సిటీబ్యూరో, మార్చి 13 (నమస్తే తెలంగాణ): ట్రై కార్పొరేషన్ల పరిధిలో ఆస్తిపన్ను బకాయిదారులకు ప్రవేశపెట్టిన ఓటీఎస్ పథకానికి యాజమానుల నుంచి ఆశించిన స్థాయిలో స్పందన లభించడం లేదు. సుమారు 1000 కోట్ల రూపాయల బకాయిలను వసూలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న అధికారులకు ప్రస్తుత వసూళ్లు మింగుడుపడటం లేదు. గడువు ముగియడానికి మరో 18 రోజులే సమయం ఉన్నప్పటికీ, ఇప్పటివరకు కేవలం రూ. 322 కోట్లు మాత్రమే వసూలైంది.
కేవలం 52 కోట్ల మేర ప్రజలకు ఓటీఎస్ రూపంలో లబ్ధి జరిగింది. ముఖ్యంగా బడా వాణిజ్య సముదాయాలు, కార్పొరేట్ సంస్థల నుంచి రావాల్సిన బకాయిలే సింహభాగం ఉండడం గమనార్హం. గ్రేటర్ విభజన అనంతరం మున్సిపల్ వార్డుల సంఖ్యకు అనుగుణంగా టార్గెట్లను కూడా అధికారులు పంచుకున్నారు. ఆర్థిక సంవత్సరానికి రూ.3వేల కోట్ల లక్ష్యంలో ఇప్పటి వరకు రూ.2172 కోట్లు వసూలైంది. అయితే జీహెచ్ఎంసీలో 11 లక్షల ఆస్తులు ఉండగా, ఈ నెలాఖరుకల్లా రూ. 1,000 కోట్ల వసూళ్లే లక్ష్యంగా పెట్టుకున్నారు. కాగా, ఆస్తి పన్ను బకాయిదారులపై అధికారులు కొరడా ఝుళిపించనున్నారు. అనేక సార్లు నోటీసులు ఇచ్చినా స్పందించని మొండి బకాయిదారుల ఆస్తులను సీజ్ చేయనున్నారు.