ఆసియా గేమ్స్‌లో భారత్ పసిడి పంట పండించింది. ఒకే రోజు ఆరు స్వర్ణాలతో గోల్డెన్ సిక్స్ కొట్టింది. రింగ్‌లో మన బాక్సర్లు తమ పవర్ చూపెట్టారు. బర్త్ డే గర్ల్, ఒలింపిక్ మెడలిస్ట్ లవ్లీనా బొర్గోహైన్ సహా ఫైనల్లో బరిలోకి దిగిన ముగ్గురూ గోల్డెన్ పంచ్‌లతో హ్యాట్రిక్ సాధించారు. అటు రికర్వ్ ఆర్చర్లు లక్ష్యాన్ని గురి చూసి కొట్టారు. మహిళల జట్టు ఏకంగా పదిసార్లు ఒలింపిక్ చాంపియన్ అయిన సౌత్ కొరియాను ఓడించి బంగారు పతకం అందుకుంటే.. ఆంధ్రప్రదేశ్ కుర్రాడు బొమ్మదేవర ధీరజ్ రెండు రజతాలతో మెప్పించాడు.
మధ్యలో కుస్తీ వీరుడు సుజీత్ కల్కల్ రెజ్లింగ్ మ్యాట్‌పై చరిత్రలో నిలిచిపోయే విజయం సాధించాడు. ఫైనల్లో 2-9తో ఓటమి అంచుల్లో నిలిచిన దశలో అసాధారణ పోరాటంతో పుంజుకొని స్వర్ణం కైవసం చేసుకొని ఔరా అనిపించాడు. చివరకు మహిళల హాకీ జట్టు బలమైన చైనాను ఓడిస్తూ 44 ఏండ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఆసియా గేమ్స్ చాంపియన్‌గా నిలవడమే కాకుండా ఒలింపిక్స్ బెర్తునూ దక్కించుకుంది. శుక్రవారం అత్యధికంగా ఆరు స్వర్ణాలు సహా పది పతకాలు నెగ్గిన భారత్ సగర్వంగా టాప్-5లోకి దూసుకొచ్చింది. శనివారం పతక పోటీలకు తెర పడనుంది.

నిషియో: జపాన్ గడ్డపై భారత బాక్సర్లు సరికొత్త చరిత్ర సృష్టించారు. రింగ్‌లో తిరుగులేని ప్రదర్శన చేసిన లవ్లీనా బొర్గోహైన్ (75 కేజీ), పర్వీన్ హుడా (65 కేజీ), అంకుష్ పంగల్ (80 కేజీ) పసిడి పంచ్‌లు విసిరారు. ప్రత్యర్థులపై విరుచుకుపడి వరుసగా మూడు స్వర్ణ పతకాలను కైవసం చేసుకున్నారు. దిగ్గజ బాక్సర్ మేరీకోమ్ (2014) తర్వాత ఆసియాడ్‌లో స్వర్ణం సాధించిన భారత మహిళా బాక్సర్లుగా లవ్లీనా, పర్వీన్ నిలిచారు. ఈ ఇద్దరి విజయంతో మహిళల విభాగంలో 12 ఏండ్ల స్వర్ణ నిరీక్షణకు తెరపడింది.
మరోవైపు 2018లో అమిత్ పంగల్ తర్వాత మెన్స్ బాక్సింగ్‌లో గోల్డ్ నెగ్గిన బాక్సర్‌గా అంకుష్ రికార్డుకెక్కాడు. ఒక ఎడిషన్ ఆసియాడ్‌లో భారత బాక్సర్లు మూడు స్వర్ణాలు గెలవడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఇప్పటికే ప్రియా ఘంగాస్ (60 కేజీ), కపిల్ పొఖరియా (90 కేజీ), నరేందర్ బెర్వాల్ (+90 కేజీ) కాంస్యాలు సాధించడంతో భారత్ మొత్తం 6 పతకాలతో ఆసియాడ్ బాక్సింగ్‌ను అత్యుత్తమంగా, అగ్రస్థానంతో ముగించింది.
తన 29వ పుట్టినరోజు నాడే బరిలోకి దిగిన ఒలింపిక్ పతక విజేత లవ్లీనా 75 కేజీల ఫైనల్లో 5-0తో చైనాకు చెందిన జియీ బావోను చిత్తు చేసింది.తన ఎత్తును ఉపయోగించుకుంటూ ప్రారంభం నుంచే లవ్లీనా పంచ్‌లతో విరుచుకుపడింది. పారిస్ ఒలింపిక్స్‌లో పతకం చేజారడంతో తీవ్ర నిరాశకు గురై బాక్సింగ్‌కు వీడ్కోలు చెప్పాలని భావించిన లవ్లీనా ఆ నిర్ణయాన్ని మార్చుకుని ఆసియాడ్‌లో పసిడి పతకాన్ని ముద్దాడింది. గత ఎడిషన్‌లో సాధించిన రజతాన్ని ఈసారి స్వర్ణంగా మార్చుకుంది.
టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్యం, ఆసియాడ్‌లో పసిడిని అందించిన జపాన్ తన కెరీర్‌కు ఎంతో అదృష్టకరమైన ప్రదేశమని ఈ అస్సాం బాక్సర్ పేర్కొంది. పారిస్ పరాజయం తర్వాత ఏడాది పాటు రింగ్‌కు దూరంగా ఉండి, కామన్వెల్త్ గేమ్స్‌లోనూ రజతంతో సంతృప్తి చెందాల్సి రావడంతో తీవ్ర అసంతృప్తికి గురైన బొర్గోహైన్.. ఆ పట్టుదలతోనే శ్రమించి విజయాన్ని అందుకుంది. ఒక దశలో ఆట వదిలేయాలనుకున్నా, పతకం రంగు మార్చాలనే బలమైన కోరికతోనే మళ్లీ బరిలోకి దిగానని లవ్లీనా వెల్లడించింది.
65 కేజీల విభాగం ఫైనల్లో పర్వీన్ హుడా సంచలన ప్రదర్శన చేసింది. హోరాహోరీ పోరులో 3-2తో పారిస్ ఒలింపిక్స్ కాంస్య పతక విజేత, చైనీస్ తైపీ బాక్సర్ చెన్ నియెన్ చిన్ను ఓడించి తన తొలి ఆసియాడ్ స్వర్ణాన్ని ముద్దాడింది. చివరగా పురుషుల 80 కేజీల ఫైనల్లో అంకుష్ పంగల్ పూర్తి ఆధిపత్యం చెలాయించాడు. పవర్ఫుల్ పంచ్‌లతో 4-0తో దక్షిణ కొరియా ఆటగాడుకిమ్ మిన్సోంగ్ను చిత్తు చేసి భారత్‌కు మూడో స్వర్ణాన్ని అందించాడు.