– నల్లగొండ జిల్లా అధికారులకు ప్రజా, విద్యార్థి సంఘాల ఫిర్యాదు
కొండమల్లేపల్లి, ఆగస్టు 03 : నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లిలోని ‘SPR’ (సర్వేపల్లి రాధాకృష్ణ) హైస్కూల్‌పై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ జిల్లా కలెక్టర్, అడిషనల్ కలెక్టర్, జిల్లా విద్యాశాఖాధికారి, జిల్లా చైల్డ్ వెల్ఫేర్ అధికారులకు ప్రజా, విద్యార్థి సంఘాల నాయకులు సోమవారం ఉమ్మడిగా ఫిర్యాదు ప్రతులు సమర్పించారు. రైట్ టు ఇన్ఫర్మేషన్ సర్వీస్ సొసైటీ నేతృత్వంలో TNSF, YSRSU, SHPS తదితర ప్రజా, విద్యార్థి సంఘాల నాయకులు బృందంగా వెళ్లి పాఠశాల యాజమాన్య చట్టపర ఉల్లంఘనలపై అధికారులకు ఆధారాలతో వినతి పత్రాలు అందించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా RTISS ఫౌండర్ & నేషనల్ ప్రెసిడెంట్ కేతావత్ బాబురామ్ నాయక్, TNSF దేవరకొండ ఇన్చార్జి జార్పుల జగన్ నాయక్, YSRSU జిల్లా అధ్యక్షుడు ఎండి. సిరాజ్, SHPS రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె.రమేష్ నాయక్ మాట్లాడుతూ..
ఆర్‌జేడీఎస్‌ఈ హైదరాబాద్ ప్రొసీడింగ్స్ ప్రకారం ‘SPR’ (సర్వేపల్లి రాధాకృష్ణ) అనే పేరును వాడటానికి వీల్లేదని స్పష్టమైన ఆదేశాలు ఉన్నప్పటికీ యాజమాన్యం కోర్టు, విద్యాశాఖ ఉత్తర్వులను దిక్కరిస్తోందన్నారు. విద్యాశాఖ నిబంధనలు (G.O.Ms.No.1) ప్రకారం పేరు మార్పు అధికారికంగా Sanction అయ్యే వరకు ఈ పాఠశాలలో తరగతులు నిర్వహించడం లేదా నూతన అడ్మిషన్లు చేపట్టడం పూర్తిగా చట్టవిరుద్ధం అన్నారు. అటువంటిది సదరు పాఠశాల నిర్మాణం ఎఫ్టీఎల్ పరిధిలో ఉండడం, అడ్మిషన్లు చేపట్టడం, హాస్టల్ నిర్వహించడం చేస్తుందన్నారు. కావునా అధికారులు స్పందించి సమగ్ర విచారణ జరిపి నిబంధనల ప్రకారం చర్యలు చేపట్టాలని కోరారు. అదేవిధంగా నల్లగొండలోని దేవరకొండ రోడ్డు బ్రాంచ్‌లో జరుగుతున్న ఉల్లంఘనలపై కూడా విచారణ జరిపించాలన్నారు.