KCR | హైదరాబాద్, మే 10 (నమస్తే తెలంగాణ): ‘బీజేపీకి పేదలంటే పట్టదు. వారి ఎజెండాలో పేదలు, కార్మికులు, రైతులు, ఆటోకార్మికులు వంటి వారు ఉండరు. అంబానీ, అదానీలకు, శ్రీమంతులకు రూ.లక్షల కోట్ల కార్పొరేట్ ట్యాక్స్ రద్దు చేస్తారు తప్ప.. పేదవారికి ఏమీ చేయరు. పదేండ్లుగా అది నిరూపితమవుతూనే ఉన్నది’ అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. శుక్రవారం రాజన్న సిరిసిల్ల జిల్లాకేంద్రం, సిద్దిపేట పాతబస్టాండ్ చౌరస్తాలో నిర్వహించిన బస్సుయాత్రకు తరలివచ్చిన అశేష జనవాహినిని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ఆ ప్రసంగం ఆయన మాటల్లోనే.. ‘రాజన్నసిరిసిల్ల జిల్లా.. దేవుని పేరుమీద ఉండాలని, వేములవాడ రాజన్న పేరు పెట్టి.. రాజన్నసిరిసిల్ల జిల్లాగా పెట్టుకున్నం. ఇక్కడికి నిన్ననే ప్రధాని మోదీ వచ్చిండు. ఆయన పక్కనే బండి సంజ య్ ఉన్నడు. పొద్దున లేస్తే దేశం కోసం ధర్మం కోసం మాట్లాడే మోదీ.. హిందూహిందూ అని కొట్టుకునే బండి సంజయ్.. వేములవాడకు ఒక్క రూపాయి ఇస్తమని చెప్పిండ్రా? ఈ దేవస్థానాన్ని బాగుచేస్తమని చెప్పిండ్రా? నాడు దేవాలయ ప్రాంతం ఇరుకుగా ఉంటే.. నేనే 35 ఎకరాల స్థలాన్ని చెరువులోంచి ఇప్పించి, అభివృద్ధి చేయించిన. అయినా ఏనాడూ దేవుడి పేరు చెప్పి ఓట్లు అడగలేదు. ఇప్పుడు దేవుని పేరు చెప్పి ఓట్లు అడిగేటోళ్లు దేవునికి ఒక్క రూపాయికి కూడా ఇవ్వలేదు.
ఆనాడు చేనేత బిడ్డలు ఆత్మహత్యలు చేసుకుంటుంటే పార్టీ నుంచి రూ.50 లక్షలు తెచ్చి ఒక ట్రస్టు ఏర్పాటు చేసిన. స్వరాష్ట్రం వచ్చిన తర్వాత కేటీఆర్ ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా అనేక పథకాలు తెచ్చుకున్నం. రంగులు, రసాయనాలు తెచ్చుకున్నం. సిరిసిల్లకు ఒక టెక్స్టైల్ పార్క్ కావాలంటే మోదీ ఇవ్వలేదు. అయినా రాష్ట్రం చేతిలో ఉన్నంతలో బతుకమ్మ చీరెలు, స్కూల్ యూనిఫాంలు ఇచ్చి కాపాడుకున్నం. మరమగ్గాల కార్మికులను ఆదుకున్నం. కనీసం నెలకు రూ.15 వేల నుంచి రూ.20 వేలు జీతం వచ్చేలా పనులు చేసుకున్నం. కాంగ్రెస్ సర్కారు అన్నీ బంద్ పెట్టింది. పాత బకాయిలు ఇవ్వటం లేదు. కొత్త ఆర్డర్లూ ఇస్తలేదు. పేదలకు బట్టలు, చేనేతలకు పని దొరుకుతుందని మేము ప్రారంభిస్తే.. ఈ ప్రభుత్వం ఎందుకు బంద్ పెట్టింది?
పదేండ్ల కిందట విదేశాల్లోని నల్లధనం తీసుకోస్తానని మోసపూరిత హామీ ఇచ్చిండు మోదీ. ప్రతి ఒక్కరి అకౌంట్లో రూ.15 లక్షలు వేస్తామన్నడు. ‘సిరిసిల్లలో ఎవరికైనా వేసిండా? బండి సంజయ్ మీకు తెచ్చి ఇచ్చిండట కదా?.. అని కేసీఆర్ అడగ్గానే లేదు అంటూ ప్రజలు ఖాళీ చేతులు ఊపుతూ సమాధానం ఇచ్చారు’ సబ్కా సాత్ సబ్కా వికాస్ ఏమైంది? అమృత్కాల్ వచ్చిందా? అచ్చేదిన్ వచ్చిందా? బేటీ పడావో బేటీ బచావో ఏమైనా వచ్చిందా? జన్‌ధన్ ఖాతా ఏమైంది? అంటే ఏమీ రాలేదు. అంతా గ్యాస్.. ట్రాష్. ఏ పేదకూ ఏం జరగలె. గొల్లకుర్మకు గొర్లు ఇస్తామంటే దాన్నీ అడ్డుకున్నరు. మళ్లీ బీజేపీ గెలిస్తే పెట్రోల్ ధరలు రూ.400 అవుతయ్. ఆలోచన చేయకపోతే మోసపోయి గోసపడతం.
తెలంగాణలో మోసపూరిత హామీలు ఇచ్చి, అరచేతిలో వైకుంఠం చూపెట్టి గద్దెకెక్కిన కాంగ్రెస్ ఉచిత బస్సు హామీ తప్ప ఏదీ నెరవేర్చలేదు. మహిళలకు రూ.2,500 ఇవ్వలేదు. రూ.2 లక్షల రుణమాఫీ చేయలేదు. ఉచిత బస్సుల్లో ఒకవైపు ఆడవాళ్లు సర్కస్ చేసినట్టు తన్నుకుంటున్నరు. మరోవైపు ఆటోరిక్షా కార్మికులు రోడ్డునపడి అన్నమో రామచంద్రా అని ఏడుస్తున్నరు. రైతులకు రైతుబంధు వచ్చిందా? అవి ఇక రావు. రైతుబంధు రాలె, కరెంటు రాలె, నీళ్లు రాలె, మరమగ్గాలు మూతబడే పరిస్థితి, చేనేతలు చనిపోయే పరిస్థితులు వచ్చాయి. సిరిసిల్లలో ఉన్న రచయిత పెద్దింటి అశోక్ వంటి రచయితలు.. విద్యార్థులు, యువకులు, చదువుకున్నవారు, మేధావులు ప్రజలను చైతన్యం చేసి, చర్చపెట్టి ఓటు వేయించాయి. అన్ని వర్గాలను మోసం చేసిన కాంగ్రెస్ మళ్లీ ఓట్లు అడుగుతున్నది. కల్లాల్లో ధాన్యం తడిపోతున్నది. వడ్లు తడిసిపోతే అడిగే దిక్కులేదు. కొనే దిక్కులేదు. పెన్షన్‌దారులకు రూ.4 వేల పెన్షన్ రాదు. వచ్చే అవకాశమే లేదు. ఏ హామీ అమలు అయితదన్న నమ్మకం లేదు.
బోయినపల్లి వినోద్‌కుమార్ చదువుకున్న వ్యక్తి. ఒక మంచి అడ్వకేట్. 2001 నుంచి తెలంగాణ సాధన కోసం నాతో పాటు ఉద్యమంలో ఉన్నడు. తొలినాళ్ల నుంచీ ఉద్యమంలో పాల్గొన్నడు. ఈ రాష్ట్రాన్ని అద్భుతంగా ముందుకు తీసుకెళ్లటంలో భాగస్వామ్యమైన వ్యక్తి. బ్రహ్మాండమైన పనులు చేసిండు. పార్లమెంట్లో మనకోసం కొట్లాడే వ్యక్తి. సిరిసిల్ల మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రాజేశ్వర్‌రావు సేవలు మీకు తెలుసు. ఆయన మేనల్లుడే వినోద్‌కుమార్. ఒక కమ్యూనిస్టు కుటుంబం నుంచి వచ్చి తెలంగాణ కోసం కొట్లాడిండు. వినోద్‌కుమార్‌తో పాటు చాలామంది బీఆర్ఎస్ ఎంపీలు గెలువబోతున్నరు. నంబర్ వన్ మెజార్టీ ఇచ్చి వినోద్‌కుమార్‌ను గెలిపించాలి.
ఎన్టీఆర్ సీఎంగా ఉన్నప్పుడు ఇదే చౌరస్తాలో సిద్దిపేట జిల్లా కావాలని అడిగిన. కానీ ఎవ్వరూ చెయ్యలె. తెలంగాణ వచ్చిన తర్వాత, నేను సీఎంగా అయిన తర్వాత, హరీశ్‌రావు మంత్రి అయిన తర్వాత సిద్దిపేటను జిల్లాగా చేసుకున్నం. సిద్దిపేటను జిల్లా చేయటమే కాదు రైలు తెచ్చుకున్నం. గోదావరి నీళ్లు తెచ్చుకున్నం. ప్రజల సౌలభ్యం కోసం సిద్దిపేట జిల్లాను చేసినం. కానీ ఈ మూర్ఖపు ముఖ్యమంత్రి, కాంగ్రెస్ ప్రభుత్వం సిద్దిపేట జిల్లాను రద్దు చేస్తా అంటున్నది.
తెలంగాణలో మోసపూరిత హామీలు ఇచ్చి, అరచేతిలో వైకుంఠం చూపెట్టి గద్దెకెక్కిన కాంగ్రెస్ ఉచిత బస్సు హామీ తప్ప ఏదీ నెరవేర్చలేదు. బస్సుల్లో ఆడవాళ్లు సర్కస్ చేసినట్టు తన్నుకుంటున్నరు. ఆటోరిక్షా కార్మికులు రోడ్డునపడి అన్నమో రామచంద్రా అని ఏడుస్తున్నరు.
– కేసీఆర్
కరీంనగర్ గడ్డ చైతన్యవంతమైన గడ్డ. తెలంగాణను కాంగ్రెస్ అవమానిస్తే నేను ఎంపీగా రాజీనామా చేసిన. మీరే అంతా ఏకమై సద్దిగట్టి 2.5 లక్షల ఓట్లతో నన్ను ఎంపీగా గెలిపించి, తెలంగాణ ఉద్యమ గౌరవాన్ని పెంచిన గడ్డ ఈ కరీంనగర్ గడ్డ. ఈ క్లిష్టసమయంలో కరీంనగర్ గడ్డ తెలంగాణ గౌరవాన్ని కాపాడాలె. గులాబీ జెండా గౌరవాన్ని కాపాడాలె. రాష్ట్ర ప్రభుత్వం, సీఎం రేవంత్‌రెడ్డి సిరిసిల్ల జిల్లాను రద్దు చేస్తామంటున్నరు. సిరిసిల్ల జిల్లా ఉండాల్నా? పోవాల్నా? సిరిసిల్ల జిల్లా ఉండాలంటే వినోద్‌కుమార్ గెలవాలె. జిల్లా రద్దుచేస్తానంటే అడ్డంబడి కొట్లాడేటోడు.. యుద్ధం చేసేటోడు కావాలె. మీరు నాకు బలాన్నిస్తే సిరిసిల్ల జిల్లాను కాపాడే బాధ్యత నాది. ఎంతకైనా యుద్ధం చేద్దాం. ఈ ఎన్నికల్లో సిరిసిల్ల జిల్లా కాపాడుకోవాలన్నా, గోదావరి జలాలు కాపాడుకోవాలన్నా, నేత కార్మికుల జీవితాలు మునుపటి లెక్క బాగుండాలన్నా బీఆర్ఎస్ను గెలిపించాలి. ఎంపీ బండి సంజయ్‌కు, వినోద్‌కు ఏమన్నా పోలిక ఉన్నదా? బండి సంజయ్ మాట్లాడితే మనకు ఏమైనా అర్థమైతదా? ఆయన మాట్లాడేది ఏం భాష? హిందీయా? ఇంగ్లిషా? తెలుగా?
సిద్దిపేట జిల్లా కలెక్టర్‌గా వెంకట్రామిరెడ్డి ఎంతో సేవ చేశారు. ఊర్లలో ఉన్న మొక్కలు ఆయన హయాంలో నాటించినవే. హరీశ్ నాయకత్వంలో సిద్దిపేటను బ్రహ్మండంగా అభివృద్ధి చేసుకున్నం. వెంకట్రామిరెడ్డి పదవులకు, డబ్బులకు ఆశపడి రాలె. ఇప్పటికే ఎమ్మెల్సీగా ఉన్నరు. ఆయనను గెలిపిస్తే 7 నియోజకవర్గాల్లో కల్యాణ మండపాలు కట్టి ఒక్క రూపాయికే పేదలకు పెండ్లిళ్లు జరిపిస్తా అన్నరు. రూ.100 కోట్లతో ట్రస్టు పెట్టి పేద విద్యార్థులకు చదువు చెప్పిస్తా అన్నరు. అలాంటి నాయకుడు గెలవటం అందరికీ గౌరవం, ప్రజలందరికీ లాభం. అభివృద్ధి కొనసాగాలంటే, మన హక్కులు రావాలంటే.. మన నీళ్లు మనకు ఉండాలంటే.. కచ్చితంగా అసెంబ్లీ ఎన్నికల్లో హరీశ్‌రావుకు ఇచ్చిన మెజార్టీ కంటే ఎక్కువ మెజార్టీని.. లక్ష మెజార్టీ ఇచ్చి వెంకట్రామిరెడ్డిని గెలిపించాలి’ అని పిలుపునిచ్చారు. సిద్దిపేట మెజార్టీ ఎంత? అని కేసీఆర్ ప్రశ్నించగా.. లక్ష అని ప్రజలు పెద్దగా కేకలు వేస్తూ బదులిచ్చారు. సిద్దిపేట మెజార్టీతోనే వెంకట్రామిరెడ్డి గెలుస్తారని కేసీఆర్ అన్నారు. వెంకట్రామిరెడ్డి గెలుపులో సిద్దిపేట, మెదక్ గెలుపు ఉన్నదని తెలిపారు. ఏ రోజు వచ్చినా తమ బిడ్డగా ప్రేమను చూపిస్తున్నారని, అదే ప్రేమతో, అదే ఉత్సాహంతో పనిచేసి లక్ష ఓట్ల మెజార్టీ ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
సిద్దిపేటలో నాకు చాలా గొప్పగా స్వాగతం పలికారు. నా గుండెల నిండా సంతోషం కలిగింది. ఒకనాడు ఇదే అంబ్కేదర్ చౌరస్తాలో నేను కరీంనగర్‌కు ఉద్యమం కోసం పోతుండే గుండెలనిండా ధైర్యాన్నిచ్చిన గడ్డ సిద్దిపేట గడ్డ. సిద్దిపేట కన్నబిడ్డను. కాబట్టి సిద్దిపేట మట్టికి నా వందనం. కాంగ్రెస్ పార్టీ అరచేతిలో వైకుంఠం చూపించి, అలవిగాని హామీలిచ్చి గదెనెక్కింది. రైతుబంధు పడలేదు. కరెంట్ కోతలు మొదలైనయ్. రంగనాయకసాగర్ ఎండబెట్టిండ్రు. రైతుల పండలు ఎండబెట్టిండ్రు. కాంగ్రెస్ 6 ప్రధాన హామీలతో 420 హామీలిస్తే ఏ ఒక్కటీ జరగలేదు.
నరేంద్ర మోదీ వచ్చి గోదావరి నీళ్లను ఎత్తుకపోతమని అంటుండు. ఇక్కడున్న కాంగ్రెస్‌వాళ్లు నోళ్లు మెదపరు. బీఆర్ఎస్ హయాంలో గోదావరి నుంచి నీళ్లు తెచ్చి అప్పర్‌మానేరు బాగు చేసుకున్నాం. నీళ్లతో మిడ్‌మానేరు కళకళలాడింది. ఇప్పుడు దాన్ని కూడా ఎండబెట్టిర్రు. ఇప్పుడు గోదావరి పోతే, తెలంగాణ ఆశలు ఆవిరై పోతయ్. ఆలోచించి, చర్చించి ఓటు వేయాలి.
– కేసీఆర్
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో జరిగిన రోడ్‌షోలో తనను కలిసేందుకు ఆసక్తి చూపుతున్న ప్రజలతో కరచాలనం చేస్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్
తెలంగాణలో అభివృద్ధి కొనసాగాలంటే, మన హక్కులు మనకు దక్కాలంటే బీఆర్ఎస్ అభ్యర్థులు గెలవాలి. అసెంబ్లీ ఎన్నికల్లో హరీశ్ ఇచ్చిన మెజార్టీని మించి, ఈసారి సిద్దిపేట నుంచి లక్ష మెజార్టీ ఇచ్చి వెంకట్రామిరెడ్డిని గెలిపించాలి. కరీంనగర్లోఉన్నత విద్యావంతుడైన వినోద్‌ను పార్లమెంటుకు పంపాలి.
– కేసీఆర్