ఖమ్మం రూరల్ : ‘సారే కావాలంటున్నది తెలంగాణ పల్లెలల్లా.. మళ్లీ కారే రావాలంటున్నది తెలంగాణ పల్లెలల్లా’, ‘నీ చూపుతో చెరువు నిండి నాడు మా బతుకు పండే’, ‘గులాబీల జెండాలమ్మ, గులాబీల జెండాలమ్మ’, ‘ఔర్ ఏక్ దక్క కేసీఆర్ పక్క’.. మామూలుగా ఈ పాటలు చెవినపడగానే బీఆర్ఎస్ పార్టీ సభలో కళాకారులు పాడుతున్నరేమో అనుకుంటాం. కానీ, ఈసారి అలా అనుకుంటే మీరు పొరబడినట్టే. ఎందుకంటే వరి పొలాల్లో మహిళలు ఈ పాటలు ఆలపిస్తూ హుషారుగా నాట్లు వేస్తున్నారు. రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా జనరంజక పాలన అందించిన కేసీఆర్‌ను గుర్తు చేసుకుంటూ.. బీఆర్ఎస్ మళ్లీ రావాలని కోరుకుంటూ ఈ పాటలందుకున్నారు ఖమ్మం రూరల్‌లో వరినాట్లు వేస్తున్న మహిళలు.
మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పాలనతో విసిగెత్తిపోయిన ప్రజలు మళ్లీ కేసీఆర్ పాలన కోరుకుంటున్నారు. అందుకు నిదర్శనమే వరి పొలాల్లో నాట్ల సందర్భంగా గులాబీ పాటల హోరు వినిపిస్తోంది. సారే కావాలంటున్నది తెలంగాణ పల్లెలల్లా, మళ్లీ కారే రావాలంటున్నది తెలంగాణ పల్లెలల్లా, నీ చూపుతో చెరువు నిండి నాడు మా బతుకు పండే, గులాబీల జెండాలమ్మ, గులాబీల జెండాలమ్మ, ఔర్ ఏక్ దక్క కేసీఆర్ పక్క, కత్తుల వంతెన దాటంది బీఆర్ఎస్ జెండా, కదన రంగాన దూకింది గులాబీ జెండా.. వంటి అనేక పాటలు పాడుకుంటూ వరి నాట్లు వేశారు మహిళలు.

ఖమ్మం జిల్లా రూరల్ మండలం చింతపల్లిలో ఆదివారం కొందరు వ్యవసాయ కూలీలు తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌ను తలుచుకుంటూ ఆదివారం హుషారుగా నాట్లు వేశారు. వరి నారు కట్టలతో ఇంగ్లీష్‌లో KCR పదాలను రాసి.. గులాబీ పార్టీ పాటలతో సందడి చేశారు. నాడు కేసీఆఆర్ ప్రవేశపెట్టిన రైతుబంధు, రైతు బీమా, అనేక సంక్షేమ కార్యక్రమాలను పాటలుగా పాడుతూ అప్పటి రోజులను గుర్తు చేసుకున్నారు.
వ్యవసాయ కూలీలతో పాటు రైతులు సైతం బీఆర్ఎస్ పాటలు పాడుతూ పొలం పనులు చేసుకున్నారు. దాంతో, అటువైపుగా వెళుతున్న ప్రతి ఒక్కరూ గులాబీ జెండాలను, వ్యవసాయ కూలీల సంబరాలను చూసి మురిసిపోయారు. ఈ కార్యక్రమంలో రైతులు తోట జగన్, శ్రీనివాసరావు, నాగబాబు, పలువురు వ్యవసాయ కూలీలు పాల్గొన్నారు.
