నది.
ప్రస్తుతం గోదావరిలో ప్రాణహిత నుంచి మేడిగడ్డ మీదుగా సెప్టెంబర్ 29న లక్షా 22వేల క్యూసెక్కులు 30న లక్ష క్యూసెక్కులు ఈ రోజుకు 40వేల క్యూసెక్కుల వరద ప్రవాహం కొనసాగుతున్నది. సగటున రోజుకు 9 టీఎంసీల జలాలు కిందికి పోతున్నాయి. గోదావరి నీటిమట్టం 95 మీటర్ల ఎత్తున కొనసాగుతున్నది. మేడిగడ్డ బరాజ్ గేట్లు మూయాల్సిన పనిలేదు. బరాజ్‌లో నీటిని నిల్వ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికిప్పుడు కన్నెపల్లి పంప్‌హౌస్ వద్ద మోటర్లను ఆన్చేసినా ప్రాణహిత జలాలను ఎత్తిపోసుకోవచ్చు. తద్వారా ఉత్తర తెలంగాణను కరువు బారి నుంచి రక్షించుకోవచ్చు.
వెలవెలబోతున్న రిజర్వాయర్లను, చెరువులను కడుపునిండా నింపుకొవచ్చు. కానీ రాష్ట్ర సర్కార్ ఆ పని చేయకుండా బురద రాజకీయాలకే ప్రాధాన్యమిస్తున్నది. నీటిని ఎత్తిపోసుకోవచ్చని, ఆ దిశగా చర్యలు చేపట్టాలని విశ్రాంత ఇంజినీర్లు, నీటిరంగ నిపుణులు చెప్తున్నా, నీటి నిర్వహణ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని ఎన్డీఎస్ఏ, సీడబ్ల్యూసీ తేల్చి చెప్పినా ఆ దిశగా చర్యలు మాత్రం తీసుకోవడం లేదు. కేవలం కేసీఆర్‌కు పేరొస్తుందనే కారణంతో కాళేశ్వరం ప్రాజెక్టును పడావు పెట్టి తెలంగాణ ప్రజానీకాన్ని కరువు కోరల్లోకి నెడుతున్నది. సర్కార్ తీరుతో మున్ముందు తాగునీటికి సైతం సంకట పరిస్థితులు ఏర్పడే ప్రమాదం పొంచి ఉన్నది. ఆయా రిజర్వాయర్లలోని నీటి నిల్వలు, అవసరాలే ఆ విషయాన్ని స్పష్టంగా తేల్చి చెప్తున్నాయి.
గోదావరి బేసిన్లో ప్రధాన రిజర్వాయర్లలో అరకొరగానే నీటి నిల్వలున్నాయి. శ్రీరాంసాగర్ సహా అన్ని మేజర్ రిజర్వాయర్లలో సగం మేరకే నీటి నిల్వలున్నాయి. కారణం ఈ ఏడాది ఎగువ నుంచి ఆశించిన స్థాయిలో వరదలు రాలేదు. వర్షాలు కురువలేదు. వెరసి ప్రధాన గోదావరి, మంజీరాలో పెద్దగా ప్రవాహాలు రాలేదు. ప్రభుత్వం మేజర్ ప్రాజెక్టుల దిగువన క్రాప్ హాలిడే ప్రకటించిందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. కానీ మరోవైపు దిగువన ప్రాణహిత నుంచి మాత్రం ఎప్పటిలాగే ఈ ఏడాది సైతం వరద ప్రవాహాలు నమోదయ్యాయి. జూన్ ప్రారంభం నుంచే వరద మొదలైంది. ఇప్పటికీ అక్కడ లక్షల క్యూసెక్కుల ప్రవాహం కొనసాగుతున్నది. అంటే రోజుకు సగటున 9 టీఎంసీలు.
ఈ సీజన్లో మొత్తంగా 750 టీఎంసీలకుపైగా జలాలు మేడిగడ్డ మీదుగా దిగువన ఆంధ్రాకు తరలిపోయాయని గణాంకాలే చెప్తున్నాయి. వాస్తవంగా కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో కీలకమైన మేడిగడ్డ (లక్ష్మీ) బరాజ్ ఎగువ కన్నెపల్లి పంపులను ఆన్‌చేస్తే ప్రాణహిత జలాలను ఒడిసిపట్టవచ్చు. మేడిగడ్డ నుంచి అన్నారం, అన్నారం నుంచి సుందిళ్ల, సుందిళ్ల నుంచి ప్రధాన గోదావరిపై నిర్మించిన ఎల్లంపల్లి ప్రాజెక్టుకు నీటిని తరలించుకోచ్చు. ఎల్లంపల్లి నుంచి నందిమేడారం, నందిమేడరారం నుంచి లక్ష్మీపూర్, లక్ష్మీపూర్ నుంచి రాజన్న సిరిసిల్ల జిల్లా రాజరాజేశ్వర జలాశయం, ఆపై అక్కడి నుంచి అంతగిరి (అన్నపూర్ణ) రిజర్వాయర్‌కు అక్కడి నుంచి రంగనాయకసాగర్‌కు, తద్వారా కొమురవెల్లి మల్లన్నసాగర్, అక్కడి నుంచి కొండపోచమ్మ సాగర్, బస్వాపుర్ రిజర్వాయర్ వరకు జలాలను తరలించుకోచ్చు.
వరద కాలువ ద్వారా ఎస్సారెస్పీకి, మల్లన్నసాగర్ నుంచి కూడవెల్లి వాగులోకి జలాలను విడుదల చేసి ఎగువ మానేరుకు, కొండపోచమ్మసాగర్ ద్వారా హల్దీవాగులోకి జలాలను విడుదల చేస్తే నిజాంసాగర్‌కు తరలించుకోవచ్చు. అందుకు కావాల్సిన నీటిసరఫరా వ్యవస్థ మొత్తం సంసిద్ధంగా ఉన్నది. కాళేశ్వరం రాడార్‌లో దాదాపు 8వేల చెరువులను, పదుల సంఖ్యలో చెక్‌డ్యామ్‌లను నింపే అవకాశమున్నది. తద్వారా ఆయా ప్రాజెక్టుల దిగువన ఒకపంటకు సాగునీటిని అందించే అవకాశమున్నది. కానీ ప్రభుత్వం మాత్రం మేడిగడ్డ పంపులను ఆన్చేయలేదు. కేవలం కేసీఆర్‌కు పేరు వస్తుందనే ఒకే కారణంతో ప్రాజెక్టును పడావు పెట్టి జలాలను వృథాగా వదిలేస్తున్నది.
కాళేశ్వరం పనికిరాదని చెప్తూనే మరోవైపు ప్రాజెక్టులో భాగమైన ఇతర వ్యవస్థలన్నింటినీ కాంగ్రెస్ సర్కార్ వినియోగిస్తున్నది. ఈ సీజన్లో ఎల్లంపల్లి నుంచి ఇప్పటి వరకు 21 టీఎంసీల నీటిని మిడ్ మానేరుకు ఎత్తిపోశారు. గాయత్రి, నంది పంప్‌హౌస్‌ల ద్వారా జలాలను తరలించారు. అవి కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించినవే. ఇటీవల రంగనాయకసాగర్‌కు సైతం జలాలను ఎత్తిపోశారు. ప్రాజెక్టులో భాగమైన ఇతర వ్యవస్థలను వినియోగిస్తూ మరోవైపు 3 బరాజ్‌లను పడావు పెడుతున్నది. బరాజ్‌ల వినియోగానికి ఎన్డీఎస్ఏ నివేదికను సాకుగా చూపుతున్నది. పునరుద్ధరణ చేపట్టాకే వినియోగిస్తామంటూ తేల్చి చెప్తూ తెలంగాణను కరువు కోరల్లోకి నెడుతున్నది.
వాస్తవంగా మేడిగడ్డ బరాజ్‌లో సాంకేతిక సమస్యలు ఏర్పడ్డాయి. అక్కడ నీటిని నిల్వ చేయకుండానే జలాలను తరలించే అవకాశం ఉన్నదని నీటిరంగ నిపుణులు, ఇంజినీర్లు తేల్చిచెప్తున్నారు. ఇక ఎగువన అన్నారం, సుందిళ్ల బరాజ్లల్లో మేడిగడ్డ తరహా ఎలాంటి కుంగుబాట్లు లేవు. సీపేజీ సమస్యలు రాగా, గతంలోనే వాటిని పునరుద్ధరించారు. వాటిని వినియోగించుకోవచ్చు. ఎన్డీఎస్ఏ సైతం బరాజ్‌ల వినియోగం, నీటి ఎత్తిపోతలపై రాష్ట్ర ప్రభుత్వానిదే బాధ్యతని తేల్చిచెప్పింది. బరాజ్‌ల పటిష్టతపై సీడబ్ల్యూపీఆర్ఎస్ సైతం నివేదికలు సమర్పించింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం వరద జలాలను ఒడిసిపట్టేందుకు నిరాకరిస్తున్నది. కక్షా రాజకీయాల కోసం జలాలను దిగువకు వదిలివేస్తూ రాష్ర్టాన్ని నీటి సంక్షోభంలోకి నెడుతున్నది.
గోదావరి బేసిన్‌లోని 20 రిజర్వాయర్ల పరిధిలో తాగునీటి అవసరాలకు నెలకు దాదాపు 3.26 టీఎంసీలు అవసరం. ప్రస్తుత రాబోయే జూలై వరకు తాగునీటి అవసరాలకు మొత్తంగా 39.12 టీఎంసీలు కావాలి. ఇది సాధారణ రోజులకు సంధించిన నీటి అవసరాలే. కానీ రాబోయే రోజుల్లో సూపర్ ఎల్ నినో ప్రభావంతో ఎండలు పెరిగే ప్రమాదం ఉన్నదని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తున్నది. ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. మరోవైపు భూగర్భజలాలు సైతం నెలకు మీటరు చొప్పున లోతుకు పడిపోతున్నాయి. గతంలో ఇదే సమయంలో రాష్ట్ర సగటు భూగర్భ జలమట్టం 6.22 మీటర్లు. కానీ ప్రస్తుతం ఏకంగా 9.34 మీటర్లకు చేరుకోవడం ప్రమాదకర పరిస్థితికి అద్దం పడుతుంది.
దాదాపు 3.12 మీటర్ల లోతుకు భూగర్భ జలాలు పడిపోయాయి. పరిస్థితి ఇలానే ఉంటే రాబోయే రోజుల్లో మరింత లోతుకు పడిపోయే ప్రమాదం ఉన్నదని తెలుస్తున్నది. భూగర్భజల మట్టం వేగంగా పడిపోవడానికి ప్రధాన కారణం ప్రాజెక్టులకు ఆశించినస్థాయిలో నీరు రాకపోవడం, మరోవైపు చెరువులు నింపకపోవడమేనని స్పష్టంగా తెలుస్తున్నది. ఇది అంతిమంగా ప్రాజెక్టుల కింద ఉన్న తాగునీటి అవసరాలను సైతం రెట్టింపు చేసే అవకాశం ఉన్నదని అధికారవర్గాలు అంచనా వేస్తున్నాయి. తద్వారా ప్రస్తుతమున్న నీటినిల్వలు సరిపోని దుస్థితి. వెరసి మున్ముందు పరిస్థితి అత్యంత దారుణంగా మారి తాగునీటికీ తిప్పలు తప్పవని తెలుస్తున్నది. ఇప్పటికే అనేక ఆవాసాలకు వారానికి ఒకసారి ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి. అయినా ముందస్తు నివారణగా ప్రభుత్వం ఎలాంటి చర్యలూ చేపట్టిన దాఖలాలు లేకుండా పోయాయి.